బీబీసీ 100 మంది మహిళలు 2023 : ఈ సారి జాబితాలో ఎవరెవరున్నారు?

బీబీసీ 100 మంది మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న వారి చిత్రాలు

బీబీసీ 2023 సంవత్సరానికిగాను ప్రపంచ వ్యాప్తంగా ప్రభావవంతమైన, శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది.

వారిలో అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా, మానవ హక్కుల న్యాయవాది అమల్ క్లూనే, హాలీవుడ్ స్టార్ అమెరికా ఫెరారా, కృత్రిమ మేధ నిపుణురాలు తిమ్నిత్ గెబ్రు, స్త్రీవాద హక్కుల నేత గ్లోరియా స్టైనెమ్, బ్యూటీ బిజినెస్ యజమాని హుదా కట్టన్ , బలోన్ దియోర్ అవార్డు గెలుచుకున్న ఫుట్‌బాలర్ ఐతానా బొన్మాతి ఇలాంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులు, వరదలు, ప్రకృతి వైపరిత్యాలు పతాకశీర్షికలుగా మారిన పరిస్థితులలో వాతావరణ మార్పులపై దృష్టి పెడుతూ తమ సముదాయాలకి వాటిని ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళల్లో చాలా మందికి ఈ జాబితాలో చోటు దక్కింది.

ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు COP 28 జరగనున్న సందర్భంగా బీబీసీ 100 మంది మహిళల్లో 28 మంది పర్యావరణ కార్యకర్తలు చోటు దక్కించుకున్నారు.

జాబితాలోని పేర్లు నిర్ధిష్ట క్రమంలో లేవు.

100 మంది మహిళల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు మీకు నచ్చినది ఎంచుకోండి

విద్య & సంస్కృతి

సారా ఓట్

సారా ఓట్ , అమెరికా

స్కూల్ టీచర్

వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి సమయంలో యుక్త వయసులో ఉన్నారు సారాహ్ ఓట్. మిడిల్ స్కూల్లో టీచర్‌గా ఉన్నప్పుడు తప్పుడు సమాచారం వలన తాను చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు.

సైన్స్ గురించి చాలా చదువుకున్నప్పటికీ, పర్యావరణ మార్పుల గురించి వస్తున్న సమాచారం అంతా నిజమేనా అని సందేహించారు.

వాస్తవాల్ని గ్రహించడంలో తొలి అడుగులోనే తప్పు చేశానని గుర్తించారు. ఆ ప్రయాణం ఆమెను నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్‌ సంస్థకు క్లైమేట్ చేంజ్ అంబాసిడర్‌గా మార్చింది.

ప్రస్తుతం జార్జియా రాష్ట్రంలో ఉంటున్న ఆమె భౌతిక శాస్త్ర పరిశోధనలను బోధించేందుకు తాజా పర్యావరణ మార్పుల గురించి ప్రస్తావిస్తూ విద్యార్ధులకు పర్యావరణ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

పర్యావరణ మార్పు ఇప్పుడొక అత్యవసర పరిస్థితి. దీన్ని ఒంటరిగా మార్చేయ్యలేం. మార్పు కోసం పోరాటం ఓ పూదోట లాంటిది. కాలానుగుణంగా మారుతూ వస్తుంది. సమయాన్ని గౌరవిస్తూ మనం ముందుకు కదలాలి.

సారా ఓట్

హోసాయ్ అహ్మద్‌జాయ్

హోసాయ్ అహ్మద్‌జాయ్, అఫ్గానిస్తాన్

టీవీ యాంకర్

అఫ్గానిస్తాన్ 2021 అగస్టులో తాలిబాన్ పాలనలోకి వెళ్లినపుడు, ఆ దేశంలో టీవీలో వార్తలు చదువుతున్న కొద్ది మంది మహిళా న్యూస్ రీడర్లలో హోసాయ్ అహ్మద్‌జాయ్ ఒకరు.

ఆమె చేస్తున్న ఉద్యోగంపై సామాజిక, భద్రతాపరమైన ఆంక్షలు, భయాలు ఉన్నప్పటికీ షంషాద్ టీవీలో తన ఉద్యోగాన్ని కొనసాగించారు.

ఆమె అనేక మంది తాలిబాన్ అధికారులను ఇంటర్వ్యూ చేశారు. కానీ వాళ్లను ఆమె అడిగే ప్రశ్నలపై పరిమితులు విధించారు. వాళ్ల పాలనా తీరుని ప్రశ్నించేందుకు వీలు లేదు.

న్యాయశాస్త్రం, రాజనీతి శాస్త్రం చదువుకున్న అహ్మద్‌జాయ్ ఏడేళ్లుగా మీడియాలో పని చేస్తున్నారు. తాలిబాన్ ఆంక్షలను ఎదుర్కొంటున్న బాలికలకు చదువు చెప్పేందుకు ఆమె కృషి చేస్తున్నారు.

