బీబీసీ 100 మంది మహిళల జాబితా 2022

బీబీసీ 100 మంది మహిళలు 2022 : ఈ ఏడాది చోటు దక్కిందెవరికి?

100 మంది మహిళలు- బీబీసీ వరల్డ్ సర్వీస్

ప్రపంచ వ్యాప్తంగా 100 మంది స్ఫూర్తిదాయకమైన, ప్రభావవంతమైన మహిళల జాబితా 2022ను బీబీసీ విడుదల చేసింది.

వారిలో సంగీత కళాకారిణి బిల్లీ ఎల్లీష్, ఉక్రెయిన్ మొదటి మహిళ ఓలెనా జెలెన్‌స్కా, నటి ప్రియాంక చోప్రా జోనస్​, సెల్మా బ్లెయిర్, ది షరీనా ఆఫ్ రష్యన్ పాప్ అల్లా పుగుచేవా, ఇరానియన్ క్లింబర్ ఎల్నాజ్ రెకాబీ, ట్రిపుల్ జంప్ అథ్లెట్ యులిమార్ రోజాస్, ఘనా రచయిత్రి నానా దార్కోవా సెక్యియామా తదితరులు ఉన్నారు.

ఇది 100 మంది మహిళల పదో సీజన్. గత పదేళ్లలో ఎలాంటి పురోగతి సాధించామో తెలియజేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. మహిళల హక్కుల నుంచి మీటూ ఉద్యమం వరకు ప్రపంచంలోని ఎంతో మంది మహిళా నాయకుల ముందడుగులు పడ్డాయి. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ప్రపంచం నలుమూలల మహిళలు భావిస్తున్నారు.

ఈ జాబితా ప్రపంచ వ్యాప్తంగా 2022లో మహిళల పాత్రను ప్రతిబింబిస్తుంది. ఇరాన్‌లో మార్పు కోరుతూ మహిళలు చేసిన నిరసనల నుంచి ఉక్రెయిన్ రష్యా యుద్దంలో మహిళల సంఘర్షణ, ప్రతిఘటనల వరకు ఎన్నో విషయాల్లో మహిళల పాత్రను ఈ జాబితా తెలియజేస్తుంది. బీబీసీ 100 మంది మహిళలు 2022 జాబితాలో ఎవరికి చోటు దక్కాలో వారి అభిప్రాయాలను తెలియజేస్తూ మొదటిసారిగా గతంలోని బీబీసీ 100 మంది మహిళలు పలువురిని నామినేట్ చేశారు.

100 మంది మహిళల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు మీకు నచ్చినది ఎంచుకోండి

రాజకీయాలు & విద్య

ఫాతిమా అమిరి

ఫాతిమా అమిరి, ఆఫ్గానిస్తాన్

విద్యార్థి

కాబూల్ ట్యూషన్ సెంటర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో గాయాలు పాలైన టీనేజర్లలో ఫాతిమా అమిరి కూడా ఒకరు. ఈ ఆత్మాహుతి దాడిలో 50 మందికి పైగా మరణించారు. వారిలో చాలా మంది అమ్మాయిలే ఉన్నారు. తీవ్ర గాయాలతో బయటపడిన ఫాతిమాకి రెండు కళ్లు పోయాయి. అలాగే చెవి, దవడ భాగం దారుణంగా దెబ్బతింది.

ప్రస్తుతం కాస్త కోలుకుంటున్న ఫాతిమా, తన యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలను అక్టోబర్‌లో రాశారు. ఆ పరీక్షలో 85 శాతానికి పైగా స్కోర్‌ను కూడా సంపాదించారు. ప్రస్తుతం కాబూల్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్సు చదువుతున్నారు. కళ్లు పోవడంతో తాను మరింత ధృడంగా, మరింత బలంగా మారినట్టు తెలిపారు.

మైన్ అల్-ఒబైది

మైన్ అల్-ఒబైది, యెమెన్

న్యాయవాది

యెమెన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం ఈ ఏడాది మరింత హింసాత్మకంగా మారింది. ఈ సమయంలో న్యాయవాది అయిన మైల్ అల్-ఒబైది ఆందోళనకారుల ముట్టడికి గురైన తైజ్ నగరంలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నారు. మధ్యవర్తిత్వం పాత్రను తీసుకున్న ఆమె, సంక్షోభ వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోరాటయోధులను తిరిగి తమ కుటుంబాల వద్దకు చేర్చడమే కాకుండా.. ఒకవేళ ఈ సంక్షోభంలో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను కూడా ఇళ్లకు చేరుస్తున్నారు.

యెమెన్ మహిళా సంఘానికి ఆమె వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. ఖైదీలుగా మారిన మహిళలకు కూడా అండగా నిలుస్తున్నారు. లాయర్స్ సిండికేట్ కౌన్సిల్‌కి పదోన్నతి పొందిన తొలి మహిళ కూడా ఈమెనే. ఈ కౌన్సిల్ మానవ హక్కులు, స్వేచ్ఛా కమిటీలను పర్యవేక్షిస్తుంది.

జోయ్ న్గోజీ ఈజైలో

జోయ్ న్గోజీ ఈజైలో, నైజీరియా

లా ప్రొఫెసర్

నైజీరియా యూనివర్సిటీలో న్యాయ విభాగానికి డీన్‌గా, ప్రజల అక్రమ రవాణాకు సంబంధించి యూఎన్ ప్రత్యేక ప్రతినిధిగా జోయ్ న్గోజీ ఈజైలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ మానవ హక్కుల విషయంలో ప్రముఖంగా వ్యవహరించారు.

ఉమెన్ ఎయిడ్ కలెక్టివ్(WACOL)కి వ్యవస్థాపక డైరెక్టర్‌గా కూడా జోయ్ న్గోజీ ఈజైలో ఉన్నారు. నైజీరియాలో దుర్భర పరిస్థితిల్లో ఉన్న 60 వేల మంది మహిళలకు ఉచితంగా న్యాయ సాయం, వసతిని ఇది కల్పిస్తుంది. తమర్ లైంగిక వేధింపుల రిఫరల్ సెంటర్‌ని కూడా స్థాపించారు. వేధింపులకు గురైన బాధితులకు వెంటనే సాయమందించేందుకు ఇది పనిచేస్తుంది.

Chimamanda Ngozi Adichie

2021 విజేత, రచయిత్రి చిమమండ న్గోజీ అడిచీ ఈమెను నామినేట్ చేశారు.

పేద ప్రజలకు ముఖ్యంగా ఎవరి మానవ హక్కులైతే ఉల్లంఘించబడ్డాయో ఆ మహిళలకు, బాలికలకు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తూ ఎంతో మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారు ప్రొఫెసర్ ఈజైలో.

చానల్ కాంటోస్

చానల్ కాంటోస్, ఆస్ట్రేలియా

శృంగార సమ్మతి కార్యకర్త

ఈమె ’టీచ్ అజ్ కన్సెంట్‘ వ్యవస్థాపకురాలు. 2021లో చానల్ కాంటోస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పోస్టు చేశారు. దానిలో ఎవరైనా తమ పాఠశాలలో లైంగికంగా వేధించబడుతున్నారా? అని అడిగారు. 24 గంటల్లోనే దాదాపు 200 మంది అవుననే సమాధానం పంపారు.

ఆమె ఆస్ట్రేలియాలో ముందస్తు సమ్మతి ఎడ్యుకేషన్‌కై పిలుపునిస్తూ ఓ పిటిషన్ ప్రారంభించారు. ఆమె ఈ క్యాంపెయిన్‌కు ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఆమె ప్రారంభించిన ఈ క్యాంపెయిన్‌తో 2023 నుంచి సమ్మతి ఎడ్యుకేషన్ కేజీ నుంచి 10వ తరగతి వరకు తప్పనిసరి అయింది.

మారియా ఫెర్నాండ కాస్ట్రో మాయ

మారియా ఫెర్నాండ కాస్ట్రో మాయ, మెక్సికో

దివ్యాంగుల సామాజిక కార్యకర్త

దివ్యాంగురాలైన ఫెర్నాండ క్యాస్ట్రో ఇతర వ్యక్తుల వలె రాజకీయాల్లో పాలుపంచుకోవడానికి పోరాడుతున్నారు. దివ్యాంగుల హక్కుల అడ్వొకేట్ గ్రూపులో ఈమె ఒకరు. హ్యూమన్ రైట్స్ వాచ్ మద్దతు ఉంది. మెక్సికో రాజకీయ పార్టీలలో మేధావులు, దివ్యాంగులను కూడా చేర్చుకోవాలని అభ్యర్థించింది.

రాజకీయాలకు సంబంధించిన ఆమె రచనల్లో భాషా సౌలభ్యం ఉంటుంది. ఎన్నికల కార్యక్రమాల్లో వాటిని పొందుపరిచేవిలా ఉంటాయి. దివ్యాంగుల హక్కులపై ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఐక్యరాజ్య సమితికి వెళ్లిన మెక్సికన్ ప్రతినిధి బృందంలో క్యాస్ట్రో ఒకరు. గ్లోబల్ నెట్‌వర్క్ ఇన్‌క్లూషన్ ఇంటర్నేషనలో కూడా ఆమె ఒక ప్రతినిధి.

ఇవా కోపా

ఇవా కోపా, బోలివియా

రాజకీయ నాయకురాలు

బోలివియా రాజకీయాలను ఇవా కోపా ఒక కుదుపు కుదిపారు. ఈమె మాజీ విద్యార్థి నాయకురాలు, సామాజిక కార్యకర్త. ఈఐ ఆల్టో మేయర్‌గా తన పార్టీ నామినేషన్ పొందడంలో విఫలమైనప్పటికీ, వారి అభ్యర్థికి వ్యతిరేకంగా నిల్చుని 69 శాతం ఓట్లతో విజయం సాధించారు. మహిళల కోసం ఇటీవలే ఆమె సిటీ ప్రణాళికను కూడా విడుదల చేశారు. ఈ ప్రణాళికలో తమ విధానం, పెట్టుబడులతో మహిళల హక్కులను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

కోపాకి రాజకీయాలు కొత్త కాదు. 2015 నుంచి 2020 వరకు సెనేటర్‌గా పని చేశారు. అధికార పార్టీతో ఆమె విడిపోయి తర్వాత బోలివియా రాజకీయాలలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

మనకు మరింత మంది మహిళా నాయకులు కావాలి.

ఇవా కోపా

సెపిడే క్వోలియాన్

సెపిడే క్వోలియాన్, ఇరాన్

రాజకీయ ప్రచారకర్త

న్యాయ విద్యార్థి అయి సెపిడే క్వోలియాన్ ఐదేళ్ల పాటు జైలులోనే గడిపారు. సౌత్‌వెస్ట్ ఇరాన్‌లో కుజెస్తాన్‌ ప్రావిన్స్‌లో వర్కర్ల హక్కుల కోసం పోరాడుతుండటంతో, ఆమెకు జైలు శిక్ష పడింది. గత నాలుగేళ్లలో, నాలుగు రకాలైన ఇరాన్ జైళ్లలో ఆమెను ఉంచారు. దీనిలో ఎవిన్ కూడా ఒకటి. రాజకీయ ఖైదీలకే ఇది ప్రధాన స్థలంగా ఉండేది. అక్టోబర్ 2021లో క్వోలియాన్‌ను అక్కడికి బదిలీ చేశారు.

జైలులో ఉన్నప్పటికీ, తన కర్తవ్యాలను మాత్రం సెపిడే ఆపలేదు. ఒక ఆడియో టేపును కూడా విడుదల చేశారు. ఈ టేప్‌లో తాను ఎదుర్కొన్న అమానవీయ సంఘటనలను కూడా వివరించారు. జైలులో ఉన్నప్పుడు, తన తోటి మహిళా ఖైదీల స్వరంగా నిలిచేవారు. ఇరాన్ జైళ్లలో మహిళలు ఎదుర్కొంటున్న అనుభవాలపై టార్చర్ అండ్ ఇన్‌జస్టిస్ అంటూ ఒక పుస్తకం కూడా రాశారు. జైలులో ఉన్నప్పుడే ఈ పుస్తకం రాయడం ప్రారంభించారు.

నజానిన్ జఘారి-రాట్‌క్లిఫ్

నజానిన్ జఘారి-రాట్‌క్లిఫ్, యూకే/ఇరాన్

ఛారిటీ వర్కర్

చేయని తప్పులకు ఎవరైనా ఖైదీగా లేదా బందీఖానాగా మారితే, ప్రపంచమంతా ఏకం కావాలి. మార్చిలో ఇరాన్ అథారిటీల నుంచి విముక్తి పొందిన తర్వాత బ్రిటీష్-ఇరానియన్ నజానిన్ జఘారి-రాట్‌క్లిఫ్ అన్న మాటలివి. తన భర్త రిచార్డ్ సుదీర్ఘ పోరాటం తర్వాత, బ్రిటీష్ ప్రభుత్వం ఇరాన్‌తో ఉన్న చారిత్రాత్మకమైన వివాదాన్ని పరిష్కరించుకుని, ఆమె విడుదలకు సాయపడింది.

2016లో తన కూతురితో కలిసి సెలవులకు వెళ్లిన సమయంలో, నజానిన్‌ను ఇరాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. బ్రిటీష్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇరాన్ అథారిటీలు ఆమె బందీఖానాను దౌత్య వ్యూహంగా వాడుకున్నారు. ఆరేళ్ల పాటు ఆమె జైలులో బందీఖానాగా ఉన్నారు. ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించినట్టు తొలుత రివాల్యుషనరీ కోర్టు ఆమెకు శిక్షను విధించింది. ఆ శిక్ష 2021లో ముగిసింది. రెండో శిక్ష కింద, దౌత్య పరమైన ఒప్పందం వచ్చేంత వరకు జైలు శిక్ష గడపాల్సిందేనని తెలిపింది. రాట్‌క్లిఫ్ ఈ ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించారు. తన భర్తతో కలిసి ప్రస్తుతం మెమోయిర్ రాస్తున్నారు.

పార్క్ జి-హ్యూన్

పార్క్ జి-హ్యూన్, దక్షిణ కొరియా

రాజకీయ సంస్కరణ కర్త

యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడే పార్క్ జి-హ్యూన్, ఎన్త్ రూమ్స్ అనే దక్షిణ కొరియాలో అతిపెద్ద ఆన్‌లైన్ సెక్స్-క్రైమ్ రింగ్స్‌ను బట్టబయలు చేశారు. ఈ ఏడాది జి-హ్యూన్ తన అనుభవాలను ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం యువ మహిళా ఓటర్లను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అధ్యక్ష రేసులో డెమొక్రాటిక్ పార్టీ ఓడిపోవడంతో, కో-ఇంటీరిమ్ లీడర్‌గా ఆమె పేరును ప్రకటించారు. డిజిటల్ సెక్స్ నేరాలపై ఫోకస్ చేసే మహిళల కమిటీలో ఆమె ఒక సభ్యురాలు. జూన్‌లో ఆమె రాజీనామా చేయడంతో, పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఆ సమయంలో ఆమెకు ఎలాంటి అధికారిక బాధ్యతలు లేనప్పటికీ, రాజకీయాలలో స్త్రీ, పురుష ఇద్దరికీ సమానత్వం కల్పించేందుకు తాను కట్టుబడి ఉంటున్నట్టు ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగాా డిజిటల్ సెక్స్ నేరాలు మహిళా హక్కులకు ప్రమాదం కల్గిస్తున్నాయి. ఈ సమస్యను మనం పరిష్కరించాల్సి ఉంది.

పార్క్ జి-హ్యూన్

ఓలెనా జెలెన్‌స్కా

ఓలెనా జెలెన్‌స్కా, యుక్రెయిన్

తొలి మహిళ

విజయవంతంగా టీవీ స్క్రిప్ట్ రైటర్‌గా రాణిస్తోన్న సమయంలో భర్త వోలోదిమిర్ జెలెన్‌స్కీ 2019లో యుక్రెయిన్ అధ్యక్షుడు కావడంతో ఓలెనా జెలెన్‌స్కా కూడా తన భర్తతో పాటు ప్రపంచ వేదికను పంచుకున్నారు. తొలి మహిళగా ఆమె యుక్రెయిన్ స్త్రీల హక్కుల అభివృద్ధి కోసం పనిచేశారు. అలాగే యుక్రెయిన్ సంస్కృతిని ప్రోత్సహించారు.

రష్యా దాడి తర్వాత, యుక్రెయిన్ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రపంచానికి తెలియజేశారు. అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించిన తొలి విదేశీ అధ్యక్షుడి భార్య ఓలెనా జెలెన్‌స్కా కావడం విశేషం. ఈ సంక్షోభం వల్ల మానసికంగా ప్రభావితమవుతున్న కుటుంబాలకు, పిల్లలకు ఆమె సాయం చేస్తున్నారు.

శాంతియుత సమయాలతో పోలిస్తే మహిళలు ఈ సమయంలో మరిన్ని ఎక్కువ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఎవరైతే ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారో, ఆ మహిళలు ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయకూడదు. మన ఆత్మ విశ్వాసం పెరుగుతుందని నాకు కచ్చితంగా తెలుసు.

ఓలెనా జెలెన్‌స్కా

జాహ్రా జోయా

జాహ్రా జోయా, ఆఫ్గానిస్తాన్

జర్నలిస్టు

తాలిబన్ రూల్ కింద ఆరేళ్ల పాటు మగ్గిన జాహ్రా ‘మహమ్మద్’లాగా మారి, అబ్బాయి మాదిరి డ్రెస్ వేసుకుని పాఠశాలకు వెళ్లే వారు. 2001లో తాలిబన్ల నుంచి ఆఫ్గానిస్తాన్‌ను అమెరికా హస్తగతం చేసుకున్న తర్వాత, జాహ్రాగానే పాఠశాలకు వెళ్లారు. 2011లో జర్నలిస్టుగా ఆమె పనిచేయడం ప్రారంభించారు. అప్పుడు న్యూరూమ్‌లో ఉన్న ఏకైక మహిళా రిపోర్టర్ ఈమెనే కావడం విశేషం.

రుక్సానా మీడియాను జాహ్రా స్థాపించారు. ఇది ఆఫ్గానిస్తాన్‌లో కేవలం స్త్రీవాదానికి అనుకూలతతో నడిచే మొదటి మీడియా సంస్థ. తాలిబన్ల చేతిలో 19 ఏళ్ల బాలిక చనిపోవడంతో, ఆమె పేరుతోనే ఈ మీడియా సంస్థను జాహ్రా ఏర్పాటు చేశారు. అయితే ఆఫ్గానిస్తాన్‌ మళ్లీ తాలిబన్ల చేతికి వెళ్లడంతో, 2021లో ఆమె ఆ దేశం విడిచి బయటికి వచ్చేశారు. ప్రస్తుతం రుక్సానా మీడియాను యూకే నుంచి నిర్వహిస్తున్నారు. జాహ్రాకు గేట్స్ ఫౌండేషన్ 2022 ఛేంజ్‌మేకర్ అవార్డు కూడా దక్కింది.

నేను పదాలకున్న మృదువైన శక్తిని నమ్ముతాను. మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్యాయాల గురించి మనం తప్పనిసరిగా మాట్లాడాలి.

జాహ్రా జోయా

సిమోనె టిబెట్

సిమోనె టిబెట్, బ్రెజిల్

బ్రెెజిలియన్ ఫెడరల్ సెనేట్‌ సభ్యురాలు

దేశంలోని ప్రజలు వివిధ వర్గాలుగా విడిపోయిన ఈ సమయంలో, ఈ ఏడాది అధ్యక్ష రేసులో బ్రెజిలియన్ సెనేటర్ సిమోనె టిబెట్ మూడో సారి పోటీ చేశారు. 2002లో ఆమె రాష్ట్ర ప్రతినిధిగా ఎంపికయ్యారు. 2004, 2008లలో తన ప్రాంతం ట్రెస్ లాగోస్‌కి మేయర్‌గా పనిచేశారు. 2014లో టిబెట్ వాలిడ్ ఓట్లలో 52 శాతానికి పైగా సంపాదించి సెనేట్‌కి ఎంపికయ్యారు.

సెనేట్‌ జస్టిస్ కమిటీకి, రాజ్యాంగానికి ఛైర్‌గా వ్యవహరించిన తొలి మహిళ టిబెట్‌నే. ఛాంబర్‌కి ఇది అత్యంత ముఖ్యమైన ప్యానల్‌గా పరిగణిస్తారు. దశాబ్ద కాలానికి పైగా ఆమె లా ప్రొఫెసర్‌గా పనిచేశారు. మహిళలపై జరిగే హింసను అరికట్టేందుకు జాయింట్ కమిటీకి ఛైర్‌గా కూడా వ్యవహరించారు.

భవిష్యత్ మహిళలదేనని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. తాను ఏ ప్రాంతనైతే కోరుకుంటుందో ఆ ప్లేస్ మహిళలది అవ్వాలి.

సిమోనె టిబెట్

కిసానెట్ టెడ్రోస్

కిసానెట్ టెడ్రోస్, ఎరిత్రియా

విద్యా వ్యవస్థాపకవేత్త

కంటెంట్ క్రియేటర్, వ్యవస్థాపకవేత్త అయిన కిసానెట్ టెడ్రోస్.. బెలెస్ బూబు అనే యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతున్నారు. ఎరిత్రియన్ పిల్లలకు వారి భాష, సంస్కృతిని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా బోధిస్తున్నారు. ఎథియోపియాలో జన్మించిన ఈమె, మూలాలను తెలుసుకునేందుకు భాషను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమో చిన్న వయసులోనే తెలుసుకున్నారు. అప్పటి నుంచి భాష ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేస్తున్నారు.

డిజిటల్ కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు ఎరిత్రియా, ఉగాండ, కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్‌ నుంచి డిజిటల్ ఆర్టిస్టులను, వాయిస్‌లను ఆమె నిర్మాణ బృందం ఒక వేదికపైకి తీసుకొస్తుంది. కంపాలా, ఉగాండలలో శరణార్థుల కోసం తొలి బెలెస్ బూబు కిడ్స్ ఫెస్టివల్‌ను కూడా టెడ్రోస్ నిర్వహించారు.

ఇబిజోక్ ఫాబోరొడే

ఇబిజోక్ ఫాబోరొడే, నైజీరియా

ఎలక్ట్‌హర్ వ్యవస్థాపకురాలు

ఇబిజోక్ ఫాబొరొడే నైజీరియాలో మహిళల రాజకీయ ఉద్యమాలను ఎలక్ట్‌హర్ ద్వారా ముందుకు తీసుకెళుతున్నారు. రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యం, సమానత్వం కోసం ఆమె ఆర్గనైజేషన్ పోరాడుతోంది. ఆఫ్రికా రాజకీయాల్లో ఉన్న దాదాపు 2 వేల మంది మహిళలతో ఈ సంస్థ సంబంధాలు ఏర్పరుచుకుంది. ఎజెండర్35 క్యాంపెయిన్ ద్వారా 35 మంది మహిళలతో 2023లో లోకల్ లేదా ఫెడరల్ ఆఫీస్లు పెట్టి జనరల్ ఎలక్షన్ల కోసం మానవ, ఆర్థిక సంబంధిత సాయం చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది.

ఎన్నికల డేటా విశ్లేషించడానికి అందుబాటులోకి తీసుకొచ్చిన మొట్టమొదటి ఆఫ్రికన్ ఫెమినిస్టు మొబైల్ యాప్‌కి వెనుకున్న వ్యక్తి ఇబిజోక్. ప్రజాస్వామ్య పద్దతులను అభివృద్ధి చెందించడానికి కొత్త మార్గాలను వెతికే లీడర్‌షిప్ కౌన్సిల్ ఆఫ్ ది డెమొక్రసీ అండ్ కల్చర్ ఫౌండేషన్‌లో ఆమె ప్రస్తుతం పనిచేస్తున్నారు.

తైసియా బెక్బులాటోవా

తైసియా బెక్బులాటోవా, రష్యా

జర్నలిస్టు

ప్రముఖ రష్యన్ పాత్రికేయురాలు అయిన తైసియా బెక్బులాటోవా 2019లో స్వతంత్ర మీడియా సంస్థ హోలోడ్‌ను స్థాపించారు. యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధ సమాచారాన్ని విస్తృతంగా రిపోర్టు చేసింది ఈ సంస్థ. అంతేకాక అసమానత, హింస, మహిళల హక్కులపై పలు కథనాలను ప్రచురించింది. దీంతో ఏప్రిల్ నెలలో రష్యన్ అథారిటీలు ఈ మీడియా అవుట్‌లెట్‌ను బ్లాక్ చేశారు. స్వతంత్ర మీడియాపై కొరడాను ఝళిపిస్తూ.. ఈ మీడియా సంస్థపై కూడా నిషేధం విధించారు.

తమ మీడియా సంస్థను బ్లాక్ చేసినప్పటికీ, బెక్బులాటోవా, తన టీమ్ కలిసి తమ వర్క్‌ను మాత్రం కొనసాగించారు. దీంతో వారి పాఠకుల సంఖ్య పెరిగింది. 2021లో రష్యాను వీడటంతో, బెక్బులాటోవాపై విదేశీ ఏజెంట్‌గా ముద్ర వేసింది మాస్కో దేశం. ఫ్రంట్‌లైన్ నుంచి యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ఆమె, యుక్రెయిన్ వెళ్లారు.

ఆధునిక నాగరికత ఎప్పుడూ ధృడంగా ఉండదు. దీన్ని తేలిగ్గా నాశనం చేయొచ్చు. సాధారణంగా మహిళల హక్కులను తొలుత కాలరాసేందుకు చూస్తూ ఉంటారు.

తైసియా బెక్బులాటోవా

నథాలీ బెక్వార్ట్

నథాలీ బెక్వార్ట్, వాటికన్

నన్

బిషప్స్ సమావేశానికి(synod of bishops) అండర్‌సెక్రటరీగా పోప్ ఫ్రాన్సిస్ నియమించిన తొలి మహిళా నథాలీ బెక్వార్ట్. ఈ పదవిని చేపట్టిన ప్రథమ మహిళ నథాలీనే కావడం విశేషం. కేథలిక్ చర్చిలో అత్యంత ముఖ్యమైన అంశాలకు పోప్‌కు సలహాలు ఇచ్చే నాయకులలో ఆమె కూడా ఒకరు. అంతేకాక ఓటింగ్ హక్కులు కలిగి ఉన్న ఏకైక మహిళ కూడా నథాలీనే. మహిళలకు కూడా ఈ పదవులు అందుబాటులోకి వచ్చాయనే దానికి సంకేతంగా నథాలీ నియామకం జరిగిందని 2021లో ఈ బాడీ సెక్రటరీ జనరల్ చెప్పారు.

అంతకుముందు, కేథలిక్ చర్చి గుర్తించిన ఆధ్యాత్మిక సిస్టర్స్ ఇన్‌స్టిట్యూట్ జేవియర్స్ కాంగ్రిగేషన్‌కి చెందిన ఫ్రెంచ్ నన్, నేషనల్ సర్వీసుకి తొలి మహిళా డైరెక్టర్‌గా పనిచేశారు. ఫ్రాన్స్‌లో యువత దైవ సన్నిధిలో నడిచేలా ఈ నేషనల్ సర్వీసు పనిచేసేది.

మహిళలందరూ ఒకే తాటిపైకి వచ్చి హింసకు, వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. అన్ని స్థాయిలలో నాయకత్వ స్థానాలలో మరింత మంది మహిళలను భాగస్వామ్యం చేసేందుకు మద్దతివ్వాల్సినవసరం ఉందని పేర్కొన్నారు.

నథాలీ బెక్వార్ట్

క్రిస్టినా బెర్డిన్‌స్కిక్

క్రిస్టినా బెర్డిన్‌స్కిక్, యుక్రెయిన్

జర్నలిస్టు

యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి, అవార్డు విన్నింగ్ జర్నలిస్టు అయిన క్రిస్టినా బెర్డిన్‌స్కిక్ తన దేశమంతా తిరుగుతూ రిపోర్టు చేశారు. రష్యా యుద్ధం చేస్తున్న పలు ప్రాంతాలకు వెళ్లి మరి ఆమె తన రిపోర్టులను నివేదించారు. ఈ యుద్ధ సంక్షోభ సమయంలో, ప్రజల రోజువారీ జీవితానికి సంబంధించిన వివరాలపై క్రిస్టినా ఎక్కువగా దృష్టి సారించారు.

కెర్సన్‌లో జన్మించిన క్రిస్టినా, కివ్‌లో 14 ఏళ్లుగా రాజకీయ పాత్రికేయురాలిగా పనిచేశారు. ఎన్‌వీ మ్యాగజీన్, పలు టీవీ, రేడియో ప్రాజెక్టులలో పనిచేసిన అనుభవం ఆమెకుంది. యుక్రెయిన్ యూరోమైదాన్ విప్లవంలో పాల్గొన్న వారి గురించి ఆమె ఈ-పీపుల్ పేరుతో సోషల్ మీడియా ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇది ఒక పుస్తకంగా కూడా ప్రచురితమైంది.

జరా మహమ్మదీ

జరా మహమ్మదీ, ఇరాన్

విద్యావేత్త

జరా మహమ్మదీ.. నోజిన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులలో ఒకరు. జరా గత పదేళ్లుగా తన సొంత ప్రాంతం, ఇరాన్​లోని శానందాజ్‌లో కుర్దీష్ భాషను నేర్పిస్తున్నారు.

ఇరాన్ రాజ్యాంగం ప్రకారం విద్యలో ప్రాంతీయ, జాతి పరమైన భాషలకు అనుమతి ఉంది. అయితే లాయర్లు, సామాజిక కార్యకర్తలు మాత్రం గ్రౌండ్ లెవల్‌‌లో ఇలా లేదని వాదిస్తున్నారు. అందుకే పిల్లలు పాఠశాలల్లో తమ మాతృభాష నేర్చుకోలేకపోతున్నారని అంటున్నారు. అయితే గ్రూపులు, సొసైటీలు ఏర్పాటుచేసి జాతీయ భద్రతకు ఆటంకం కలిగిస్తున్నారని జరాకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది ఇరాన్ ప్రభుత్వం. జనవరి 2022 నుంచి ఆమె జైల్లోనే ఉన్నారు.

అయేషా మాలిక్

అయేషా మాలిక్, పాకిస్తాన్

జడ్జి

పాకిస్తాన్ సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జిగా జస్టిస్ అయేషా ఏ. మాలిక్ నియమితులయ్యారు. మహిళల హక్కులను సంరక్షించే ఎన్నో కీలకమైన తీర్పులను ఆమె ఇచ్చారు. అత్యాచార బాధితులకు రెండు వేళ్ల పరీక్షను నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఆమె చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. లైంగిక వేధింపుల కేసుల విచారణలో ఈ కన్యత్వ పరీక్షలను నిర్వహించేవారు. అయితే 2021లో ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమైనదిగా పాకిస్తాన్ సుప్రీంకోర్టు తెలిపింది.

పాకిస్తాన్ సుప్రీంకోర్టులో జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జడ్జీలకు ఆమె శిక్షణ కూడా ఇచ్చారు. పాకిస్తాన్‌లో మహిళా న్యాయమూర్తుల సమావేశాలను ప్రారంభించారు. న్యాయ విధానంలో మహిళా ప్రాధాన్యాన్ని గుర్తు చేసే విధంగా చర్చలను ఆమె ప్రోత్సహిస్తున్నారు.

మహిళలు తప్పనిసరిగా తమ ఆలోచన విధానాలను జోడిస్తూ ఒక కొత్త భవిష్యత్‌ను నిర్మించుకోవాలి. ఈ ప్రయత్నంలో భాగంగా వారు తమ అనుభవాలను, తమ జీవిత గాథలను పంచుకోవాలి.

అయేషా మాలిక్

మియా మోట్లే

మియా మోట్లే, బార్బడోస్

ప్రధాన మంత్రి

బార్బడోస్‌కు ప్రధానమంత్రి అయిన మొదటి మహిళ మియా మోట్లే. జనవరిలో విజయంతో రెండో సారి ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. 2008 నుంచి ఆమె బార్బడోస్ లేబర్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీతో ఈ కరేబియన్ ఐలాండ్‌ తెగదెంపులు చేసుకున్నాక, ప్రపంచంలో మరో కొత్త రిపబ్లిక్‌గా ఆమె బార్బడోస్‌ను నిలిపింది.

వాతావరణ మార్పులపై బహిరంగంగా మాట్లాడగలిగే వ్యక్తిగా మోట్లేకు పేరుంది. COP27లో తన ప్రసంగంలో.. వాతావరణ మార్పులను నిరోధించడంలో సంపన్న దేశాలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం లేదని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోకుంటే 2050 నాటికి కోటి మంది ప్రజలు వాతావరణ మార్పుల వల్ల నిర్వాసితులవుతారని హెచ్చరించారు మోట్లే.

చెంగ్ యెన్

చెంగ్ యెన్, తైవాన్

బౌద్ధ సన్యాసి

ధర్మ మాస్టర్ చెంగ్ యెన్‌ను ఆధునిక తైవాన్ బౌద్ధ మతంలో అత్యంత ప్రభావిత వ్యక్తులలో ఒకరిగా మనం చూడొచ్చు. ట్జు చి ఫౌండేషన్‌కు ఆమె వ్యవస్థాపకురాలు. ఆమెను ఆసియా మదర్ థెరిస్సాగా అభివర్ణిస్తుంటారు.

1966లో 30 మంది గృహిణులు పొదుపు చేసుకున్న నగదుతో ఒక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అవసరమైన వారికి సాయం చేసే వారు. ప్రస్తుతం ఈ సంస్థకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతర్జాతీయంగా వైద్య సాయం, ఇతర సహాయక చర్యలను ట్జు చి ఫౌండేషన్ చేపడుతోంది. విద్యా సంస్థలను, ఆసుపత్రులను కూడా నడుపుతోంది. ప్రస్తుతం ఆమె వయసు 80 ఏళ్లు. ఆమె ఫాలోవర్స్ చెంగ్ యెన్ చూపించిన బాటలో నడుస్తూ ఎన్నో దాతృత్వ కార్యకలాపాలను చేపడుతున్నారు. ఇటీవలే యుక్రెయిన్ యుద్ధంలో శరణార్థులుగా మారిన వారికి ఆర్థిక, వైద్య సాయాన్ని కూడా అందించింది ఈ సంస్థ.

 నావోమి లాంగ్

నావోమి లాంగ్, నార్తరన్ ఐర్లాండ్

రాజకీయ నాయకురాలు

నార్తరన్ ఐర్లాండ్‌లో జరుగుతున్న లైంగిక నేరాలను తగ్గించేందుకు చట్టాన్ని తీసుకొచ్చారు మాజీ న్యాయ శాఖ మంత్రి నావోమి లాంగ్. ఈ ఏడాది నార్తరన్ ఐర్లాండ్‌లో లైంగిక నేరాలు పెరగడంతో.. వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆమె ప్రయతిస్తున్నారు. ఈ విషయంలో తనకు ప్రాణ హాని బెదిరింపులు కూడా వచ్చాయి. అలాగే నావోమి లాంగ్ మహిళా రాజకీయ నాయకురాలకు ఎదురవుతున్న వేధింపులపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

వృత్తి పరంగా సివిల్ ఇంజనీర్ అయిన నావోమి లాంగ్, 1995లోనే అలియెన్స్ పార్టీలో చేరారు. బెల్‌ఫాస్ట్ మేయర్‌గా పనిచేసిన తర్వాత, 2010లో వెస్ట్‌మింస్టర్‌కి తొలి అలియెన్స్ ఎంపీగా ఎంపికయ్యారు. 30 ఏళ్లకు పైగా వెస్ట్‌మింస్టర్ సీటులో ఉన్న తొలి మంత్రి పీటర్ రాబిన్‌సన్‌ తప్పుకోవడంతో ఆమె ఈ పదవిని చేపట్టారు.

బహిరంగ ప్రదేశాలలో వేధింపులను క్రియేట్ చేసే వారిపై మనం పోరాడాల్సి ఉంది. అంటే పురుష అహంకారాలపై, స్త్రీ ద్వేషంపై, లింగ వివక్ష సంస్కృతిపై మనం నేరుగానే తలపడాల్సి ఉంది.

నావోమి లాంగ్

ఉర్సులా వాన్ డెర్ లేయెన్

ఉర్సులా వాన్ డెర్ లేయెన్, జర్మనీ

యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్

ఉర్సులా వాన్ డెర్ లేయెన్ యూరోపియన్ కమిషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు. ఈమె జర్మన్ రాజకీయ నాయకురాలు. ఏంజెలా మెర్కల్ కేబినెట్‌లో పనిచేశారు. జర్మనీలో నియమితులైన తొలి మహిళా రక్షణ శాఖ మంత్రి ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌నే.

బ్రూసెల్స్‌లో జన్మించిన ఈమె, వైద్య, ఆర్థిక విద్యలను అభ్యసించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2019లో ఈయూలో ఉన్నతోద్యోగాన్ని పొందారు. అప్పటి నుంచి బ్రెగ్జిట్, కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌ సంక్షోభం వంటి సమయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఈ ఏడాది కంపెనీ బోర్డులలో లింగ సమానత్వం తీసుకురావాలని తీసుకొచ్చిన ఈయూ చట్టానికి వెనుకున్న వ్యక్తి ఉర్సులానే.

Sanna Marin

2020 విజేత, ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్ నామినేట్ చేశారు.

ఒక సంక్షోభం తర్వాత మరో సంక్షోభాన్ని యూరప్ ఎదుర్కొంటోన్న సమయంలో.. ఈ సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొని, వాటి నుంచి బయటపడేందుకు యూరోపియన్ యూనియన్‌కు అసమానమైన పరిష్కారాలను ఉర్సులా చూపించారు.

రోజా సాలీహ్

రోజా సాలీహ్, స్కాట్లాండ్

రాజకీయ నాయకురాలు

2022 మేలో గ్లాస్గో సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన మొదటి శరణార్థి రోజా సాలిహ్. రోజా చిన్నతనంలో ఉండగా ఇరాక్ నుంచి ఆమె కుటుంబాన్ని బలవంతంగా పంపించివేయడంతో ఆమె కుటుంబం స్కాట్లాండ్ వలస వచ్చింది. ఇపుడు ఆమె గ్రేటర్ పొలాక్ వార్డుకు ఎస్ఎన్పీ కౌన్సిలర్. శరణార్థుల హక్కుల కోసం సాలీహ్ టీనేజర్‌గా ఉన్నప్పటి నుంచే క్యాంపెయిన్‌లు నిర్వహించేవారు. తన పాఠశాల స్నేహితులతో కలసి స్నేహితుల నిర్బంధంపై పోరాడేవారు.

శరణార్థుల కోసం పిలుపునిచ్చిన గ్లాస్గో గర్ల్స్ క్యాంపెయిన్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అయింది. టర్కీలోని కుర్దీష్ రీజియన్‌లో మానవ హక్కుల కార్యకర్తగా పనిచేశారు. కాగా, స్కాటీస్ సాలీడరీ విత్ కుర్దీస్తాన్‌కు కూడా ఆమె సహ వ్యవస్థాపకురాలు.

ఎరికా హిల్టన్

ఎరికా హిల్టన్, బ్రెజిల్

రాజకీయ నాయకురాలు

బ్రెెజిల్‌లో నేషనల్ కాంగ్రెస్‌కి ఎంపికైన తొలి నల్లజాతీయ ట్రాన్స్‌ ఉమెన్ ఈమె. జాత్యహంకారం, ఎల్‌జీబీటీక్యూ ప్లస్, మానవ హక్కుల కోసం ఎరికా హిల్టన్ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

వయసులో ఉన్నప్పుడే, ఆమెను తన కుటుంబం ఇంటి నుంచి బయటికి గెంటివేసింది. దీంతో ఆమె రోడ్లపైనే నివసించేవారు. ఆ తర్వాత ఆమెకు యూనివర్సిటీలో చోటు దక్కింది. విద్యార్థి రాజకీయాల నేపథ్యంతో, సావో పౌలోకి వెళ్లిన హిల్టన్, వామపక్ష రాజకీయ పార్టీ పీఎస్ఓఎల్‌లో చేరారు. 2020లో సిటీ కౌన్సిల్‌కి ఆమె ఎంపికయ్యారు. బ్రెజిల్ అతిపెద్ద నగరంలో ఆకలి మంటలను తీర్చేందుకు మున్సిపల్ ఫండ్‌ను ప్రవేశపెట్టారు ఎరికా హిల్టర్.