సుసన్నే ఇట్టి

సుసన్నే ఇట్టి, ఆస్ట్రేలియా

సస్టైనబుల్ టూరిజం నిపుణురాలు

ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీలోని వాతావరణ శాస్త్రవేత్తల్లో ఒకరైన సుసన్నేఇట్టి ఈ పరిశ్రమకు సుస్ధిరమైన భవిష్యత్ ఉండాలని, ఆ దిశగా దాన్ని నడిపించాలని కోరుకుంటున్నారు.

అడ్వెంచర్ ట్రావెల్ బిజినెస్ చేసే చిన్న గ్రూపు ఇంట్రెపిడ్ ట్రావెల్‌లో ఆమె ప్రపంచ పర్యావరణాన్ని ప్రభావితం చేసే మేనేజర్‌గా పని చేస్తున్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యసాధనలో శాస్త్రీయ విధానాలను అనుసరించే తొలి సంస్థగా ఇంట్రెపిడ్ ట్రావెల్ గుర్తింపు పొందింది.

ట్రావెల్ బిజినెస్‌లో కర్బన ఉద్గారాలను తగ్గించడాన్ని టూరిజం ఇండస్ట్రీ కోరుకుంటోందని ఆమె ఓ పుస్తకం రాశారు. కర్బనాల నియంత్రణను టూరిజంలో ప్రధాన విభాగమైన 400 ట్రావెల్ ఆర్గనైజేషన్లు, కంపెనీలు, వృత్తి నిపుణులు వాతావరణ అత్యవసర పరిస్థితిగా ప్రకటించాయి.

పర్యావరణం మీద కర్బన ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించేందుకు అనేక వ్యాపార సంస్థలు లక్ష్యాలను నిర్దేశించుకోవడం మనం చూస్తున్నాం. ఇందులో బాగంగా పునరుత్పాదక ఇంధన, దీర్ఘకాలంలో ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలుగా పెట్టుబడులు పెడుతున్నాయి.

సుసన్నే ఇట్టి

నటాలాయా ఇద్రిసోవా

నటాలాయా ఇద్రిసోవా, తజికిస్థాన్

గ్రీన్ ఎనర్జీ కన్సల్టెంట్

తజికిస్థాన్‌లోని మారుమూల గ్రామాలలో నివసించే మహిళలు ఇంధనం, విద్యుత్ వంటి వాటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు ఆచరణాత్మక పరిష్కారాలు కనుగొంటూ, సహజ వనరులు, సమర్థవంతమైన సాంకేతికత వినియోగం గురించి అక్కడి మహిళలకు అవగాహన కల్పిస్తుంటారు ఎన్విరాన్‌మెంటల్ చారిటీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నటాలియా ఇద్రిసోవా.

వాళ్లకి శిక్షణనివ్వడంతోపాటు, ఆమె సంస్థ నుంచి అక్కడి మహిళలకు ఎనర్జీ సేవింగ్ కిట్లు, సోలార్ కిచెన్లు, ప్రెషర్ కుక్కర్లు వంటివి అందిస్తున్నారు. మహిళలకు కాస్త ఖాళీ సమయం దొరికేలా చేస్తూ ఇళ్లలో లింగ సమానత్వానికి సాయపడుతున్నారు.

తాజా పర్యావరణ మార్పులు వికలాంగులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వారు తమ సమస్యలను రాజకీయ వేదికలపై ఎలా వినిపించాలో శిక్షణ ఇస్తున్నారు ఇద్రిసోవా .

ప్రకృతి ప్రజలు వేర్వేరు కాదని చెబుతూ తాజాగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తులు మనకు చివరి హెచ్చరికలు చేస్తున్నాయి. మనం ప్రకృతిని నిర్లక్యం చేస్తే మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.

నటాలాయా ఇద్రిసోవా

కెరా షెర్‌ఉడ్ ఓరెగన్

కెరా షెర్‌ఉడ్ ఓరెగన్, న్యూజీలాండ్

మూలవాసుల హక్కులు, వికలాంగుల హక్కుల న్యాయవాది

ఏ కాయ్ తహు అనే మూలవాసి తెగకు చెందిన పర్యావరణ నిపుణుడు. న్యూజీలాండ్‌లోని సౌత్ ఐలాండ్‌లో టె వాయిపొనాముకి చెందినవారు కెరా షెర్‌ఉడ్ ఓరెగన్.

ఆమె యాక్టివేట్ సంస్థ సహవ్యవస్థాపకురాలు. ఈ సంస్థ వాతావరణ మార్పు, సామాజిక మార్పు ప్రధానాంశాలుగా నడుస్తోంది.