మా పోరాటం సమాన హక్కుల కోసం, సమాన వేతనాల కోసం, లింగ వివక్షతకు, హింసకు ఇక ముగింపు పలకాలి. నల్లజాతీయులైనా, లాటిన్ అయినా, శ్వేత జాతీయులైనా, పేద అయినా, ధనికులైనా లేదా ట్రాన్స్‌జెండర్లైనా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, సమాన వేతనం అందాలి.

ఎరికా హిల్టన్

సంస్కృతి & ఆటలు

దీమా అక్తా

దీమా అక్తా, సిరియా

రన్నర్

2012లో దీమా అక్తా ఇంటిపై బాంబు దాడి జరిగింది. ఆ ఘటనలో ఆమె కాలు కోల్పోవడంతో తనకు ఇష్టమైన రన్నింగ్‌కు కూడా దూరం అవ్వాల్సి వచ్చింది. దాదాపు 28 శాతం మంది సిరియన్లు అంగ వైకల్యం బారిన పడ్డారు. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ఇది ప్రపంచంలో ఉన్నదాని కంటే రెట్టింపు. పదేళ్ల తర్వాత అక్తా యూకేలో అడుగుపెట్టారు. పారాలింపిక్స్ 2024 పరుగు పూర్తి చేయడానికి శిక్షణ తీసుకుంటున్నారు.

కరోనా సమయంలో శరణార్థుల కోసం ఆమె ఫండ్ సేకరించారు. ఇంగ్లండ్ మరో ఫుట్ బాల్ బృందం అయిన లయన్ హార్ట్స్‌లో ఆమెను సభ్యురాలిగా గుర్తించారు. ఇటీవలె పాప్ స్టార్ అన్నీ మారీ మ్యూజిక్ వీడియోలో ఆమె కథను అందంగా చూపించారు. దివ్యాంగుల ధైర్యంపై అవగాహన కల్పించడానికి దీమా అక్తా అహర్నిశలు శ్రమిస్తోంది.

జర్ అమీర్ ఎబ్రహిమీ

జర్ అమీర్ ఎబ్రహిమీ, ఇరాన్

నటి

నటి, చిత్ర నిర్మాత అయిన జర్ అమీర్ ఎబ్రహిమీ ఈ ఏడాది కేన్స్‌లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న మొదటి ఇరానియన్‌గా నిలిచారు. హోలీ స్పైడర్ చిత్రంలో నటనకు గాను ఆమెకు ఈ అవార్డు వచ్చింది.సెక్స్ వర్కర్లను హత్య చేస్తున్న ఓ సీరియల్ కిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

అమీర్ ప్రేమ జీవితం మీద అసత్య ప్రచారం చేస్తూ తనను అశ్లీల చిత్రాలతో ఇంటనెట్‌లో పీడించడంతో భరించలేక ఆమె ఇరాన్ వదిలి వెళ్లారు. 2018లో ఆమె పారిస్‌కు వెళ్లిపోయారు. అక్కడే ఆమె అలంబిక్ ప్రొడక్షన్ ప్రారంభించారు. కెమెరా ముందు, వెనక ఆకట్టుకునే విధంగా కెరీర్ మలుచుకున్నారు అమీర్ ఎబ్రహిమీ.

బిల్లీ ఎల్లీష్

బిల్లీ ఎల్లీష్, అమెరికా

గాయనీ, పాటల రచయిత

బిల్లీ ఎల్లీష్ రికార్డు బ్రేకింగ్ సూపర్ స్టార్. గ్రామీ అవార్డు విజేత. చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారే టార్గెట్‌గా రూపొందిన యువర్ పవర్ పాట నుంచి వాతావరణ మార్పు కోసం పాడిన గుడ్ గర్ల్స్ గో టూ హెల్ వరకు సంగీతానికి హద్దులను చెరిపేశాయి.

అబార్షన్ చేసుకునే రాజ్యాంగ హక్కును యూఎస్ సుప్రీంకోర్టు రద్దు చేయడంపై బిల్లీ విమర్శించారు. దీనిపై ఆమె నిరసన తెలిపారు. అంతే కాదు అదే వేదికపై షో చేసిన అతి చిన్న గ్లాస్టర్ బురీ స్టార్‌గా బిల్లీ ఎల్లీష్ చరిత్ర సృష్టించారు. ఆమె బహిరంగంగానే బాడీ ఇమేజ్, పీరియడ్స్ డిప్రెషన్ , టౌరెట్ సిండ్రోమ్‌లపై వ్యాఖ్యానించారు.

మనం జీవిస్తున్న సమయాన్ని నేను ఆకర్షితురాలినయ్యాను. మహిళలు చాలా ఎత్తులో ఉన్నారు. నాలాగా ఆలోచించే మహిళలకు విలువ ఇవ్వకపోడంపై నిరాశకు గురైన సందర్భాలూ ఉన్నాయి.

బిల్లీ ఎల్లీష్

ఓనా కార్బోనెల్

ఓనా కార్బోనెల్, స్పెయిన్

స్విమ్మర్

ఓనా కార్బోనెల్ స్పానీస్ కళాత్మక స్విమ్మర్. ఒకరు ఎలైట్ అథ్లెట్‌గా, తల్లిగా ఉండొచ్చని ఆమె ప్రచారం చేశారు. ఆమె మూడు సార్లు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్నారు. రజత, కాంస్య పతకాలతో సహా 30కి పైగా మేజర్ మెడల్స్‌ను ఓనా గెల్చుకున్నారు.

ఆమె 2020లో మొదటి బిడ్డకు జన్మించారు. అనంతరం టోక్యో ఒలింపిక్ క్రీడల కోసం శిక్షణ ప్రారంభించారు ఓనా. తన కొడుక్కి పాలు కూడా పట్టకుండా ఉన్న నిబంధనల పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చారు. మహిళలు తల్లి, క్రీడాకారిణి రెండూ కావొచ్చని ఆమె తన కథను ఓ డాక్యుమెంటరీలో తెలిపారు.

కాద్రీ కియుంగ్

కాద్రీ కియుంగ్, హాాంకాంగ్

ఫ్యాషన్ డిజైనర్

దివ్యాంగులకు అందమైన దుస్తులు డిజైన్ చేసి ఇవ్వడం కాద్రీ కియుంగ్‌కు మక్కువ. తన గ్రాండ్ మదర్ ను చూసుకునే విధానంతో స్ఫూర్తి పొంది 2018లో తన తల్లితో కలిసి ఆర్‌హెచ్‌వై‌ఎస్ ఫ్యాషన్ బ్రాండ్‌ను ఆమె ప్రారంభించారు. పెద్దవారికి ఇచ్చే దుస్తులలో స్టైల్, పనితనం ఎక్కువ ఉండటం లేదని ఆమె గ్రహించారు.

కాద్రీ దుస్తుల డిజైన్ సంబంధిత కోర్సులో గ్రాడ్యుయేషన్ చేశారు. కస్టమర్ల అవసరాలను బట్టి కాద్రీ తన మేథస్సును ఉపయోగించి లేస్ లకు బదులు సులభంగా తీసివేయడానికి ఆమె వెల్క్రో ఫాస్టెనింగ్స్ లేదా బ్యాగులను వాడారు. తన బ్రాండ్‌తో ఆమె దాదాపు 90 మంది మహిళలు, దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించారు. 2022లో అత్యాధునిక ఫ్యాషన్ సంబంధిత వస్తువులను ప్రచారం చేయడానికి కియుంగ్ బౌండ్‌లెస్‌ను ప్రారంభించారు.

సారా చాన్

సారా చాన్, దక్షిణ సూడాన్

ఎన్‌బీఏ‌ విశ్లేషకురాలు

మాజీ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ అయిన సారా చాన్ ప్రస్తుతం ఆఫ్రికాలో టీనేజర్లకు మెంటారింగ్ చేస్తూ, వారికి క్రీడా అంశాలను బోధిస్తున్నారు. ఎన్‌బీఏ టొరంటో ర్యాప్టర్స్ బాస్కెట్ బాల్ కోసం ఆఫ్రికాలో విశ్లేషకురాలిగా ఎంపికైన తొలి మహిళా మేనేజర్ ఈమెనే.

సుడాన్ ఖార్టూమ్‌లో యుద్ధం కారణంగా, తాను, తన కుటుంబం కెన్యాకు తరలి వెళ్లింది. అక్కడే చాన్ బాస్కెట్ బాల్ కెరీర్ ప్రారంభమైంది. జాక్సన్, టెన్నెస్సీ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఆమెకు బాస్కెట్ బాల్ స్కాలర్‌షిప్ దక్కింది. ఆఫ్రికా, యూరప్‌లలో ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా ఆడారు.హోమ్ ఎట్ హోమ్, అపిడైట్ ఫౌండేషన్‌ను చాన్ ఏర్పాటు చేశారు. ఈ ఎన్‌జీఓ బాల్య వివాహాలను నిర్మూలిస్తూ.. విద్యను ప్రోత్సహిస్తుంది. బాలికలను పాఠశాలకు రప్పించేందుకు తాను స్పోర్ట్స్‌ను ఒక సాధనంగా వాడుతున్నారు.

నీ గురించి నువ్వేమీ విశ్వసిస్తున్నావో అదే నువ్వు. మీ భవిష్యత్‌ను నిర్ణయించే కలలను, ఆకాంక్షలను మీరు నమ్మండి.

సారా చాన్

ప్రియాంక చోప్రా జోనస్

ప్రియాంక చోప్రా జోనస్, భారత్

నటి మరియు నిర్మాత

60కి పైగా చిత్రాలలో నటించిన ప్రియాంక చోప్రా జోనస్ బాలీవుడ్‌లో అతిపెద్ద ఫిల్మ్ స్టార్లలో ఒకరు. 2002లో ఆమె తొలిసారి నటనలోకి రంగ ప్రవేశం చేసిన తర్వాత.. ఈ మాజీ విశ్వ సుందరి హాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టారు. అమెరికన్ నెట్‌వర్క్ డ్రామా సిరీస్(క్వాంటికో, 2015)లో ప్రధాన పాత్ర పోషించిన ఈమె, అంతర్జాతీయ చిత్ర సీమలో అడుగు పెట్టిన తొలి దక్షిణాసియా నటిగా చరిత్ర సృష్టించారు.

ఇజింట్ ఇట్ రోమాంటిక్, ది మ్యాట్రిక్స్ రిసర్రెక్షన్స్ వంటి పలు మూవీల్లో ప్రియాంక చోప్రా జోనస్ నటించారు. తన సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రియాంక చోప్రా జోనస్ నెలకొల్పారు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా భారత్‌లో పలు సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా జోనస్ యూనిషెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. బాలల హక్కులు, బాలికల విద్యపై ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు.

మీటూ మూవ్‌మెంట్‌ సమయంలో మహిళలందరూ ఒకే తాటిపైకి వచ్చి గొంతెత్తి నినదించారు. ఒకరికొకరు అండగా నిలిచారు. ఒకరి తరఫున మరొకరు నిలిచారు- కలసికట్టుగా సాగడంలో ఏదో ప్రత్యేకమైన శక్తి ఉంది.

ప్రియాంక చోప్రా జోనస్

ఆన్స్ జబీర్

ఆన్స్ జబీర్, తునీషియా

టెన్నిస్ క్రీడాకారిణి

2022 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్‌లో చారిత్రాత్మకమైన స్కోరు చేసిన తర్వాత, గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న తొలి అరబ్/ ఆఫ్రికన్ మహిళ తునీషియా టెన్నిస్ స్టార్ ఆన్స్ జబీర్‌నే. ఆ తర్వాత కేవలం కొన్ని నెలల్లోనే, యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కి కూడా చేరుకున్నారు.

ఆన్స్‌ కేవలం మూడేళ్లున్నప్పటి నుంచే టెన్నిస్ ఆడటం ప్రారంభించారు. ఇప్పుడు 28 ఏళ్ల వయసు. ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్(WTA) ర్యాంకింగ్‌లో నెంబర్ 2 స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆఫ్రికా లేదా అరబ్ నుంచి ఈ అత్యున్నత స్థానాన్ని దక్కించుకున్న మహిళగా ఆన్స్ నిలిచారు. మూడు కెరీర్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్న ఆన్స్ జబీర్, నూతన తరానికి చెందిన ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

స్నేహ జవాలే

స్నేహ జవాలే, భారత్

సామాజిక కార్యకర్త

స్నేహ జవాలే తల్లిదండ్రులు అడిగినంత కట్నం ఇవ్వలేదనే కారణంతో 2000 డిసెంబర్‌లో ఆమె భర్త తనని కిరోసిన్‌తో కాల్చాడు. ఈ విషయంపై తన కుటుంబం ఎటువంటి పోలీసు ఫిర్యాదును దాఖలు చేయలేదు. స్నేహ జవాలే భర్త తన కొడుకుని తీసుకుని ఆమెను వదిలి వెళ్లిపోవడంతో, టారోట్ కార్డు రీడర్, స్క్రిప్ట్ రైటర్‌గా మళ్లీ తన జీవితాన్ని పునర్నిర్మించుకున్నారు. ఏ ఉద్యోగాల్లో ప్రజలు తన ముఖాన్ని చూసేందుకు అవకాశం ఉండదో ఆ జాబ్‌లను చేశారు.

జవాలే ప్రస్తుతం సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు. 2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత, హింసకు వ్యతిరేకంగా సర్వైవర్లు ఎదుర్కొంటున్న అనుభవాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రంలో నటించాలని జవాలేను కోరారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నటించడం ద్వారా తన భయాన్ని ఆమె అధిగమించగలిగారు.

గత పదేళ్లలో యాసిడ్ బాధితుల పరంగా సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. నన్ను నేను విశ్వ సుందరి కంటే ఏం తక్కువ కాదని భావిస్తాను. నేను అందమైన దానిననే చెబుతాను. అవును నేను అందగత్తెనే.

స్నేహ జవాలే

రీమా జుఫాలి

రీమా జుఫాలి, సౌదీ అరేబియా

రేసింగ్ డ్రైవర్

సౌదీ అరేబియాలో తొలి ప్రొఫెషనల్ రేసింగ్ డ్రైవర్‌‌గా రీమా జుఫాలి 2018లో చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది సొంతంగా తీబా మోటార్‌స్పోర్ట్ అనే టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ టీమ్ ద్వారా మోటార్ రేసింగ్‌లో సౌదీ అరేబియాకు మరింత యాక్సస్‌ను కల్పించేందుకు, అంతర్జాతీయ జీటీ ఓపెన్‌లో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. క్రీడా రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని మెరుగుపరిచేందుకు పలు రకాల కార్యక్రమాలను, విద్యా అవకాశాలను కల్పించేందుకు తమ టీమ్ కృషి చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర మహిళా రేసింగ్ డ్రైవర్లకు రీమా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. తీబా మోటార్‌స్పోర్ట్‌తో ప్రతిష్టాత్మకమైన లీ మ్యాన్స్ 24 అవర్ రేస్‌లో పాలుపంచుకోవాలని జుఫాలి ఆశిస్తున్నారు.

సమాజంలో మహిళలు ఎన్నో రకాల అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి, సమాజం నుంచి ఆమె మద్దతు కావాల్సి ఉంది. దీంతో ఎన్నో సరికొత్త మార్పులను మనం చూడొచ్చు.

రీమా జుఫాలి

అల్లా పుగచేవా

అల్లా పుగచేవా, రష్యా

మ్యూజిషియన్

మ్యూజికల్ పర్‌ఫార్మర్, కంపోజర్ అయిన అల్లా పుగచేవా 250 మిలియన్లకు పైగా రికార్డులను విక్రయించారు. 500 పాటలను, 100 అల్బమ్స్‌ను ఆమె రూపొందించారు. ప్రస్తుతం ఆమె ప్రదర్శనలు ఆపివేసినప్పటికీ, తన మెజ్జో-సుప్రానో స్వరంతో ఎప్పటికీ సుపరిచితురాలే.

తన మ్యూజిక్‌తో ప్రజలను ఆకట్టుకుంటూ ఉండటంతో.. రష్యన్ ప్రభుత్వం ఆమెకు పలు గౌరప్రదమైన పురస్కారాలను అందజేసింది. అయినప్పటికీ అల్లా పుగచేవా పలు సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన మెసేజ్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. అల్లా పుగచేవాకి 3.6 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. అల్లా పుగచేవా చేసిన ఈ మెసేజ్‌కి ప్రశంసల నుంచి విమర్శలను ఎదుర్కొన్నారు.

మహిళలకు విద్యా, ఆర్థిక పరమైన స్వతంత్రత కోసం జరిపిన పోరాటంలో గణనీయమైన పురోగతిని చూశాం. అయితే ఇప్పటికీ గృహ హింస అనేది చాలా దేశాలలో అతిపెద్ద సమస్యగా ఉంది.

అల్లా పుగచేవా

సెల్మా బ్లెయిర్

సెల్మా బ్లెయిర్, అమెరికా

నటి

సెల్మా బ్లెయిర్ అమెరికా చిత్ర, టెలివిజన్ పరిశ్రమకు చెందిన నటి. ది హెల్‌బాయ్ ఫ్రాంచైజ్, లీగల్లీ బ్లోండ్, పాప్ కల్చర్ క్లాసిక్స్ క్రూయల్ ఇంటెన్షన్స్ వంటి వాటిల్లో సెల్మా బ్లెయిర్ ముఖ్య పాత్ర పోషించారు.

2018లో సెల్మా బ్లెయిర్‌కి మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి ఉన్నట్టు బయటపడింది. ఈ వ్యాధి విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆమె ప్రయత్నించారు. తన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎలాంటి దాపరికాలు లేకుండా నేరుగా ప్రజలతో పంచుకునే వారు. తాను ఎదుర్కొన్న సవాళ్లను ప్రజలకు తెలియజేసేవారు. ఈ ఏడాది సెల్మా బ్లెయిర్ తన మెమోయిర్ ‘మీన్ బేబీ’ను విడుదల చేశారు. బ్యూటీ స్పేస్‌లోకి కూడా సెల్మా బ్లెయిర్ అడుగు పెట్టారు. ఇంక్లూజివ్ మేకప్ బ్రాండుతో జత కట్టారు. దీని ద్వారా ప్రతి ఒక్కరూ తేలిగ్గా ఎర్గోనామిక్ కాస్మోటిక్స్‌ వాడేలా చేయాలన్నది సెల్మా బ్లెయిర్ లక్ష్యం.

అత్యంత కఠినమైన, చేదు గతాన్ని అనుభవించిన మహిళను నేను. ఎన్నో విషయాలు నాకు సవాలుగా నిలిచాయి. ఇవి నాలో ఉన్న సత్తువను తేలిగ్గా బలహీనపరిచేవి. కానీ ఇతర మహిళల చేదోడుతో నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను.

సెల్మా బ్లెయిర్

మిల్లీ

మిల్లీ, థాయ్‌లాండ్

ర్యాప్ ఆర్టిస్ట్

దనుపా ఖానాతీరకుల్ ఆర్టిస్టు, గీత రచయిత్రి. మిల్లీ అనే తన స్టేజీ పేరుతో తాను చాలా పేరుగాంచారు. ఆమె వివాదాస్పద సాహిత్యం వాడుతూ శృంగార సమ్మతి, అసాధారణ సౌందర్య ప్రమాణాలను ఎత్తిచూపారు. ఆమె చాలా భాషలు, మాండలికాల్లో ర్యాప్‌లు పాడారు. అంతేకాకుండా థాయ్‌లాండ్ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ మాండలికాలు కూడా వాడేది. తన మొదటి ఆల్బమ్ బాబ్ బుమ్ బుమ్ అని ఆమె ఇటీవలే ప్రకటించారు.

ఈ ఏడాది జరిగిన కోవాచెల్లా వేడుకల్లో ఆమె ప్రభుత్వాన్ని, థాయ్ మూస పద్దతులను ప్రశ్నించడం ద్వారా సంచలనంగా మారారు. అలాగే థాయ్ సంప్రదాయ వంటకం మామిడి ముక్కలను అన్నంలో కలుపుకుని స్టేజీ మీదే తిన్నారు మిల్లీ. అయితే గతేడాది కోవిడ్ 19 నిర్మూలనపై ప్రభుత్వ చర్యలను విమర్శించడంతో ఆమె పరువునష్టం దావాను సైతం ఎదుర్కొన్నారు. ఆ సమయంలో సేవ్ మిల్లీ అనే హ్యాష్ ట్యాగ్ సైతం ట్రెండ్ అయింది.

సలీమా రాదియా ముకంసంగా

సలీమా రాదియా ముకంసంగా, రువాండా

రెఫరీ

ఖతార్‌లో జరుగుతున్న పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2022లో మ్యాచ్ రెఫరీలుగా మొట్టమొదటిసారిగా ఫీఫాను ఎంపిక చేసిన ముగ్గురు మహిళలలో సలీమా రాదియా ముకంసంగా ఒకరు. ఇది అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో నిలిచిపోయే అంశం. 92 ఏళ్ల అనంతరం టోర్నమెంట్‌లో మహిళలకు ఈ అవకాశం దక్కింది.

గత జనవరిలోనే ఆమె పురుషుల ఆఫ్రికా కఫ్ ఆఫ్ నేషన్స్ టోర్నమెంట్లో మొదటి మహిళా రెఫరీగా పని చేశారు. ఆమె టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో కూడా పాల్గొన్నారు. ఆమె ఇప్పటికే అత్యున్నత స్థాయిలో జరిగిన అంతర్జాతీయ మహిళల ఫుట్‌బాల్ క్రీడల్లో అధ్యక్షత వహించారు. క్రీడల్లో పనిచేయడానికి ముందు ఆమె మంత్రసాని శిక్షణ పొందారు.

లారా మెక్‌ఎల్లీస్టర్

లారా మెక్‌ఎల్లీస్టర్, వేల్స్

ప్రొఫెసర్, మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారిణి

వేల్స్ ఫుట్‌బాల్ టీం మాజీ కెప్టెన్. క్రీడా విభాగాల్లో లారా చాలా పదవులు అలంకరించారు. ఆమె ప్రస్తుతం యూఈఎఫ్ఏ మహిళల ఫుట్‌బాల్ కమిటీ డిప్యూటీ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. 2021 ఏప్రిల్‌లో ఫిఫా కౌన్సిల్ యూఈఎఫ్ఏ ప్రతినిధి కోసం జరిగిన ఎన్నికల్లోనూ లారా నిలబడ్డారు. వేల్స్ ట్రస్టు ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు డైరెక్టర్‌గా కూడా లారా కొనసాగుతున్నారు.

లారా మెక్ ఎలిస్టర్ ప్రస్తుతం కార్డిఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా కూడా పనిచేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఆమెను ఖతార్‌లో జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఎల్జీబీటీ స్పోర్ట్స్ అంబాసిడర్‌గా పాల్గొనడానికి వేల్స్ ఎంపిక చేసింది. అయితే ఆమె స్టేడియానికి వెళ్లినపుడు ఎల్జీబీటీక్యూ ఐ + గుర్తును చూపించే రెయిన్ బో వాల్ ( ఇంద్ర ధనస్సు) టోఫీ ధరించగా దానిని తీసేయాల్సిందిగా అక్కడి సిబ్బంది ఆమెకు సూచించారు.

రీటా మోరెనో

రీటా మోరెనో, ఫ్యూర్టో రికో/అమెరికా

నటి

EGOT(ఈగాట్) స్టేటస్ పొందిన అత్యంత కొద్ది మంది పర్‌ఫార్మర్లలో రీటా మోరెనో ఒకరు. ఎమ్మి, గ్రామీ, ఆస్కార్, టోనీ అవార్డులను సొంతం చేసుకున్న వారు ఈ స్టేటస్‌ను పొందుతారు. ఈ అవార్డులను పొందిన వారిలో రీటా మోరెనో ఒకరు. ప్యూర్టో రికాన్ నటి, గాయని, నృత్యకారిణి అయిన రీటా.... తన 13వ ఏటనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఏడు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలోనే తన కెరీర్‌ను సాగించారు.

సింగిన్ ఇన్ ది రెయిన్, ది కింగ్ అండ్ ఐ చిత్రాలలో రీటా మోరెనో నటించారు. ఒరిజినల్ వెస్ట్ సైడ్ స్టోరీలో అనితాగా ఆమె నటించిన పాత్రకు ఆస్కార్‌ దక్కింది. ఆస్కార్ దక్కించుకున్న తొలి లాటినా నటి రీటానే. ఈమె కోసమే ప్రత్యేకంగా స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఈ పాత్రను క్రియేట్ చేశారు. ప్రస్తుతం రీటా మోరెనో వయసు 90 ఏళ్లు.

ఎల్‌నాజ్ రెకాబీ

ఎల్‌నాజ్ రెకాబీ, ఇరాన్

క్లైంబర్

ఇరాన్‌లో హిజాబ్ తప్పనిసరి నిబంధనకు వ్యతిరేకంగా రెకాబీ వ్యవహరించారు. దక్షిణ కొరియాలో అక్టోబర్‌లో జరిగిన ఏసియన్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో రెకాబీ హిజాబ్ లేకుండా పాల్గొన్నారు. ఆ పోటీల్లో ఆమె నాలుగో స్థానంలో నిలిచారు. కానీ, ఇరానియన్ ఆందోళనకారుల్లో గుర్తింపు దక్కించుకున్నారు. ఇంటికి తిరిగి వస్తుండగా థెహ్రాన్ విమానాశ్రయం వద్ద ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. సోషల్ మీడియాలో కూడా ఆమెను చాలామంది ప్రశంసించారు.

అయితే తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో హిజాబ్ తీసేయడం అనుకోకుండా జరిగిపోయిందని ఆమె పోస్టు చెప్పారు. అనంతరం అక్కడి స్టేట్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కారణంగా ఏర్పడిన గందరగోళానికి, ఆందోళనలకు క్షమాపణలు చెప్పారు రెకాబీ. అయితే ఆ ఇంటర్వ్యూ‌ను రెకాబీ చేత బలవంతంగా ఇప్పించారని బీబీసీ పర్సియన్‌కు విశ్వసనీయం సమాచారం అందింది.

యులిమార్ రోజాస్

యులిమార్ రోజాస్, వెనెజులా

అథ్లెట్

పసిడి, వెండి పతకాలను గెలుచుకున్న ఒలంపిక్ మెడలిస్టు, మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన యులిమార్ రోజాస్, మార్చిలో జరిగిన ప్రపంచ అథ్లెట్స్ ఇండోర్ ఛాంపియన్‌షిప్‌లలో 15.74 మీటర్లు నమోదు చేశారు. దీంతో ఆమె మహిళల త్రిపుల్ జంప్‌లో రికార్డు హోల్డర్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆమె 16 మీటర్ల జంప్‌పై గురి పెట్టారు.

యులిమార్ రోజాస్ వెనెెజులాలోని కారకాస్‌లో జన్మించారు. కరేబియన్ తీర ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంలో పెరిగిన రోజాస్, వినయపూర్వకంగా, పట్టువదలని రీతిలో తన ప్రయాణాన్ని ప్రారంభించడమే విజయానికి కారణమని చెప్పారు. ప్రస్తుతం యులిమార్ రోజాస్, బార్సెలోనా ఎఫ్‌సీ అథ్లెటిక్స్ టీమ్‌లో భాగస్వామిగా ఉన్నారు. తన దేశంలో రోజాస్‌ని హీరోగా అభివర్ణిస్తారు. తాను బహిరంగంగానే లెస్బియన్, ఎల్‌జీబీటీక్యూ ప్లస్ సమస్యల గురించి చర్చించారు.

మనం ఎట్టిపరిస్థితులలో అధైర్య పడకూడదు. మనకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మనల్ని తక్కువగా అంచనావేయొచ్చు. అది మనకు తెలిసిందే. కానీ మన సామర్థ్యమేమిటో మనం ఇప్పటికే ఎంతో గర్వంగా నిరూపించాం.

యులిమార్ రోజాస్

మియాా కుయుంగ్ (మికీ) లీ

మియాా కుయుంగ్ (మికీ) లీ, దక్షిణ కొరియా

నిర్మాత

మియా కుయుంగ్ లీ కొరియన్ కళల అభివృద్ధి కోసం పోరాడుతున్నారు. ఆమె K-Pop బ్యాండ్‌కు ముఖచిత్రంగా ఉన్నారు. K Pop ప్రపంచ వ్యాప్తంగా ఎదగడానికి, KCON మ్యూజిక్ ఫెస్టివల్‌కు ఎదుగుదలకు ఆమె దోహదపడ్డారు. ఆస్కార్ అవార్డు పొందిన పారాసైట్‌ను కూడా ఆమె నిర్మించారు.

లీ మియా దక్షిణ కొరియాలోని వినోదం, చలనచిత్రం , టెలివిజన్ స్టూడియో అయిన CJ ENMకి వైస్ ప్రెసిడెంట్ కూడా.

Rebel Wilson

ఆమెను 100 మంది మహిళలు 2021లో ఒకరిగా చోటుదక్కించుకున్న రెబెల్ విల్సన్ నామినేట్ చేశారు.

"ఆమె చాలా బలమైన మహిళ, ఆమె నాకు రోల్ మోడల్. ఆమె తన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రశంసనీయ మహిళ''.

ఎస్రా వార్దా

ఎస్రా వార్దా, అల్జెరియా/అమెరికా

నృత్యకారిణి

సంప్రదాయమైన అల్జెరియా నృత్యాన్ని స్టేజీపైకి తీసుకురావడంలో ఎస్రా వార్దా కీలక పాత్ర పోషించారు. ఈ విషయంలో ఆమె ఒక యోధురాలిగానే పోరాడారు. ఉత్తర ఆఫ్రికా మహిళల నృత్య సంప్రదాయాలకు కట్టుబడి ఉన్న ఆమె.. ముఖ్యంగా రాయ్‌ డ్యాన్స్‌లపైనే ఆమె ఫోకస్ చేశారు. ఈ నృత్యం చారిత్రాత్మకంగా కూడా సామాజిక ఆందోళనలతో ముడిపడి ఉంది.

చీఖా రాబియాకు ఈమె మెంటీ. సంప్రదాయబద్ధమైన రాయ్‌ నృత్యానికి ఉన్న అత్యంత కొద్ది మంది మహిళా మాస్టర్లలో వార్దా ఒకరు. ఎస్రా వార్దా టూరింగ్ ఆర్టిస్టు, ఎడ్యుకేటర్. వాషింగ్టన్ డీసీ నుంచి లండన్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రదర్శనలు, వర్క్‌షాపులు విస్తరించాయి.

వెలియా విదాల్

వెలియా విదాల్, కొలంబియా

రచయిత్రి

కొలంబియాా ఈఐ ఛోకో ప్రాంతానికి చెందిన సంస్కృతిని ప్రోత్సహించే రచయిత్రి ఈమె. మోటెటె అనే సంస్థను కూడా వెలియా విదాల్ స్థాపించారు. ఈ సంస్థ రచనలను, సాహిత్యాన్ని ప్రమోట్ చేస్తుంది. అలాగే ఛోకో ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ఈ కల్చర్‌ని ఆమె ప్రోత్సహిస్తూ వస్తుంది. ఛోకో రీడింగ్, రైటింగ్ ఫెస్టివల్‌ను కూడా ఆమె నిర్వహిస్తున్నారు. సాహిత్యమనేది కొలంబియాలోని వెనుకబడిన ప్రాంతాలలో అసమతుల్యతకు, అంటరానితనానికి వ్యతిరేకంగా పనిచేసేందుకు ఒక సాధనమని వెలియా విందాల్ నమ్ముతారు.

వెలియా విదాల్ ‘అగువాస్ డి ఎస్టూరియో’ అనే బుక్‌ని రాసి విడుదల చేశారు. ఈ బుక్‌ విడుదలతో కొలంబియా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి ఆఫ్రో-కొలంబియన్ రచయితల కోసం ఇచ్చే పబ్లికేషన్ గ్రాంట్‌ తొలి పురస్కారాన్ని ఆమెనే పొందారు. బ్రిటిష్ మ్యూజియంతో కలిసి సంయుక్తంగా అఫ్లుయెంట్స్ ప్రాజెక్టుకి పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు.

చారిత్రాత్మకంగా మహిళల అణచివేత గురించి మనందరికీ తెలిసిందే. దీన్ని మనం అడ్డుకోవాల్సి ఉంది. కానీ ఆఫ్రో, స్వదేశీ ప్రజల్లో ఎంత లోతుగా ఈ వివక్ష కూరుకుపోయిందో గుర్తించడంలో మాత్రం మనం విఫలమతున్నాం.

వెలియా విదాల్

గీతాంజలి శ్రీ

గీతాంజలి శ్రీ, భాారత్

రచయిత్రి

తన నవల టూంబ్ ఆఫ్ ది శాండ్(Tomb of the Sand)కి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి హిందీ రచయిత్రిగా గీతాంజలి శ్రీ ఈ ఏడాది చరిత్ర సృష్టించారు. రెట్ సమాధి అనే తన నవలా ఆంగ్ల అనువాదమే టూంబ్ ఆఫ్ ది శాండ్ . ఈ బుక్ ఫ్రెంచ్ అనువాదం కూడా Emile Guimet పురస్కారానికి షార్ట్‌లిస్టు అయింది.

గీీతాంజలి శ్రీ ఎక్కువగా హిందీలో కాల్పనిక కథలను, హిందీ, ఇంగ్లీష్‌లలో వాస్తవిక కథలను రాస్తుంటారు. ఆమె భాషలో, భాషా విధానంలో ఎల్లప్పుడూ నూతనత్వం ఉట్టిపడుతుంది. ఆమె రాసిన నవలలు, కథలు ఎన్నో భారతీయ, విదేశీ భాషలలోకి అనువాదమయ్యాయి. థియేటర్ గ్రూప్ వివాదితో జతకట్టి గీతాంజలి శ్రీ థియేట్రికల్ స్క్రిప్ట్‌లపై కూడా పనిచేస్తున్నారు. వివాది గ్రూప్‌కి ఆమె వ్యవస్థాపక సభ్యురాలిగా కూడా ఉన్నారు.

విభిన్న వర్గాలు, సంస్కృతులలో మహిళలకు సమానమైన అవకాశాలు లేనప్పటికీ, తమ జీవితంలో వారు అన్నింటి పరంగా పురోగతి సాధించారు.

గీతాంజలి శ్రీ

నానా దార్కోవా సెక్యియామా

నానా దార్కోవా సెక్యియామా, ఘనా

రచయిత్రి

ఆమె పుస్తకం సెక్స్ లైవ్స్ ఆఫ్ ఆఫ్రికన్ ఉమెన్‌ను పబ్లిషర్స్ వీక్లి రివ్యూలో లైంగిక విముక్తి కోసం ఒక ఆశ్చర్యకరమైన రిపోర్టని అభివర్ణించింది. ఈ ఏడాది వచ్చిన అత్యంత ఉత్తమమైన పుస్తకాలలో ఒకటిగా కూడా ఒక ఆర్థిక వేత్త పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అభిప్రాయాలను, జీవిత గాథలను ఆమె ఈ పుస్తకంలో పొందుపరిచారు.

రచయిత్రి, స్త్రీ వాద కార్యకర్త అయిన నానా దార్కోవా సెక్యియామా, అడ్వెంచర్స్ ఫ్రమ్ ది బెడ్‌రూమ్స్ ఆఫ్ ఆఫ్రికన్ ఉమెన్‌కి సహ వ్యవస్థాపకురాలు. ఇదొక వెబ్‌సైట్, పాడ్‌కాస్ట్. ఆఫ్రికన్ మహిళల సెక్స్, లైంగికత, ఆనందానికి సంబంధించిన అనుభవాలపై కంటెంట్‌ను ఈ వెబ్‌సైట్ అందిస్తుంది.

మహిళలందరి కోసం ఒక ప్లాట్‌ఫామ్‌ను, స్పేస్‌ను అందించినప్పుడు మాత్రమే స్త్రీవాదులు విజయం సాధిస్తారు. కానీ మేము ఈ విషయంలో ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాం. వీటి ఫలితమే ఇప్పుడు మాకు అందిన ఫలాలు. ఈ ఎదురుదెబ్బలు లింగ వైవిధ్యతపై ప్రభావితం చూపాయి.

నానా దార్కోవా సెక్యియామా

సాలీ స్కేల్స్

సాలీ స్కేల్స్, ఆస్ట్రేలియా

కళాకారిణి

‘వాయిస్ టూ పార్లమెంట్’ అనే రిఫరెండం పార్లమెంట్ ముందుకు రావడాని కంటే ముందే ఆస్ట్రేలియా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు 2022లో ఆర్ట్ కన్సల్టెంట్ వాలీ స్కేల్స్‌ను నియమించారు. ఒకవేళ ఈ రిఫరెండం కనుక ఆమోదం పొందితే, పార్లమెంటరీ వ్యవహారాల్లో శాశ్వతంగా ఆదివాసీల, స్వదేశీయుల ప్రాతినిధ్యాన్ని మనం చూడొచ్చు.

దక్షిణ ఆస్ట్రేలియాలో మారుమూల ప్రాంతాలైన అనంగు పిట్జాంట్జట్జార యాంకునిట్జట్జర(APY)కు పశ్చిమాన ఉన్న పిపల్యాట్జరకి చెందిన మహిళ సాలీ స్కేల్స్. ఏపీవై ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ ఆమెనే కావడం విశేషం. ఏపీవై కళా కేంద్రానికి చెందిన అధికార ప్రతినిధి కూడా వాలీ స్కేల్స్‌నే. స్వదేశీ సాంస్కృతిక సంస్థలన్ని కలిసి ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేశాయి.

Julia Gillard

2018 విజేత, మాజీ రాజకీయనాయకురాలు జులియా గిల్లార్డ్ ఈమెను నామినేట్ చేశారు.

సాలీ అద్భుతమైన కళాకారిణి, మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకోగలిగే మహిళ. ఇతరులను ప్రోత్సహించడం, వారికి ఉత్సాహం కల్గించడం ద్వారా జాత్యంహకారం, సెక్సిజానికి చెందిన హానికరమైన కలయికకు ముగింపు పలకాలని, దీనికి ఎన్నో మార్పులు అవసరమని సాలీ నొక్కి చెబుతున్నారు.

అలెగ్జాండ్రా స్కోచిలెంకో

అలెగ్జాండ్రా స్కోచిలెంకో, రష్యా

కళాకారిణి

సెయింట్ పీటర్స్‌బర్గ్ కళాకారిణి అయిన అలెగ్జాండ్రా స్కోచిలెంకో, యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన సందేశాలతో ఉన్న బ్యాగ్‌లను పట్టుకోవడంతో రష్యన్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె పట్టుకున్న సూపర్‌మార్కెట్ బ్యాగులపై మారియుపోల్‌ థియేటర్ వైమానిక దాడిలో ఎంత మంది చనిపోయారో తెలిపే సమాచారం కూడా ఉంది. ఈ బ్యాగులను చూసిన ఒక దుకాణదారుడు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆమెపై ‘తప్పుడు సమాచారం’ నిషేధ చట్టం కింద కేసు బుక్ చేసి, అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం ఆమె ప్రీ-ట్రయల్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారు. పదేళ్ల వరకు ఆమె జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అలెగ్జాండ్రా స్కోచిలెంకో ప్రజల మానసిక ఆరోగ్యంపై దృష్టిసారిస్తూ పలు పుస్తకాలను కూడా రాశారు. దీనిలో ఒత్తిడిపై పలు అంశాలను ప్రస్తావించారు. మానియా అంటే ఏమిటో కూడా తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న అలెగ్జాండ్రా స్కోచిలెంకో ఆరోగ్యంపై ఆమె గర్ల్‌ఫ్రెండ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

క్రియాశీలత & న్యాయవాదం

లినా అబు అక్లేహ్‌

లినా అబు అక్లేహ్‌, పాలస్తీనియన్​ భూభాగాలు

మానవ హక్కుల కార్యకర్త

ఇజ్రాయిల్ దళాల చేతిలో మే నెలలో హత్యకు గురైన అల్ జజీరా కరెస్పాండెంట్, పాలస్తీనా అమెరికన్ జర్నలిస్ట్ షిరీన్ అబు అక్లేహ్‌‌ల మేనకోడలే పాలస్తీనా అమెరికన్ మానవ హక్కుల కార్యకర్త లినా అబు అక్లేహ్. షిరీన్ అబు అక్లేహ్‌ను తమ సాయుధ దళాలలో ఒకరు పొరపాటున చంపేసి ఉంటారని భావిస్తున్నట్టు ఇజ్రాయిల్ మిలటరీ పేర్కొంది.

ఈ విషయంలో జవాబుదారి, న్యాయం కోసం లినా పోరాడుతున్నారు. మానవ హక్కులు ప్రధానాంశంగా ఇంటర్నేషనల్ స్టడీస్‌లో తాను మాస్టర్స్ చేశారు. 2022 టైమ్ 100 నెక్ట్స్ ఎమర్జింగ్ లీడర్లలో ఒకరిగా ఆమె పేరును ప్రకటించారు.

ఎక్కడైతే నా ఆంటీ షిరీన్ అక్లేహ్ మమ్మల్ని వదిలివెళ్లారో, అక్కడి నుంచి మేం మరింత పైకి ఎదగాల్సి ఉంది. మహిళా ఆలోచనలు మరింత విస్తరించాలి. మేం సేకరించే సమాచారంలో, మేం అందించే స్టోరీలలో సమానత్వాన్ని సాధించాలి. సమాచారం కచ్చితంగా, సంపూర్ణంగా ఉండేలా చూడాలి. మహిళలు లేకుండా ఇదేమీ సాధ్యం కాదు.

లినా అబు అక్లేహ్‌

జెబీనా యాస్మిన్ ఇస్లాం

జెబీనా యాస్మిన్ ఇస్లాం, యూకే

క్యాంపెయినర్

లండన్ పార్కులో 2021 సెప్టెంబర్లో హత్యకు గురైన ప్రైమరీ పాఠశాల టీచర్ సబీనా నెస్సాకు జెబీనా సోదరి. యూకేలో మహిళల రక్షణ కోసం న్యాయవాదిగా తన గొంతును వినిపించారు జెబీనా. చట్టంలో మార్పులు తీసుకురావాలని ఆమె క్యాంపెయిన్లు నిర్వహించారు. అందుకే ప్రతివాదులు కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చేది.

తన సోదరి హత్య జరిగాక బ్రిటీష్ ప్రభుత్వం మద్దతు లేకపోవడంపై జెబీనా ఇస్లాం విమర్శించారు. పురుషుల హింసావాదంపై ఎంత తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారో ఇదే రుజువుగా ఆమె ఆరోపించారు. జెబీనా జాతి వివక్షపై కూడా స్పందించారు. ఒకవేళ తన కుటుంబం బ్రిటీష్ తెల్ల జాతీయులకు చెందినదై ఉంటే వాళ్లకు మెరుగైన చికిత్స దక్కేదని అన్నారు. తన సోదరి అద్భుతమైన రోల్ మోడల్ అని, చాలా శక్తివంతమైన, తెలివిగల, ధైర్యవంతురాలని జెబీనా పేర్కొన్నారు.

’’భూమిపై ఉన్న అందరికంటే మిమ్మల్ని మీరే ఎక్కువ ప్రేమించండి.‘‘

సబీనా నెస్సా

సబీనా నెస్సా జర్నల్ నుంచి జెబీనా అందించిన సందేశం

గోహార్ ఎష్గి

గోహార్ ఎష్గి, ఇరాన్

పౌర కార్యకర్త

గోహార్ ఎష్గి ఇరాన్‌లో ఓర్పు, సహనానికి ప్రతీకగా చెబుతారు. ఎందుకంటే దశాబ్దం కిందట తన కొడుకు, బ్లాగర్ అయి సత్తార్ బెహెస్తి పోలీసుల కస్టడీలోనే కన్నుమూశారు. అప్పటి నుంచి ఎష్గి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇరాన్ అథారిటీల వేధింపులు, హత్యలపై ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

తమ పిల్లల చావులకు కారణమవుతున్న వాటిపై న్యాయం కావాలంటూ కోరుతున్న ఇరాన్ తల్లుల్లో ఎష్గి ఒకరు. తన కొడుకు చావుకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీనే బాధ్యత తీసుకోవాల్సి ఉందని ఆమె డిమాండ్ చేశారు. 2019లో ఆయన రాజీనామా కోరుతూ లేఖ రాసిన వారిలో ఈమె ఒకరు. ఈ ఏడాది మహసా అమిని మరణం తర్వాత నెలకొన్న ఆందోళనలలో, ఆమె తన హెడ్‌స్క్రాఫ్‌ను తొలగించి నిరసన వ్యక్తం చేశారు.

శాండ్య ఏక్నాలిగోడా

శాండ్య ఏక్నాలిగోడా, శ్రీలంక

మానవ హక్కుల కార్యకర్త

శాండ్య ఏక్నాలిగోడా ప్రచారకర్త మరియు మానవ హక్కుల కార్యకర్త. శ్రీలంకలో జరిగిన అంతర్యుద్ధంలో భర్తలను కోల్పోయిన వేలాది మంది మహిళలకు ఆమె సాయం చేశారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మరియు కార్టూనిస్ట్ అయిన ఆమె భర్త ప్రగీత్ ఏక్నాలిగోడ జనవరి 2010 నుంచి కనిపించకుండా పోయారు. ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, వేర్పాటువాద తమిళ టైగర్లపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పరిశోధనాత్మక నివేదికను కూడా ఆయన సమర్పించారు.

ఇద్దరు పిల్లల తల్లి అయిన శాండ్య తన భర్త అదృశ్యమైనప్పటి నుంచి తనకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే మద్దతుదారులు తన భర్తను దాచిపెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. భర్త అపహరణకు సంబంధించి అనుమానితులుగా తేలినప్పటికీ వారందరినీ నిర్దోషులుగా విడుదల చేశారు.

నేనొక మహిళను.. ఇతరుల కోసం, వారి అవకాశాల కోసం పోరాడుతాను. సృజనాత్మక పోరాటాలతో పాల్గొంటాను. ఎన్ని అవరోధాలు, అవమానాలు ఎదురైనా కూడా సవాళ్లను ఎదుర్కొంటాను. దీని కోసం నేను త్యాగం కూడా చేస్తాను.

శాండ్య ఏక్నాలిగోడా

హైడి క్రౌటర్

హైడి క్రౌటర్, యూకే

దివ్యాంగుల ప్రచారకురాలు

జన్యుపరమైన వ్యాధి(డౌన్ సిండ్రోమ్) విషయంలో ప్రజల్లో ఉన్న దృక్పథాన్ని మార్చేందుకు హైడి క్రౌటర్ పాటు పడుతున్నారు. ఈ రకమైన శిశువుల పిండాలకు పుట్టే వరకు అబార్షన్‌‌కు అనుమతిచ్చేలా‌ యూకే ప్రభుత్వం అనుమతిస్తూ చట్టం చేయడంపై హైడి హైకోర్టుకి వెళ్లారు. ఇది తీవ్రమైన వివక్ష అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే హైడి క్రౌటర్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గర్భస్త శిశువు, మహిళల హక్కుల విషయంలో సమతుల్యం తీసుకొచ్చే లక్ష్యంతో ఈ చట్టం రూపొందినట్టు హైకోర్టు తెలిపింది. నవంబర్‌లో, క్రౌటర్ అప్పీలును కోర్టు తోసిపుచ్చింది. కానీ ఈ విషయంలో తాను, తన టీమ్ మాత్రం పోరాటాన్ని కొనసాగిస్తుందని హైడి క్రౌటర్ పేర్కొన్నారు. ఈ కేసును తాము సుప్రీంకోర్టుకి తీసుకెళ్తామని స్పష్టీకరించారు.

నేషనల్ డ్రౌన్ సిండ్రోమ్ పాలసీ గ్రూప్‌కి వ్యవస్థాపక అధికారిగా క్రౌటర్ ఉన్నారు. డౌన్ సిండ్రోమ్ విషయంలో సానుకూల దృక్పథాన్ని కల్గించేలా ఆమె ప్రయత్నిస్తున్నారు. ‘అయామ్ జస్ట్ హైడి’ అనే పేరుతో ఆమె పుసక్తం కూడా ఆగస్టులో ప్రచురితమైంది.

డ్రౌన్ సిండ్రోమ్ గురించి కచ్చితమైన సమాచారాన్ని గర్భిణీలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలు కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాలి. నిజంగా మేమేంటో మీరు చూడాలనుకుంటున్నా!

హైడి క్రౌటర్

గెరాల్దినా గెర్రా గారెస్

గెరాల్దినా గెర్రా గారెస్, ఈక్వెడార్

మహిళా హత్య వ్యతిరేక ప్రచారకర్త

గెరాల్దినా గెర్రా గారెస్ గత 17 ఏళ్లుగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈక్వెడార్లో హింసకు గురవుతున్న మహిళలను రక్షించడానికి ఆమె పరితపిస్తున్నారు. స్త్రీల హత్యలు, లింగ బేధం కారణంగా హత్యలు జరుగుతున్నాయని సమాజానికి ఎత్తి చూపడానికి కావాల్సిన సమాచారాన్ని సంపాదించడంలో గెర్రా నైపుణ్యురాలు.

హత్యకు గురైన మహిళల జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి ఆమె లైఫ్ మ్యాప్ చొరవను ప్రారంభించారు. మహిళల హత్యలు, లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా లాటిన్ అమెరికా నెట్ వర్క్ కేసులను ట్రాక్ చేసేవారు, మహిళలకు ఆశ్రయం ఇచ్చే ఆల్దియా ఫౌండేషన్ కూడా ఆమె చూసుకునేవారు.

మహిళల హత్యలు నిరోధించడానికి ఎవరూ ముందుకురాకపోతే.. ఏ వర్గానికి చెందిన వారికైనా వృద్ధి ఉండదు. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినా కూడా మేం చంపబడుతున్నాం. అసలు మార్పే రాలేదు.

గెరాల్దినా గెర్రా గారెస్

మౌడ్ గోబా

మౌడ్ గోబా, యూకేే

ఎల్జీబీటీక్యూ ఐ + కార్యకర్త

స్వతహాగా శరణార్థి అయిన మౌడ్ గోబా.. గత రెండు దశాబ్ధాల నుంచి కిందిస్థాయి సంస్థలతో కలిసి శరణార్థుల కోసం పనిచేస్తున్నారు. శరణార్థులు, ఎల్జీబీటీక్యూ ఐ + , నిరాశ్రయులకు ఆశ్రయం ఇవ్వడానికి నడుస్తున్న మైక్రో రెయిన్ బోలో ఆమె ప్రస్తుతం జాతీయ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వాళ్లందరి కోసం 25,000 బెడ్లతో కూడిన హౌసింగ్ ప్రాజెక్టుకు ఆమె నాయకత్వం వహిస్తోంది. అంతేకాదు వారి ఉద్యోగ బాధ్యతలను కూడా ఆమె చూస్తోంది.

ఇటీవలె అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికాకు వలస వచ్చిన ఎల్జీబీటీక్యూ ఐ + ప్రజల ఇంటిగ్రేషన్ బాధ్యతలను గోబానే చూసింది. యూకే బ్లాక్ ఫ్రైడ్ వ్యవస్థాపక సభ్యులలో గోబా ఒకరు. ప్రస్తుతం ఆ సంస్థ బోర్డు ట్రస్టీలకు చైర్మన్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు.

సంజిదా ఇస్లాం చోయా

సంజిదా ఇస్లాం చోయా, బంగ్లాదేశ్

విద్యార్థి

ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లలకు వివాహాలు అత్యధిక రేటులో నమోదవుతున్న దేశాలలో బంగ్లాదేశ్ ఒకటి. కానీ సంజిదా ఇస్లాం దీన్ని మార్చాలనుకుంటున్నారు. తన తల్లి కూడా చిన్న తనంలోనే పెళ్లి చేసుకున్నారు. కానీ బాల్య వివాహాల వల్ల ఆరోగ్యంపై పడే ప్రభావాలను స్కూల్‌లో ఒక ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్న చోయా, ఈ విషయంలో మార్పు తీసుకురావాలని స్ఫూర్తి పొందారు. ఎలాగైనా బాల్య వివాహాలను తగ్గించాలని కంకణం కట్టుకున్నారు.

తాను, తన స్నేహితులు, అధ్యాపకులు, సహాయకులందరూ కలిసి తమని తాము గాస్ఫోరింగ్ (గ్రాస్‌షాపర్లు)గా పేర్కొంటూ.. బాల్య వివాహాలపై పోలీసులకు నివేదిస్తున్నారు. ప్రస్తుతం చోయా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. అయినప్పటికీ బాల్య వివాహాల విషయంలో మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. గ్రూప్‌లో కొత్త సభ్యులకు తాను మెంటర్‌గా కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 50 బాల్య వివాహాలను ఆమె ఆపగలిగారు.

ఎఫ్రత్ టిల్మా

ఎఫ్రత్ టిల్మా, ఇజ్రాయిల్

వాలంటీర్

ఇజ్రాయిల్ పోలీసు విభాగంలో తొలి ట్రాన్స్‌జెండర్ వాలంటీర్‌గా పనిచేస్తున్న కార్యకర్తగా ఎఫ్రత్ టిల్మా ఉన్నారు. ఎల్‌జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీకి, పోలీసులకు మధ్య సంబంధాలు మెరుగుపడేలా ఆమె పనిచేస్తున్నారు. అంతేకాక ఎమర్జెన్సీ కాల్స్‌కి వెంటనే స్పందిస్తూ తన వంతు సాయం అందిస్తున్నారు. టిల్మా కుటుంబం ఆమె ట్రాన్స్‌జెండర్ అని తెలియగానే వెలివేసింది. దీంతో, చిన్న వయసులోనే ఎఫ్రత్ టల్మా ఇజ్రాయిల్‌కి వచ్చారు. ట్రాన్స్‌జెండర్‌గా పోలీసుల వేధింపులను కూడా అనుభవించారు. 1969లో కాసాబ్లాంకాలో జెండర్ రీఅసైన్‌మెంట్ సర్జరీ చేయించుకున్నారు. యూరప్‌లో ఈ సర్జరీలపై నిషేధం ఉంది.

బెర్లిన్‌లో ఫ్లయిట్ అటెండెంట్‌గా ఆమె పనిచేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొద్ది కాలానికి విడాకులు కావడంతో తిరిగి 2005లో ఇజ్రాయిల్‌కి తిరిగి వచ్చారు. సెక్సువల్ మైనార్టీలకు ఇజ్రాయిల్ ఎల్లప్పుడూ స్వాగతిస్తూ, మద్దతిస్తోంది. పోలీసులతో కలిసి వాలంటీర్‌గా పనిచేసేందుకు ఎఫ్రత్ టిల్మాను వారు ప్రోత్సహించారు.

ఆలిస్ పటాక్సో

ఆలిస్ పటాక్సో, బ్రెజిల్

స్వదేశీ కార్యకర్త

పర్యావరణ ప్రచారకర్త, జర్నలిస్టు, ప్రభావితురాలైన మహిళ ఆలిస్ పటాక్సో.. ఇటీవల బ్రెజెలియన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పర్యావరణ, వ్యవసాయ విధానాలు స్వదేశీ భూహక్కులకు ఏ విధంగా హాని చేస్తున్నాయో తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పటాక్సో ప్రజల స్వరంగా, స్వదేశీ కమ్యూనిటీల వలసవాద అభిప్రాయాలను ఆమె సవాలు చేయాలనుకుంటున్నారు. పర్యావరణ కార్యకర్తల హత్యల వెనుకున్న వ్యక్తుల గురించి కూడా ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నారు.

కోలాబోరాకి ఆమె జర్నలిస్ట్. తన యూట్యూబ్ ఛానల్ నుహెకి కంటెంట్‌ను కూడా క్రియేట్ చేస్తున్నారు. నుహె అంటే అర్థం ఆ దేశ ప్రజల స్థితిస్థాపకత. అంటే కష్టాల నుంచి ఎంత వేగంగా వారు కోలుకున్నారో ఈ యూట్యూబ్ ఛానల్ చెబుతుంది.

Malala Yousafzai

2021 విజేత, విద్యా కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ ఆమెను నామినేట్ చేశారు.

ఆలిస్ పటాక్సోను ఈ ఏడాది బీబీసీ 100 మహిళల జాబితాకు నామినేట్ చేయడం చాలా గర్వంగా ఉంది. పర్యావరణాన్ని కాపాడేందుకు, లింగ సమానత్వం కోసం ఆలిస్ పటాక్సో కట్టుబడి ఉన్నారు. ఇవి సుస్థిరతకు, సమాజంలో సమానత్వానికి కృషి చేస్తాయని ఆశిస్తున్నాను.

తమనా జర్యాబ్ పర్యాణి

తమనా జర్యాబ్ పర్యాణి, ఆఫ్గానిస్తాన్

కార్యకర్త

విద్య, పని హక్కుల కోసం ఈ ఏడాది జనవరిలో ర్యాలీ నిర్వహించడంతో, తమనా జర్యాబ్ పర్యాణిని, ఆమె సోదరీమణులను సాయుధ దళాలు బలవంతంగా ఇంటి నుంచి లాక్కెళ్లాయి. అంతర్జాతీయంగా దీనిపై తీవ్ర ఖండన వ్యక్తమైంది. వారిని విడిచిపెట్టాలని నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదంటూ తాలిబన్ ప్రకటించుకుంది.

తన అరెస్టు గురించి తెలుపుతూ పర్యాణి ఒక వీడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. కనిపించకుండా పోయిన మహిళా కార్యకర్తల గురించి తెలుపుతూ పర్యాణి విడుదల చేసిన ఆ వీడియో కొద్ది సమయంలోనే వైరల్ అయింది. ఆమె సాయుధ దళాల కస్టడీలోనే మూడు వారాల పాటు గడిపారు. ప్రస్తుతం వారి బారి నుంచి విడుదలైన పర్యాణి జర్మనీలో నివసిస్తున్నారు. అఫ్ఘనిస్తాన్ మహిళలకు సంఘీభావంగా, ఆమె తన తలకు ఉన్న స్కార్ప్ తగలబెట్టారు. అయితే దీన్ని చాలా మంది ఆఫ్గాన్ మహిళలు వివాదాస్పదమైన అంశంగా చూశారు.

ప్రపంచవ్యాప్తంగా మహిళలు అభివృద్ధి దిశలో పయనిస్తుంటే, ఆఫ్గానిస్తాన్ మహిళలు మాత్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లారు. 20 ఏళ్ల పాటు మహిళలు సాధించిన విజయాలన్నింటిన్ని వారి నుంచి లాక్కునట్టయింది.

తమనా జర్యాబ్ పర్యాణి

రోయా పిరేయ్

రోయా పిరేయ్, ఇరాన్

సామాజిక కార్యకర్త

సెప్టెంబర్‌లో రోయా పిరేయ్ చిత్రం వైరల్‌గా మారింది. ఇరాన్‌లోని కుర్దీష్ ఎక్కువగా మాట్లాడే కెర్మాన్షాలో జరిగిన అల్లర్లలో పిరేయ్ తల్లి 62 ఏళ్ల మినో మజీదీని అక్కడి భద్రతా బలగాలు కాల్చి చంపాయి. అప్పుడే పిరేయ్ తన తల్లి తలను, జుట్టును పట్టుకుని ధైర్యంగా కెమెరా వైపు చూస్తూ ఉన్నారు.

22 ఏళ్ల మహషా అమిని మృతి తర్వాత ఇరాన్‌లోని కుర్దీష్ ప్రాంతంలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. అంతర్జాతీయంగా తమకు మద్దతు కోసం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మక్రాన్‌ను సైతం పిరేయ్ కలిశారు.

 సెసి ఫ్లోర్స్

సెసి ఫ్లోర్స్, మెక్సికో

కార్యకర్త

సాయుధ దళాలు 2015లో తన 21 ఏళ్ల కుమారుడు అలెజాండ్రోను తీసుకెళ్లారు. ఆ తర్వాత తన మరో కొడుకు మార్కో ఆంటోనియోను కూడా 31 ఏళ్ల వయసులో ఒక క్రిమినల్ గ్రూప్ కిడ్నాప్ చేసింది. తన పిల్లలకి ఏమైందో తెలియకుండానే తాను చనిపోవడం చాలా బాధకరంగా ఉందని, మెక్సికోలో బలవంతంగా తమ పిల్లల్ని ఎత్తుకుపోతున్నట్టు సెసి ఫ్లోర్స్ తెలిపారు. పిల్లల్ని మాయం చేయడంపై ఆందోళనకు గురైన సెసి ఫ్లోర్స్ దీనిపై తన పోరాటం చేస్తున్నారు.

ఈ ఏడాది ఏకంగా లక్ష మంది ప్రజలు మాయమై పోయారు. అసలు వారు ఏమై పోయారన్నది తెలియనే లేదు. ఈ అపహరణలను యూఎస్ అత్యంత విషాదంగా పేర్కొంది. ఫ్లోర్స్ నాయకత్వంలో సోనోరా సెర్చింగ్ మదర్స్, తప్పిపోయిన తమ 1000 మందికి పైగా పిల్లల్ని సమాధుల కింద గుర్తించింది.

 వెల్మారిరి బాంబారి

వెల్మారిరి బాంబారి, ఇండోనేషియా

కార్యకర్త

ఇండోనేేషియాలోని మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్న వెల్మారిరి బాంబారి, సెంట్రల్ సులావెసిలో లైంగిక హింసకు గురైన బాధితుల తరఫున పోరాడుతున్నారు. సంప్రదాయ చట్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న స్థానిక కౌన్సిల్‌లో సభ్యురాలుగా కూడా ఉన్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధితులపై ఎలాంటి జరిమానాలను విధించకుండా వెల్మారిరి చూస్తున్నారు.

సంప్రదాయ చట్టం ప్రకారం, ఎవరైతే ట్రెడిషినల్ విలువలకు భంగం కలిగించేలా చేస్తారో, వారు తప్పనిసరిగా జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధన లైంగిక వేధింపులకు గురైన బాధితులకు కూడా వర్తిస్తుంది. ఎప్పుడైనా సులావెసి ప్రాంతంలో లైంగిక హింస రిపోర్టు అయితే వెంటనే పోలీసులు సంప్రదించే తొలి వ్యక్తిగా బాంబారి ఉన్నారు. ఈ ఏడాది ఆమె పలు కేసులను హ్యాండిల్ చేశారు.

నేను దివ్యాంగురాలిని అయినప్పటికీ, నా చుట్టూ ఉన్న మహిళలలో ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేందుకు, వారికి అవకాశాలను క్రియేట్ చేసేందుకు నా ఒంట్లో ఉన్న శక్తినంతా వాడతాను.

వెల్మారిరి బాంబారి

తరానా బుర్కె

తరానా బుర్కె, అమెరికా

కార్యకర్త

#MeToo హ్యాష్‌ట్యాగ్ గత ఐదేళ్లుగా బాగా వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది మహిళలు లైంగిక పరంగా తాము ఎదుర్కొన్న వేధింపులను ఈ హ్యాట్‌ట్యాగ్ ద్వారా తెలియజేస్తున్నారు. కానీ ఆ మూవ్‌మెంట్‌ను ప్రారంభించింది లైంగిక వేధింపుల బాధితురాలు, కార్యకర్త తరానా బుర్కె. ఆమె 2006లో ఈ మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, హింసలపై అవగాహన కల్పించేందుకు తరానా ప్రయత్నించారు.

2017లో నటి అలీస్సా మిలానో #MeTooపై ట్వీట్ చేసినప్పుడు, మహిళలను ఎలా ట్రీట్ చేస్తున్నారనే విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధితులకు శక్తివంతమైన స్వరంగా ఇది మారింది. వేధింపులకు గురైన బాధితులకు చేదోడుగా నిలిచేందుకు బుర్కె కట్టుబడి ఉన్నారు. సాంస్కృతిక, నిర్మాణాత్మక మార్పుల కోసం బుర్కె పోరాడుతున్నారు.

హాదిజాతౌ మణి

హాదిజాతౌ మణి, నిగర్

బానిసత్వ వ్యతిరేక ప్రచారకర్త

12 ఏళ్ల వయసున్నప్పుడు ఐదో భార్యగా అమ్ముడుపోయిన హాదిజాతౌ మణి, వహాయ విధానం కింద ఎంతో కాలం పాటు బానిసత్వ బతుకును వెళ్లదీశారు. ఆయన నలుగురు భార్యలకు సేవ చేసేందుకు అనధికార భార్యగా ఈమెను కొన్నాడు ఆ వ్యక్తి. 2005లో ఆమె చట్టబద్ధంగా స్వేచ్ఛను పొందిన తర్వాత, మణి తిరిగి వివాహం చేసుకున్నారు. కానీ ఆమె మాజీ భర్త మాత్రం తనపై పగతీర్చుకునేందుకు ఆమెను పెద్ద భార్యగా పేర్కొంటూ దావా వేశాడు. ఆ నేరం నిరూపితం కావడంతో, ఆరు నెలల పాటు జైలులో గడపాల్సి వచ్చింది.

ఈ విషయంలో హాదిజాతౌ మణి, నిగర్ సుప్రీంకోర్టులో పోరాడారు. ఆమె పోరాటంతో వహాయ విధానం రద్దయింది. ప్రస్తుతం ఆమె బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ విధానం నుంచి ఇతర మహిళలను కాపాడేందుకు కూడా ఆమె తన ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నారు.

నర్గెస్ మహమ్మది

నర్గెస్ మహమ్మది, ఇరాన్

మానవ హక్కుల ప్రచారకర్త

జర్నలిస్టు, నోబెల్ శాంతి పురస్కార నామినీ అయిన నర్గెస్ మహమ్మది ఇరాన్‌లో మానవ హక్కుల కేంద్రానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. మరణ శిక్షను రద్దు చేయాలని ఆమె అహర్నిశలు పోరాడారు. ఆందోళనకారులకు ఇరానియన్ ప్రభుత్వం మరణ శిక్ష విధించేందుకు జారీ చేసిన ఆదేశాలను నిలిపివేసేలా ఐక్యరాజ్యసమితి ఆదేశించాలని ఎవిన్ జైలు నుంచి ఆమె ఒక లేఖను కూడా పంపారు.

2010లో మహమ్మదికి 11 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. ఎవిన్ జైలులో ఖైదీలపై అనుసరిస్తున్న విధానాన్ని విమర్శిస్తూ నర్గెస్ జైలులో ప్రసంగం చేయడంతో, ఆమె శిక్షను 16 ఏళ్లకు పొడిగించారు. 16 మంది మాజీ ఖైదీలను ఇంటర్వ్యూలు చేసి, వైట్ టార్చర్ అనే డాక్యుమెంటరీని విడుదల చేశారు.

జుట్టును కత్తిరించుకున్న మహిళ

జుట్టును కత్తిరించుకున్న మహిళ, ఇరాన్

ఆందోళనకారి

తన జుట్టును హిజాబ్‌తో కవర్ చేసుకోకపోవడంతో ఇరాన్ నిబంధనలను అతిక్రమించారని ఆరోపిస్తూ, మోరాలిటీ పోలీసులు తెహ్రాన్‌లో 22 ఏళ్ల కుర్దిహ్ మహిళ మహసా అమిని సెప్టెంబర్ 13న అరెస్ట్ చేశారు. పోలీసుల కస్టడీలోనే మహసా అమినీ మృతి చెందింది. మహసా మృతితోఇరాన్‌లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి.

మహసా మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న మహిళలు తమ స్వేచ్ఛ, స్వతంత్రత కోసం పోరాడుతున్నారు. కచ్చితంగా హిజాబ్ ధరించాలనే నిబంధనకు వ్యతిరేకంగా నిరసిస్తున్నారు. ఈ నిరసనలలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ పాత్రను గుర్తించాలంటూ వారు కోరుతున్నారు.

ఈ ఆందోళనలలో జుట్టు కత్తిరించుకోవడం ఒక సంకేతంగా ఉంది. ఈ నిరసనలకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రచారకర్తలు జుట్టును కత్తిరించుకుంటున్నారు.

ఓలెక్సాండ్రా మాత్విచుక్

ఓలెక్సాండ్రా మాత్విచుక్, యుక్రెయిన్

మానవ హక్కుల న్యాయవాది

15 ఏళ్లుగా ఓలెక్సాండ్రా మాత్విచుక్ సివిల్ లిబర్టీస్ సెంటర్‌(CCL)కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సెంటర్ ఏర్పాటైనప్పటి నుంచి దీనిలోనే ఉన్నారు. యుక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యన్ యుద్ధ నేరాల డాక్యుమెంటరీ వర్క్‌కి గాను, 2022లో ఈ కేంద్రానికి నోబెల్ శాంతి పురస్కారం లభించింది.

సీసీఎల్ మానవ హక్కులపై దృష్టి సారిస్తూ... 1960లోని యుక్రెయిన్ వారసుల వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. 2014లో ఈ సెంటర్ తొలిసారి యుద్ధ నేరాలను డాక్యుమెంట్ చేసేందుకు క్రిమియా, లుహాన్స్క్, డోనెట్స్క్‌లకు వెళ్లింది. ఈ ప్రాంతాలకు వెళ్లిన తొలి మానవ హక్కుల సంస్థ ఇదే. చెచెన్యా, మల్దోవా, జార్జియా, సిరియా, మాలి, యుక్రెయిన్‌లలో రష్యా మానవ హక్కుల ఉల్లంఘన చేపడుతున్నట్టు ఈ సంస్థ ఆరోపిస్తోంది. దీనిపై విచారణ చేపట్టాలని అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ని కోరుతుంది.

తెగువకు అమ్మాయి, అబ్బాయనే తేడా ఉండదు.

ఓలెక్సాండ్రా మాత్విచుక్

లేలీ

లేలీ, ఇరాన్

ఉద్యమకారిణి

ఇరాన్ లో ఇటీవల వెలుగుచూసిన ఆందోళనలలో లేలీ చిత్రం ఐకాన్ వంటిది. పోనీ టెయిల్ జుట్టుతో వీధుల్లో ఆందోళన చేస్తూ నిల్చున్న ఫొటో ఆమెది. ఆందోళనకారులకు ఆమె ఫొటో ధైర్యానికి గుర్తుగా నిలిచింది. కానీ, ఆమెను చాలామంది 22 ఏళ్ల హదీస్ నజాఫీగా పొరబడ్డారు. అనంతరం ఆమె హత్యకు గురైంది.

ఆ ఫొటోలో ఉన్న యువతి బీబీసీ పర్సియన్‌తో మాట్లాడుతూ.. ’’ ప్రజల కోసం హదీస్ నజాఫీ, మహషా అమినీలా పోరాడండి. చంపుతామని చెప్పి మమ్మల్ని బెదిరించలేరు, ఇరాన్ స్వేచ్ఛపై మాకు నమ్మకముంది‘‘.

జో షియావోక్సువాన్

జో షియావోక్సువాన్, చైనా

స్త్రీవాద కార్యకర్త

చైనా మీటూ మూవ్‌మెంట్‌లో, జో షియావోక్సువాన్ కేసు చైనాలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది స్త్రీవాదులను మేల్కొల్పింది. 2018లో ప్రభుత్వానికి చెందిన సీసీటీవీ బ్రాడ్‌కాస్టర్‌కి చెందిన స్టార్ ప్రజెంటర్ జు జున్‌‌పై ఆమె కేసు నమోదు చేశారు. 2014లో ఆ సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేసే సమయంలో, తనను అతను గట్టిగా పట్టుకుని, బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని ఆరోపించారు. అయితే ఆమె ఆరోపణలను జు జున్‌ కొట్టివేశారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు.

అయితే సరిపడ ఆధారాలు లేకపోవడంతో ఆమె కేసును కొట్టివేశారు. ఈ ఏడాది ఆమె అప్పీల్‌ను కొట్టివేయడంతో, చైనా మీటూ మూవ్‌మెంట్‌కి ఇదొక ఎదురుదెబ్బగా కొన్ని విదేశీ మీడియాలు పేర్కొన్నాయి. ఆమె కేసు ఓడిపోయినప్పటికీ, జో మాత్రం లైంగికంగా హింసకు గురైన మహిళలకు తనవంతు సాయం అందిస్తున్నారు. చైనాలో స్త్రీవాద సమస్యలను ఎత్తి చూపేందుకు ప్రయత్నిస్తున్నారు.

యులియా సచుక్

యులియా సచుక్, ఉక్రెయిన్

దివ్యాంగుల నాయకురాలు

దివ్యాంగ మహిళల సంస్థ అయిన ‘ఫైట్ ఫర్ రైట్’కి యులియా సచుక్ హెడ్. ఈమె యుక్రెయిన్‌లో మానవ హక్కుల సంరక్షకురాలిగా పనిచేస్తున్నారు. యుక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ప్రారంభించిన తర్వాత ఆమె వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ను ప్రవేశపెట్టింది. దివ్యాంగులైన వేలాది మంది యుక్రెయిన్ ప్రజలను కాపాడేందుకు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తూ.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 24 గంటల పాటు పనిచేశారు.

నిర్ణయాలు తీసుకోవడంలో దివ్యాంగులైన మహిళలు, బాలికలు కూడా పాలు పంచుకునేలా వారికి సాధికారిత కల్పిస్తున్నారు. ఒబామా ఫౌండేషన్ లీడర్ యూరప్ ప్రొగ్రామ్‌లో కూడా ఆమె పాల్గొన్నారు. జాతీయ మానవ హక్కుల పురస్కారం 2020ను కూడా పొందారు. దివ్యాంగుల హక్కులపై ఏర్పడిన ఐక్యరాజ్యసమితి కమిటీలో యుక్రెయిన్ దేశ అభ్యర్థిగా సచుక్ ఉన్నారు.

సువదా సెలిమోవిక్

సువదా సెలిమోవిక్, బోస్నియా, హెర్జెగోవినా

శాంతి పరిరక్షణ ప్రచారకురాలు

బోస్నియా, హెర్జెగోవినాలను ఒక కుదుపు కుదిపేసిన యుద్ధానికి ఇప్పటికి ముఫ్పై ఏళ్లు. ప్రస్తుతం ఒక చిన్న కుగ్రామంలో నివసిస్తున్న సువదా సెలిమోవిక్, యుద్ధంలో తప్పిపోయి తిరిగి వచ్చిన మహిళలను ఒక చోట చేర్చి, వారికి సరికొత్త జీవితం ఇచ్చేందుకు సాయ పడ్డారు. భర్త చనిపోవడంతో ఒకతే పిల్లల్ని పోషించారు. అనిమా అనే సంస్థను కూడా సువదా స్థాపించారు. ఈ సంస్థ శాంతి పరిరక్షణకు, మహిళల సాధికారితకు కృషి చేస్తుంది.

2008లో ఆమె భర్తను శవాన్ని సామూహిక సమాధిలో గుర్తించారు. దీనిపై ఆమె వార్ క్రైమ్స్ కోర్టులో పోరాటం చేశారు. ఇతర మహిళలు కూడా అధైర్యపడకుండా ఈ విషయంలో పోరాటం చేసేలా ప్రోత్సహించారు. యుద్ధ సమయంలో తీవ్ర కుంగుబాటుకి గురైన మహిళల కోసం తాను ఏర్పాటు చేసిన అనిమా సంస్థ ద్వారా వర్క్‌షాపులను నిర్వహిస్తున్నారు. వారు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు పలు రకాల వేదికలను కల్పిస్తున్నారు.

గెహాద్ హ్యామ్డి

గెహాద్ హ్యామ్డి, ఈజిప్టు

డెంటిస్టు, మానవతావాది

డెంటిస్టు గెహాద్ హ్యామ్డి ఈజిప్ట్ స్త్రీవాదుల కార్యక్రమం ’స్పీక్ అప్‌‘కి వ్యవస్థాపకురాలు, మేనేజర్‌‌గా ఉన్నారు. లైంగిక వేధింపులు, జెండర్ ఆధారితంగా చోటు చేసుకునే హింసను వెలుగులోకి తీసుకొచ్చేందుకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వాడుకుంటోంది. 2022లో ఈజిప్ట్‌లో మహిళలకు వ్యతిరేకంగా ఎన్నో హింసాత్మక నేరాలు జరిగాయి. ఈ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు గెహాద్ పాటుపడుతున్నారు.

వేధింపుల గురించి బయటికి చెప్పేందుకు మహిళలను ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది. అలాగే వారికి న్యాయ, ఎమోషనల్ సపోర్టును అందిస్తుంది. వారికి అండగా నిలిచేలా అథారిటీలపై సైతం ఒత్తిడి తీసుకొస్తుంది. హ్యామ్డి చేపడుతున్న కార్యక్రమాలను పలు సందర్భాల్లో గుర్తించబడ్డాయి. వరల్డ్ జస్టిస్ ఫోరమ్ 2022లో సమాన హక్కులు, వివక్షా రహిత అవార్డును కూడా ఆమె అందుకున్నారు.

ఇంకా మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంది.

గెహాద్ హ్యామ్డి

జుడిత్ హ్యుమన్

జుడిత్ హ్యుమన్, అమెరికా

దివ్యాంగుల హక్కుల కార్యకర్త

జుడిత్ హ్యూమన్ దివ్యాంగుల ప్రజల హక్కులపై పోరాడేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. చిన్నతనంలో ఆమె పోలియోకి గురై వీల్ చెయిర్‌కే పరిమితమయ్యారు. న్యూయార్క్ నగరంలో అధ్యాపకురాలిగా పనిచేసిన తొలి వీల్ చెయిర్ యూజర్ ఆమెనే కావడం మెచ్చుకోదగ్గ విషయం.

దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న నాయకురాలిగా ఆమె అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఆమె కార్యకలాపాలతో పలు కీలకమైన చట్టాలను అమల్లోకి తీసుకొచ్చేందుకు కీలక పాత్ర పోషించారు. అమెరికా ఫెడరల్ భవంతిలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. క్లింటన్, ఒబామా ఇద్దరి కార్యాలయాలలో జుడిత్ హ్యూమన్ పనిచేశారు. 20 ఏళ్లుగా ఎలాంటి లాభాపేక్ష లేని సేవను తను అందిస్తున్నారు.

2020 విజేత, దివ్యాంగుల కార్యకర్త శని ధాండ ఈమెను నామినేట్ చేశారు.

30 ఏళ్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ ప్రజల మానవ హక్కుల కోసం పనిచేస్తున్న జుడిత్‌ను చూసి నేను నిజంగా స్ఫూర్తి చెందాను. రాత్రింబవళ్లు తాను దివ్యాంగుల హక్కుల కోసం పనిచేస్తున్నారు. దివ్యాంగుల హక్కుల ఉద్యమంలో ఆమె కీలకమైన పాత్ర పోషించారు.

ఆరోగ్యం & సైన్స్

ఆయ్ నెయిన్ థూ

ఆయ్ నెయిన్ థూ, మయన్మార్

మెడికల్ డైరెక్టర్

మయన్మార్‌లో సంక్షోభ సమయంలో ఫ్రంట్‌లైన్ వాలంటీర్‌గా ఆయ్ నెయిన్ థూ పనిచేశారు. ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజల కోసం పాటుపడ్డారు. 2021 నవంబర్‌లో ఒక చిన్న ఆపరేషన్ థియేటర్‌‌తో ఆసుపత్రిని కూడా నిర్మించారు. ఈ ఆసుపత్రిలో అస్వస్థతకు గురైనా, గాయాలు పాలైన వారికి చికిత్స చేసే వారు.

ఆయ్ నెయిన్‌కి ఎప్పుడైనా ఖాళీ సమయం చిక్కితే.. వెంటనే ఎక్కడైతే వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండవో ఆ ప్రాంతాలకు వెళ్లి రోగులకు సేవలందించే వారు. దివ్యాంగులతో పాటు స్థానికులకు సేవలందించే వారు. అయితే మయన్మార్ మిలటరీ మాత్రం ఆమెపై పలు ఆరోపణలు చేసింది. ప్రభుత్వేతర మిలిటియా గ్రూప్‌లకు ఆమె మద్దతిస్తున్నారని ఆరోపించింది. ఆయ్ నెయిన్ థూ హింసను ప్రేరేపిస్తున్నారని మయన్మార్ మిలటరీ పేర్కొంటోంది.

ఎఫియోమా ఒసోమా

ఎఫియోమా ఒసోమా, యూఎస్

పబ్లిక్ పాలసీ, సాంకేతిక నిపుణురాలు

ఎన్‌‌డీఏను బ్రేక్ చేసిన తర్వాత తన మాజీ కంపెనీ పింటరెస్ట్ నుంచి తనకు లింగ, జాతి వివక్షకు గురవడంతో ఎఫియోమా ఒసోమా ఇక అలా వివక్షకు గురవుతున్న ఉద్యోగులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. సైలెంట్ నో మోర్ యాక్ట్‌కు కూడా ఆమె సహ స్పాన్సర్. ఇది కాలిఫోర్నియాలో వివక్ష, హింసకు గురవుతున్న ప్రతీ ఉద్యోగి తన సమాచారం పంచుకునేందుకు ఎన్‌డీఏతో సంబంధం లేకుండా వీలు కల్పించింది. అయితే ఒసోమా ఆరోపణలతో పింటరెస్ట్ కూడా తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించడం గమనార్హం. ఆ చట్టానికి మద్దతు కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఒసోమా టెక్ వర్కర్ హ్యాండ్ బుక్ ను రూపొందించారు. ఇది ఉద్యోగులు మాట్లాడటానికి వనరులను అందించనుంది. అలాగే టెక్ ఇండస్ట్రీ‌లో సమానత్వం కోసం ఆర్గనైజేషన్స్‌కు సూచనలు ఇవ్వడానికి ఎర్త్ సీడ్ అనే సంస్థను ప్రారంభించారు.

జ్యూడీ కిహింబు

జ్యూడీ కిహింబు, కెన్యా

సంకేత భాష నిపుణురాలు

కెన్యాలోని కొన్ని ఆసుపత్రులలో సంకేత భాషలకు చెందిన నిపుణులు అందుబాటులో లేరని గుర్తించిన తర్వాత మహిళలందరికీ ఆరోగ్య సంరక్షణ సమాచారాన్ని అందుబాటులో ఉంచేలా జ్యూడీ కిహుంబా కృషి చేశారు. జ్యూడి కిహుంబా కెన్యాలో సంకేత భాషల నిపుణురాలిగా, చెవిటి మహిళల మానసిక ఆరోగ్యం, సంరక్షకురాలిగా పనిచేస్తున్నారు.

టాకింగ్ హ్యాండ్స్, లిజనింగ్ ఐస్ ఆన్ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్(టీహెచ్ఎల్ఈపీ) సంస్థలకి కూడా వ్యవస్థాపకురాలు. మాతృత్వం పొందిన తర్వాత చాలా మంది మహిళలు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ సమయంలో తల్లులకు జ్యూడి కిహుంబా తన సంస్థ ద్వారా సాయం చేస్తున్నారు. 2019లో తాను కూడా ప్రసవానంతరం తీవ్ర కుంగుబాటుకు గురయ్యారు. ఆ అనుభవంతోనే తాను ఈ సంస్థను స్థాపించారు. ఆరోగ్య సంరక్షణ కౌన్సిలర్స్, సిబ్బందితో కలిసి 78 మంది వినికిడి లోపమున్న తల్లులను ఒక వేదికపైకి తీసుకొచ్చిన ఈ సంస్థ, ఈ ఏడాది తొలి బేబి షవర్‌(తల్లికి నిర్వహించే వేడుక)ను నిర్వహించింది.

ఇరినా కొండ్రాటోవా

ఇరినా కొండ్రాటోవా, యుక్రెయిన్

పిల్లల వైద్యురాలు

బాంబుల వర్షం ఏకధాటిగా ఉన్నప్పటికీ, డాక్టర్ ఇరినా కొండ్రాటోవా, ఆమె బృందం రాత్రింబవళ్లు గర్భిణీలకు, నవజాత శిశువులకు, తల్లులకు ఖార్కివ్ రీజనల్ పెరినాటల్ సెంటర్‌లో చికిత్స అందించారు. ఆసుపత్రి బేస్‌మెంట్‌లో లేబర్ వార్డును కూడా వారు ఏర్పాటు చేశారు. వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇంటెన్షివ్ కేర్ బేబీలను రక్షించారు. ఎయిర్ రైడ్ సైరన్లు మోగినప్పటికీ, వారు చిన్న పిల్లల్ని వదిలి పెట్టి వెళ్లలేదు.

ఈ కేంద్రానికి హెడ్‌గా, డాక్టర్ కొండ్రాటోవా మార్చి నెలలో డేవిడ్ బెక్హామ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను తీసుకుని, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేశారు. 2014 నుంచి లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలలో 3 వేల మంది మహిళలకు వైద్య పరంగా, సైకాలజికల్‌గా అవసరమైన సాయాన్ని ఆమె టీమ్ అందించింది.

మా ఇళ్లను, రహదారులను, విద్యుత్ స్టేషన్లను, ఆసుపత్రులను పూర్తిగా ధ్వంసం చేశారు. కానీ మా కలలను, ఆశలను, నమ్మకాన్ని కాదు. అవి ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ముందు కంటే మేము మరింత బలంగా మారతాం.

ఇరినా కొండ్రాటోవా

అసోనిలే కోటు

అసోనిలే కోటు, దక్షిణాఫ్రికా

టెక్ ఎంటర్‌ప్రెన్యూర్

అసోనిలే కోటుకు తన బిజినెస్ ఐడియా ఎలా పుట్టిందంటే.. ఒకసారి ఆమెకు గర్భనిరోధక పరికరం తీసేయడానికి ఎవరూ సాయం చేయలేదు. అనంతరం ఆమె ఫెమ్ కనెక్ట్ అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీ టీనేజ్ ప్రెగ్నెన్సీలను తగ్గించేందుకు, పీరియడ్స్ సంబంధిత వాటికి సాంకేతిక సహాయాలను అందిస్తుంది.

వినియోగదారులకు ఈ ప్లాట్‌ఫాం ఎలాంటి వివక్ష లేని పునరుత్పత్తి టెలీ మెడిసిన్‌లు, గర్భ నిరోధక, స్త్రీ సురక్షా ప్రోడక్ట్‌లు అందించడానికి సాయం చేస్తుంది. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఎలా ఆర్డర్ చేస్తారో అలాగే ఇది ఉంటుంది. పీరియడ్ సంబంధిత వస్తువులు అందరికీ అందుబాటులో ఉంచడం, నాణ్యమైన ఆరోగ్య పరిరక్షణ ముఖ్యంగా యవ్వనంలో ఉన్న యువతులు, వెనుకబడిన జాతుల వారికి అన్ని వస్తువులు అందేలా చూడటం కోటుకి బాధ్యతగా నిర్వర్తిస్తుంది.

యువత తమ సమస్యలకు సమాధానాలు కనుక్కోవడం చూస్తుంటే చాలా అందంగా ఉంది. ఇలా అయితే మన తల్లిదండ్రులు ఎదుర్కొన్న సమస్యలు భవిష్యత్ తరాలకు రాకుండా ఉంటాయి.

అసోనిలే కోటు

మేరీ క్రిస్టినా కోలో

మేరీ క్రిస్టినా కోలో, మడగాస్కర్

వాతావరణ వేత్త ( ఉద్యమకారిణి)

మేరీ క్రిస్టినా కోలో.. గ్రీన్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్, ఎకోఫెమినిస్ట్. ఆమె కాప్ 27 సదస్సులో మడగాస్కర్ అధికార ప్రతినిధి బృందం తరఫున పాల్గొన్నారు. వాతావరణ మార్పుల విషయంలో మానవ హక్కులు, జెండర్ విషయాలపై ఆమె చర్చించారు. ఆమె దేశం వరుస కరువులతో అల్లాడిపోయింది, తిండి కూడా దొరక్క లక్షలాది మంది అల్లాడిపోయారు. ఇది వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడిన మొదటి కరువుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

ఎన్జీవో ప్రజా శక్తి చేరికలకు (ఎన్జీవో పీపుల్ పవర్ ఇన్‌క్ల్యూజన్) క్రిస్టినా కోలో రీజనల్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. గ్రీన్ ఎకానమీ ద్వారా పేదరికంపై పోరాడటమే ఈ సంస్థ ఉద్దేశం. తన సామాజిక సంస్థ ‘గ్రీన్ ఎన్ కూల్’ వాతావరణ న్యాయం విషయానికి ప్రధాన వేదికైంది. జెండర్ ఆధారితంగా జరిగే హింసను ఎదుర్కొనేందుకు ఆమె పలు ఉద్యమాలు నడిపింది. ‘ఉమెన్ బ్రేక్ ది సైలెన్స్’ పేరిట సాగిన ఈ ఉద్యమం అత్యాచారాలకు వ్యతిరేకంగా నడిచింది.

వాతావరణ మార్పులు, హింస, పితృస్వామ్యం కారణంగా బలయ్యే వాళ్లలో కేవలం పేదవారు మాత్రమే బాధితులుగా ఉండటాన్ని మేం కోరుకోవడం లేదు. మహిళలు అన్ని కష్ట సమయాల్లో ధైర్యంగా నిలబడటాన్ని చూస్తే నాకు చాలా గర్వకారణంగా, ఆశావాదంగానూ ఉంటుంది.

మేరీ క్రిస్టినా కోలో

శాండీ క్యాబ్రెరా అర్టీగా

శాండీ క్యాబ్రెరా అర్టీగా, హోండురస్

పునరుత్పత్తి హక్కుల న్యాయవాది

శాండీ క్యాబెరా అర్టెగా ఒక ఫిలాసఫీ విద్యార్థి, రచయిత మరియు మహిళా హక్కుల కార్యకర్త. ఆమె తరచుగా మహిళల హక్కులు, సంబంధిత సమస్యలపై ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆమె మార్నింగ్ ఆఫ్టర్ పిల్ (గర్భ నిరోధక మాత్రలు)పై వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. అత్యవసర గర్భనిరోధకం కోసం వాదించే అసోసియేషన్ అయిన హెబ్లోమిస్ లో కి ఈజ్‌కి శాండీ ప్రతినిధి.

మానవత్వం, పునరుత్పత్తి హక్కుల కోసం వాదించే సంస్థ కోసం ఆమె యాక్షన్ జోవెన్ [యూత్ ఇనిషియేటివ్]గా పనిచేస్తున్నారు. ఆమె హోండురన్ సంకేత భాషలో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. ఆమె వినికిడి లోపం ఉన్న తల్లికి ఒంటరిగా ఉన్న ఏకైక సంతానం. ఆమె ఎదుగుదలను గర్వంగా చెబుతున్నారు శాండీ.

డిలెక్ గుర్సోయ్

డిలెక్ గుర్సోయ్, జర్మనీ

హార్ట్ సర్జన్

ఆమె టర్కీ నుంచి జర్మనీకి వలస వచ్చిన దంపతులకు జన్మించారు. డాక్టర్ డిలెక్ గుర్సోయ్ ప్రముఖ హార్ట్ సర్జన్, ఆర్టిఫిషియల్ హార్ట్ స్పెషలిస్ట్. యూరప్‌లో కృత్రిమ హృదయాన్ని అమర్చిన తొలి మహిళా సర్జన్ ఈమె. ఈ ఆపరేషన్ తర్వాత ఆమెను ప్రశంసిస్తూ ఫోర్బ్స్ మ్యాగజీన్ జర్మనీలో కవర్ పేజీని ప్రచురించింది.

దశాబ్ద కాలానికి పైగా కృత్రిమ హృదయ పరిశోధనలో ఆమె ముందంజలో ఉన్నారు. గుండె మార్పిడికి ప్రత్యామ్నాయ విధానాన్ని అభివృద్ధి చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. స్త్రీ శరీర నిర్మాణ శాస్త్రంపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. తన ఆటోబయోగ్రఫీని కూడా రాశారు. ప్రస్తుతం ఆమె సొంతంగా హార్ట్ క్లినిక్‌ను తెరిచేందుకు డిలెక్ గుర్సోయ్ చూస్తున్నారు.

వెగహతా గెబ్రేయోహన్నెస్ అబెరా

వెగహతా గెబ్రేయోహన్నెస్ అబెరా, టిగ్రే, ఇథియోపియా

మానవతా సహాయ కార్యకర్త

మానవతా సహాయ కార్యకర్త అయిన వెగహతా గెబ్రేయోహన్నెస్ అబెరా, లాభాపేక్ష లేని హెడ్రినా అనే సంస్థకు వ్యవస్థాపకురాలు. టిగ్రేలోని సంక్షోభ కారణంగా ఏర్పడిన పోషకాహార లోపాన్ని పారదోలాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. యుద్ధం మూలంగా ప్రభావితమైన ఎంతో మంది మహిళలకు, పిల్లలకు పలు ప్రాజెక్టుల ద్వారా ఈ సంస్థ సాయం చేస్తుంది. దివ్యాంగ ప్రజలకు ఎమర్జెన్సీ ఫీడింగ్ ప్రొగ్రామ్‌ నిర్వహించడంతో పాటు, అర్బన్ గార్డెనింగ్ ప్రాజెక్టును కూడా ఈ సంస్థ చేపడుతోంది.

లైంగిక హింసకు గురై కుంగుబాటుకు లోనైన బాధిత మహిళలకు సాధికారత కల్పించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. యుద్ధం వల్ల తలెత్తిన సంక్షోభం కారణంగా ఎంతో మంది మహిళలు పేదలుగా మాారారు. వారు తమ కడుపు నింపుకునేందుకు, కమర్షియల్ సెక్స్ వర్కర్లుగా మారారు.

యానా జింకేవిచ్

యానా జింకేవిచ్, యుక్రెయిన్

రాజకీయ నాయకురాలు, ఫ్రంట్‌లైన్ మెడికల్ ఆఫీసర్

యుద్ధంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు హాస్పిటల్లర్స్ అనే స్వచ్ఛంద పారామెడిక్ ఆర్గనైజేషన్ పనిచేసేది. దీనికి యానా జింకేవిచ్ నేతృత్వం వహించే వారు. యుద్ధం భూముల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే వీరి పని. స్కూల్ అయిపోగానే మెడికల్ వాలంటీర్‌గా జింకేవిచ్ పనిచేసేవారు. 2014లో యుక్రెయిన్‌‌లో ఆమె బెటాలియాన్ అనే సంస్థను కూడా స్థాపించారు.

యానాా జింకేవిచ్ గాయపడిన 200 మంది సైనికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన సైనికులకు, ప్రజలకు ఆమె టీమ్ ప్రాథమిక చికిత్స అందిస్తుంది. వైద్య శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించే వారు. సుమారు 6 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 27 ఏళ్ల యానా జింకేవిచ్, యుక్రెయిన్ పార్లమెంట్‌లో అత్యంత పిన్న వయసు కలిగిన సభ్యురాలు కూడా. మిలటరీ మెడిసిన్ సబ్‌కమిటీకి అధినేతగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు.

సమ్రావిత్ ఫిక్రు

సమ్రావిత్ ఫిక్రు, ఇథియోపియా

టెక్ వ్యవస్థాపకురాలు

తనకు 17 ఏళ్లు వచ్చేంత వరకు తాను కంప్యూటర్ వాడనప్పటికీ, హైబ్రిడ్ డిజైన్స్‌ అనే సంస్థను సమ్రావిత్ ఫిక్రు స్థాపించారు. ఆమె ఒక ప్రొగ్రామర్. ఇథియోపియో ట్యాక్సి యాప్‌ రైడ్‌ వెనుకున్న కంపెనీలలో హైబ్రిడ్ డిజైన్స్ ఒకటి.

ఆఫీసు వర్క్ అయిపోయిన తర్వాత ట్యాక్సీలు ఎక్కడం అసురక్షితమైనవిగా తనకు అనుభవం ఎదురు కావడంతో పాటు డ్రైవర్లు అదనపు ఛార్జీలతో విసిగిపోయిన సమ్రావిత్ ఫిక్రు, 2 వేల డాలర్ల కంటే తక్కువకే ట్యాక్సి యాప్‌ రైడ్‌ను ప్రారంభించారు. తన కంపెనీలో మెజార్టీ ఉద్యోగులు మహిళలే. ఇథియోపియా టెక్ ఇండస్ట్రీలో ఉన్న అత్యంత కొద్ది మంది మహిళలలో, ఫిక్రు ఒకరు. తర్వాతి తరం యువ మహిళా వ్యవస్థాపకులకు ఆమె ఒక మార్గదర్శకంగా నిలవాలనుకుంటున్నారు.

మహిళలు నిర్వహించే వ్యాపారాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పుడు మరింత మంది అమ్మాయిలు తమ సృజనాత్మక ఆలోచనలను అమల్లోకి తీసుకొచ్చేందుకు మనం ఆర్థిక సౌకర్యాలను కల్పించాల్సి ఉంది.

సమ్రావిత్ ఫిక్రు

శిరీష బండ్ల

శిరీష బండ్ల, భారత్

ఏరోనాటికల్ ఇంజనీర్

చారిత్రాత్మకమైన 2021 యూనిటీ 22 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన మహిళ శిరీష బండ్ల. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ రూపొందించిన వ్యోమనౌకలో ఆమె ప్రయాణించారు. భారత్‌లో పుట్టి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన రెండో మహిళగా శిరీష బండ్ల పేరుగాంచారు.

చిన్న వయసులోనే శిరీషాకి అంతరిక్షంపై మక్కువ ఏర్పడింది. ఈ మక్కువతో అమెరికాలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో ప్రభుత్వ వ్యవహారాల, పరిశోధన కార్యక్రమాల వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. విమానయాన శాస్త్రంలో పరిశోధన చేస్తున్న కస్టమర్లతో కలిసి పనిచేయడం, వీజీ స్పేస్‌షిప్‌లో సాంకేతిక ప్రయోగాలు నిర్వహించడం ఆమె విధి.

సన్నీ లియోన్

2016 విజేత, నటి సన్నీ లియోన్ ఈమెను నామినేట్ చేశారు.

పురుషాధిక్యం ఉన్న ఈ స్పేస్‌లో, శిరీష ప్రతి దాన్ని అధిగమించింది. తన కృషి, అంకితభావం నాకెంతో స్ఫూర్తి కలిగించాయి. ముఖ్యంగా, అమ్మాయిలందరూ కూడా ఇలాంటి కలలు కనాలని నేను ఆశిస్తున్నాను.

విక్టోరియా బాప్టిస్ట్

విక్టోరియా బాప్టిస్ట్, అమెరికా

నర్స్, వ్యాక్సిన్ ఎడ్యుకేటర్

విక్టోరియా బాప్టిస్ట్ అమెరికాలోని మేరీలాండ్లో నర్సు. వ్యాక్సిన్ల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా, నల్లజాతి ప్రజలు ఎందుకు వైద్యం విషయంలో దూరంగా ఉంటారో ఆమెకు అర్థమైంది. 1951లో గర్భాశయ కేన్సర్‌తో చనిపోయిన నల్లజాతి మహిళ అయిన హెన్రీట్టా లాక్స్ కణాలను ఆమె అనుమతి లేకుండానే తీసుకున్నారు. ల్యాబ్‌లో వృద్ది చెందిన వాటిలో అదే మొదటిది. ఆ లాక్స్ సంతతికి చెందిన వ్యక్తే ఈ బాప్టిస్ట్.

వాటినే హెలా సెల్స్ అంటారు. ఆ కణాలను అప్పటినుంచే వైద్య పరిశోధనల కోసం వాడుతున్నారు. అయితే ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలియకపోవడం గమనార్హం. ప్రస్తుతం బాప్టిస్ట్ హెన్రీట్టా లాక్స్ ఫౌండేషన్లో పనిచేస్తున్నారు. అంతేకాకుండా గర్భాశయ కేన్సర్ నిర్మూలన కోసం డబ్ల్యూహెచ్‌వో గుడ్ విల్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు.

నీలోఫార్ భయానీ

నీలోఫార్ భయానీ, ఇరాన్

పర్యావరణ శాస్త్రవేత్త

2018లో ఇరాన్‌లో విపత్తులో ఉన్న జీవరాశుల చిత్రాలు తీసినందుకు బహిష్కరణకు గురైన పర్యావరణ వేత్తలలో నీలోఫార్ భయానీ కూడా ఒకరు. సున్నితమైన ప్రదేశాల్లో వర్గీకృత సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆమెకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

ఆసియా చిరుత, ఇతర జీవులను రక్షించడానికి పెర్షియన్ వైల్డ్ లైఫ్ హెరిటేజ్ ఫౌండేషన్‌లో భయాని ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేసేవారు. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూజనరీ గార్డ్స్ బృందం తనపై 1,200 గంటల పాటు శారీరక , మానసిక హింస, లైంగిక బెదిరింపులతో సహా నేరాలకు పాల్పడ్డారని ఆమె బీబీసీ పర్షియన్‌కు వెల్లడించారు. ఇరాన్ అధికారులు సకాలంలో ఆరోపణలను తిరస్కరించారు.

 నిగార్ మార్ఫ్

నిగార్ మార్ఫ్, ఇరాక్

నర్సు

నిగార్ మార్ఫ్ ఇరాాకి కుర్దిస్తాన్‌లో ప్రధాన బర్న్స్ యూనిట్‌లో హెడ్‌ నర్సుగా పనిచేస్తున్నారు. తమను తాము కాల్చుకున్న ఎంతో మంది మహిళలకు నిగార్ చికిత్స చేశారు. నిరసనలను వెళ్లగక్కేందుకు ఆ ప్రాంతంలోని యువతులు ఎక్కువగా ఇలా తమకి తాము నిప్పంటించుకోవడం అక్కడ ఇంకా సర్వసాధారణంగానే ఉంది.

నిగార్ మార్ఫ్ సుమారు 25 ఏళ్లుగా ఆసుపత్రులలో పనిచేస్తున్నారు. పిడియాట్రిక్ బర్న్స్, ఇంటెన్షివ్ కేర్‌ రెండింట్లో ఆమె వర్క్ చేశారు. ఆమె వార్డులో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైన రోగులకు కూడా చికిత్సను అందిస్తారు. అయితే ఇలా తమని తాము కాల్చుకుంటోన్న చాలా మంది మహిళలు, ఈ సంఘటనకు ముందే శారీరకంగా, మానసికంగా తీవ్ర హింసకు గురై ఉంటున్నట్టు ఆమె తెలుసుకున్నారు. వీరిలో 16 ఏళ్ల వయసున్న అమ్మాయిలు కూడా ఉన్నారు.

మోనికా ముసోండ

మోనికా ముసోండ, జాంబియా

వ్యాపారవేత్త

కార్పొరేట్ లాయర్ నుంచి వ్యాపారవేత్తగా మారిన మోనికా ముసోండ, జావా ఫుడ్స్‌కి వ్యవస్థాపకురాలు, సీఈవో. జావా ఫుడ్స్ జాంబియాకి చెందిన ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ. దక్షిణ ఆఫ్రికన్ ప్రాంతంలో ఇన్‌స్టాంట్ నూడిల్స్‌ను ఇది తయారు చేస్తుంది. అత్యంత తక్కువ ధరలో ఆహారోత్పత్తులను తయారు చేయాలని ముసోండ లక్ష్యంగా పెట్టుకున్నారు. తమ దేశంలో గోధుమల పంట ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో పాటు మారుతున్న వినియోగదారుల విధానాలను, సౌకర్యవంతమైన ఆహారాలకు పెరుగుతున్న డిమాండ్‌ను అవకాశంగా తీసుకుని మోనికా ముసోండ ఆహారోత్పత్తులను తయారు చేస్తున్నారు.

పోషకాహారాల గురించి తెలియజేసే ముసోండా ఇతర మహిళా వ్యాపారవేత్తలకు కూడా మెంటర్‌లాగా ఉన్నారు. వ్యాపారాలలో మహిళలకు ఎదురయ్యే సమస్యల గురించి వారితో చర్చించే వారు. వ్యాపార రంగంలో ఆమె చేస్తున్న కృషికి గాను పలు అవార్డులను ముసోండా పొందారు. ఆఫ్రికా వ్యవసాయ, ఆహార విధానాలను బలోపేతం చేసినందుకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులను అందుకున్నారు.

జానే రెగ్బీ

జానే రెగ్బీ, అమెరికా

ఖగోళ, భౌతిక శాస్త్రవేత్త

నాసాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, డాక్టర్ జేన్ రగ్బీ చాలా ఏళ్లుగా ‘గెలాక్సీ’లపై పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ అయిన జేమ్స్ వెబ్ పరిశోధకులలో ఆమె కూడా ఒకరు. వెబ్ టెలిస్కోప్ తీసిన మొదటి కలర్ చిత్రం జూలైలో తీశారు. ఇది ఇప్పటివరకు ప్రపంచంలో తీసిన చిత్రాలలో డీటైల్డ్ ఇన్ఫ్రార్డ్ వ్యూ కలిగి ఉంది.

శాస్త్రీయ పరిశోధనపై 100 కంటే ఎక్కువ కథనాలను రగ్బీ ప్రచురించారు. ఆమె తన పరిశోధనల గానూ అనేక బహుమతులు అందుకున్నారు. సైన్స్, సాంకేతిక, ఇంజినీరింగ్ మరియు అకౌంటింగ్‌లో నైపుణ్యం కలిగిన సమూహంలో ఆమె కీలక వ్యక్తి.

నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, నాకు LGBT రోల్ మోడల్స్ గురించి పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు రోల్ మోడల్స్ లేకుండా పెరిగిన తరువాతి తరంలో నేను ఒక వ్యక్తిని అవుతానేమో.

జానే రెగ్బీ

నాజా లిబెర్త్

నాజా లిబెర్త్, గ్రీన్ లాండ్

సైకాలజిస్టు

ట్రూమా థెరపిస్ట్ నాజా లిబెర్త్.. ఇంట్రాటెరైన్ పరికరం అమర్చినపుడు కేవలం 13 సంవత్సరాల బాలిక. ఈ పరికరం ఒక తీగచుట్ట లాంటిది. డానీస్ ప్రభుత్వం గ్రీన్‌లాండ్‌లో పిల్లలు పుట్టకుండా చేపట్టిన క్యాంపెయిన్‌లో భాగంగా 1960, 70 దశకంలో అమలు చేశారు. అయితే ఈ ప్రయోగాలపై విచారణ జరపాల్సిందిగా ఈ ఏడాది డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌లు అంగీకారానికి వచ్చాయి. ఈ నిర్ణయం దాదాపు 4,500 మంది బాలికలు, మహిళలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ మహిళలకు సాయం చేయడానికి లిబెర్త్ క్యాంపెయిన్ ముందుంది. సంతానోత్పత్తి సమస్యలకు కాయిల్ కారణమని అనుమానించబడే వారికి కూడా సాయం అందించారు. ఆమె వీరందరి కోసం ఒక ఫేస్‌బుక్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్లు ఒకరికొకరు అనుసంధానమై, సాయం చేసుకునేలా తోడ్పడ్డారు.

ప్రాణాలతో బయటపడిన ఇలాంటి మహిళలు ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మిమ్మల్ని ఎవరూ టార్గెట్ చేయలేరని మీకు అర్థమైనపుడు, బయటికి మీ గొంతు వినిపించడం ద్వారా భయం పోతుంది. భయం మనల్ని అదుపులో ఉంచకూడదు.

నాజా లిబెర్త్

ఎరికా లిరియానో

ఎరికా లిరియానో, డొమెనికన్ రిపబ్లిక్

కోకో వ్యాపారవేత్త

కోకో సప్లయి చెయిన్‌ను పునర్ రూపొందించే లక్ష్యాల్లో భాగంగా.. డొమెనికన్ రిపబ్లిక్‌లో ఎరికా లిరియానో ఒక ప్రాఫిట్ షేరింగ్ ఎక్స్‌పోర్టు స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. తన సోదరి జెనెత్‌తో కలిసి INARU పేరుతో ఈ సంస్థను స్థాపించారు. ఇది కోకా ఉత్పత్తిని, పంపిణీని స్థిరంగా చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఈ స్టార్టప్‌కి సీడ్ ఫండింగ్ కూడా అందింది.

చారిత్రాత్మకంగా, కోకా పరిశ్రమ తీవ్ర దోపిడికి గురవుతోంది. చిన్న రైతులు మోసపోతున్నారు. అయితే ఎరికా ఏర్పాటు చేసిన ఈ స్టార్టప్, డొమెనికన్ ఉత్పత్తిదారులకు న్యాయమైన వేతనాలను ఇచ్చేందుకు కృషి చేస్తుంది. న్యూయార్క్‌లో జన్మించిన ఈ అక్కాచెల్లెళ్లు, రైతు కుటుంబానికి చెందిన వారు. వీరు డొమెనికన్ రిపబ్లిక్‌లో వ్యాపారవేత్తలుగా ఎదిగారు. దేశవ్యాప్తంగా మహిళలు నడుపుతున్న ఫామ్స్, కోఆపరేటివ్స్, సప్లయిస్‌కి వీరు భాగస్వాములుగా ఉంటూ వారికి సాయపడుతున్నారు.

మీ మార్గాన్ని మీరే నిర్ణయించుకునే శక్తి మీకుండాలి. మహిళలు తనకు తానుగా ఏ రకమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నారో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, శక్తి ఉండాలి.

ఎరికా లిరియానో

మెరీనా వియాజోవ్స్కా

మెరీనా వియాజోవ్స్కా, యుక్రెయిన్

మ్యాథమేటిషియన్

మ్యాథమేటిషియన్‌లో నోబెల్ బహుమతిగా అభివర్ణించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫీల్డ్స్ మెడల్‌ను పొందిన రెండో మహిళగా ఈ యుక్రెయిన్ మ్యాథమేటిషియన్ నిలిచారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ పతకాన్ని అందుకున్నారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ మెడల్‌ను అందిస్తూ ఉంటారు. 400 ఏళ్లకు చెందిన పజ్జిల్‌ను పరిష్కరించడం ద్వారా ఆమెకు ఈ మెడల్ దక్కింది. 8 డైమెన్షన్లతో గోళాల ప్యాకింగ్ సమస్యను ఆమె పరిష్కరించారు.

లౌసాన్నెలో స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మ్యాథమేటిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ నెంబర్ థియరీకి ప్రొఫెసర్‌గా, ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.

ఐనురా సాగైన్

ఐనురా సాగైన్, కిర్గిస్తాన్

ఇంజనీర్

ఐనురా సాగైన్ కంప్యూటర్ ఇంజనీర్, ఓ స్టార్టప్‌కు సీఈవో, స్త్రీ వాది. ఐనురా తన మేథస్సుతో సాంకేతికతను వినియోగించి పర్యావరణ సమస్యలను పరిష్కరించేవారు. ఆమె తాజర్ అనే యాప్ ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ సాయంతో చెత్త ఎక్కువగా పేరుకుపోయే ఇళ్లు, రెస్టారెంట్లు, ఫ్యాక్టరీలు తదితర వాటికి చెత్తను రీసైక్లింగ్ చేసే వాళ్లతో కనెక్టివిటీ పెంచవచ్చు. ఈ యాప్ ముఖ్య ఉద్ధేశం భూమిలో పేరుకుపోయే చెత్తను తగ్గించడం, మధ్య ఆసియా దేశాలలో స్థిరత్వం సమస్యను పరిష్కరించడం.

కిర్గిస్తాన్‌లోని దాదాపు 2,000 మంది పాఠశాల విద్యార్థినులకు ఆమె కోడింగ్, స్టెమ్ ( సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమెటిక్స్)లలో వర్క్‌షాప్స్ నిర్వహించారు.

ఈ రోజుల్లో వాతావరణంపై స్పందనలకు మహిళల నాయకత్వం లేకపోతే భూమిపై స్థిరత్వానికి సమాధానాలు దొరకడం కష్టం. లింగ సమానత్వం కూడా రేపు తెలిసిపోతుంది.

ఐనురా సాగైన్

 మోనికా సింప్సన్

మోనికా సింప్సన్, అమెరికా

సంతానోత్పత్తి హక్కుల కార్యకర్త

సిస్టర్ సాంగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, దక్షిణ అమెరికా రాష్ట్రాలలో సంతానోత్పత్తి హక్కుల కార్యకర్తగా మోనికా సింప్సన్ పనిచేస్తున్నారు. శృంగార, సంతానోత్పత్తిలో స్వేచ్ఛ కోసం మోనికా సింప్సన్ పోరాటం చేస్తున్నారు. రో వర్సెస్ వేడ్ కేసు సందర్భంగా మహిళలకు అబార్షన్ హక్కును అనుమతించిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేయడంతో... ఈ అంశం మళ్లీ వెలుగులోకి వచ్చింది.

సింప్సన్ గాయని కూడా. అంతేకాక స్పోకెన్ వర్డ్ ఆర్టిస్టు. అంటే ఆమె గీసే బొమ్మల్లోనే తన సందేశాలను తెలియజేసేవారు. దౌలా సర్టిఫికేషన్ కూడా పొందారు. బ్లాక్ మామాస్ మ్యాటర్ అలయెన్స్‌కి మోనికా సింప్సన్ వ్యవస్థాపక బోర్డు సభ్యురాలు.

యులికా పైవ్ స్కా

యులికా పైవ్ స్కా, ఉక్రెయిన్

పారామెడిక్

యులికాా ఉక్రెయిన్ జాతీయత కలిగిన పారామెడిక్. తాయ్‌రాస్ ఏంజెల్స్ వ్యవస్థాపకురాలు కూడా. గాయపడిన వందలాది దేశ ప్రజలు, మిలటరీ సిబ్బందికి వైద్యపరమైన సాయం అందించారు. యులికా ‘తాయ్ రా’ పేరుతో ప్రసిద్ధి. ఆమెను ఈ ఏడాది మార్చిలో మారియుపోల్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటే రష్యన్ బలగాలు పట్టుకున్నాయి.

రష్యన్ బలగాలు ముట్టడించిన ఆ నగరంలో తన టీం వర్క్ ను డాక్యుమెంటరీగా తీయడానికి ఆమె బాడీ కెమెరాను ఉపయోగించారు. ఆ వీడియో ఫుటేజ్ మీడియాకు ఆమె అందజేశారు. ఆమె విడుదలైన మూడు నెలల తర్వాత పైవ్ స్కా మాట్లాడారు. కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు, క్రూరంగా ప్రవర్తించారని అదొక నరక కూపంగా ఆమె వివరించారు.

కిమికో హిరాటా

కిమికో హిరాటా, జపాన్

పర్యావరణ ప్రచార కర్త

కిమికో హిరాటా తన జీవితంలో దాదాపు సగానికి పైగా పర్యావరణం కోసం పోరాడుతూ గడిపారు. ఆమె పోరాటం ఫలితంగా దాదాపు 17 బొగ్గు ఫ్యాక్టరీలు నిలిచిపోయాయి. గోల్డ్‌మ్యాన్ ఎన్విరాన్‌మెంటల్ అవార్డును గెలుచుకున్న మొదటి జపాన్ మహిళగా కిమాకో నిలిచారు.

1990లలో అల్ గోర్ పుస్తకాన్ని చదివిన తర్వాత, కిమికో ఒక ప్రచురణ సంస్థలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, వాతావరణ మార్పు కార్యకర్తగా మారాలని నిర్ణయించుకున్నారు. ఆమె ప్రస్తుతం జనవరిలో స్థాపించబడిన స్వతంత్ర వాతావరణ మార్పు సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

 సోఫియా హీనోనెన్

సోఫియా హీనోనెన్, అర్జెంటీనా

సంరక్షణవాది

జీవ వైవిధ్యాన్ని రక్షించేందుకు కట్టుబడి ఉన్న బయోలజిస్ట్ సోఫియా హీనోనెన్, దక్షిణ అమెరికాలో అంతరించుకుపోతున్న జాతులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే అర్జెంటీనాలో ప్రధానమైన వెట్ ల్యాండ్ ఎకోసిస్టమ్‌ సంరక్షణ బాధ్యతలను కూడా చేపడుతున్నారు సంరక్షణ ప్రాంతాలను ఏర్పాటు చేసేందుకు తాను 30 ఏళ్లకు పైగా పాటుపడుతోంది.

తన నాయకత్వంలో, నాలుగు ప్రధాన ఎకో రీజియన్లలో రివైల్డింగ్ అర్జెంటీనా ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద ప్రైవేట్ ల్యాండ్‌ని సంరక్షణ జాతీయ పార్కులకు మారుస్తున్నారు. దీని ద్వారా సుస్థిరమైన ఎకోటూరిజాన్ని అభివ‌ద్ధి చేయడం, పలు పక్షి జాతుల కోసం ఎకోసిస్టమ్‌లను తిరిగి ప్రవేశపెట్టడం చేస్తున్నారు.

100 మంది మహిళలు- బీబీసీ వరల్డ్ సర్వీస్

100 మంది మహిళలంటే?

ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 100 మంది స్ఫూర్తిదాయకమైన, ప్రభావవంతమైన మహిళల పేర్లను ’’బీబీసీ 100 మంది మహిళలు‘‘ ఎంపిక చేస్తుంది. మేం వాళ్ల జీవితాల గురించి డాక్యుమెంటరీలు, ఫీచర్స్, ఇంటర్వ్యూలు రూపొందిస్తాం.

ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌‌బుక్, ట్విట్టర్‌లో బీబీసీ 100 మంది మహిళలు (BBC 100 Women) పేజీలను ఫాలో అవండి. #BBC100Women హ్యాష్‌ట్యాగ్‌తో మీ భావాలు పంచుకోండి

100 మంది మహిళలను ఎలా ఎంపిక చేస్తారు?

బీబీసీ నెట్‌వర్క్ వరల్డ్ సర్వీస్ భాషల టీంలు సేకరించి, సూచించిన పేర్లను బీబీసీ 100 మంది మహిళల టీం షార్ట్‌లిస్టు చేస్తుంది. గత 12 నెలల్లో వార్తల్లో నిలిచిన వ్యక్తులు గానీ, ఆ వార్తలను ప్రభావితం చేసిన వ్యక్తులు లేదా ఎవరి కథలైనా చెప్పడానికి స్ఫూర్తినిచ్చేలా ఉన్నవి, ఏదైనా గొప్పవి సాధించిన వారు, తమ సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు వార్తల్లో లేకున్నా వారి వివరాలు చూస్తాం. ఈ ఏడాది థీమ్‌కు అనుగుణంగా వారి పేర్లను మేం ఎంపిక చేశాం. గత పదేళ్లుగా వివిధ రంగాలలో వారి పురోగతిని అనుసరించి ఇది ఉంటుంది.

చాలా విషయాలను మేం విశదీకరించాం. ఉదాహరణకు ఎక్కడైతే మహిళల ఎదుగుదల తక్కువగా ఉందో అక్కడ పునరుత్పత్తి హక్కులు కల్పించడం, మార్పు తీసుకొచ్చిన మహిళలు నామినేట్ చేయబడతారు. తుది పేర్లు సెలెక్ట్ చేయడానికి ముందే ఈ జాబితాలో ప్రాంతీయంగా కూడా రిప్రెజెంట్ చేస్తూ, వివక్ష లేకుండా ఎంపిక ఉంటుంది.

కొంతమంది మహిళలు, వారి కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకుని వారి అనుమతితో జాబితాలో వారి పేర్లు ఉండకపోవచ్చు,పేర్లలో ఇంటిపేరు (పూర్తి పేరు) ఉండకపోవచ్చు. బీబీసీ ఎడిటోరియల్ పాలసీ మరియు భద్రత మార్గదర్శకాలను పాటిస్తుంది.