పర్యావరణ మార్పు చర్చలలో ప్రముఖ వేదికలపై ఇప్పటి వరకు ఎక్కడా కనిపించని న్యూజీలాండ్‌లోని మోరీ ప్రజల భూమి, పూర్వీకులపై ఆమె చాలా పరిశోధనలు చేశారు.

తన కమ్యూనిటీపై పర్యావరణ మార్పుల ప్రభావం గురించి చర్చించేందుకు మంత్రులు, అధికారులు, పౌర సమాజంతో గొప్ప సంబంధాలను ఏర్పరుచుకోగలిగారు. అలాగే సంచారజాతుల ప్రజలు, వికలాంగులు వారి హక్కులు, వారి మీద పర్యావరణ ప్రభావంపైనా ఆమె పనిచేస్తున్నారు.

వాతావరణ సంక్షోభానికి స్థానిక ప్రతిపత్తి సరైన పరిష్కారమని మేం గుర్తించాం. అందుకే, ఆ దిశగా మారుమూల ప్రాంతాల ప్రజలను ముందుకు నడిపిస్తున్నాం. స్థానిక వాస్తవికతలను నిర్లక్ష్యం చేసే కార్యాచరణనను మేం వ్యతిరేకిస్తున్నాం.

కెరా షెర్‌ఉడ్ ఓరెగన్

హుడా కట్టన్

హుడా కట్టన్, అమెరికా

సౌందర్య వ్యాపార సామ్రాజ్య వ్యవస్థాపకురాలు

అమెరికాకు వలస వచ్చిన ఇరాకీ కుటుంబంలో జన్మించిన హుడా కట్టన్ ఓక్లహామాలో పెరిగారు. సౌందర్య సాధనాల విభాగంలో ఉన్నఆసక్తి కారణంగా కార్పోరేట్ ఉద్యోగాన్ని వదిలేశారు.

లాస్ ఏంజిల్స్‌లోని ప్రఖ్యాత మేకప్ ట్రైనింగ్ స్కూల్‌లో చేరారు. మిడిల్ ఈస్ట్‌లోని రాజ కుటుంబాలతో పాటు అనేక మంది ప్రముఖులు ఆమె ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది అనుసరించే బ్యూటీ బ్రాండ్‌గా ఎదిగారామె. ఇన్‌స్టాలో ఆమెకు 5 కోట్లమంది ఫాలోయర్లు ఉన్నారు.

ప్రస్తుతం ఆమె వ్యాపారం 140 రకాల సౌందర్య ఉత్పత్తులతో బిలియన్ డాలర్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా 1500 స్టోర్లలో ఆమె ఉత్పత్తులను అమ్ముతున్నారు.

వీ కతివు

వీ కతివు, జింబాబ్వే యూకే

యూ ట్యూబర్, కంటెంట్ క్రియేటర్

చదువుకుంటూనే, మెక్ డోనల్డ్స్‌లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ నానా ఇబ్బందుల మధ్యే ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్శిటీల నుంచి డిగ్రీలు అందుకున్నారు వరాయ్ జో కతివు. ఆమె ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా వేల మందికి ఆదర్శంగా నిలిచింది.

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం నుంచి వచ్చిన కతివు, యూనివర్సిటీలో విద్యార్ధిగా తనకు ఎదురైన అనుభవాలు, తన లాంటి మరి కొంతమందికి చదువుకోవడం, సంపాదించుకోవడంలో మెళకువల గురించి వివరించేందుకు ఓ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా తన లాంటి వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్య అందించాలని కోరుతూ ఎంపవర్డ్ బై వీ అనే ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు..

యువత దైనందిన జీవితంలో ఆచరించదగిన అంశాలతో సెల్ఫ్ హెల్ప్ బుక్ రాసిన కతివు, ప్రస్తుతం ఎడ్యుకేషన్ లీడర్‌షిప్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు.

సోఫియా కియాన్ని

సోఫియా కియాన్ని, అమెరికా

సామాజికవేత్త

ఇరాన్‌లోని తన బంధువులతో మాట్లాడిన తర్వాత పర్యావరణ మార్పుల గురించిన సమాచారం తమ భాషలో చాలా తక్కువగా ఉందని తెలుసుకున్నారు సోఫియా కియాన్ని. దీంతో ఆమె దగ్గరున్న సమాచారాన్ని ఫార్సీ భాషలోకి అనువదించడం ప్రారంభించారు.

దీన్ని మరింత విస్తరించేందుకు పర్యావరణ సమాచారాన్ని ఇంగ్లీషు నుంచి ప్రతీ భాషలోకి అనువదించేందుకు వీలుగా అంతర్జాతీయంగా అనేక మంది యువకులతో కలిపి క్లైమేట్ కార్డినల్స్ అనే స్వచ్చంధ సంస్థను స్థాపించారు.

ప్రస్తుతం ఈ సంస్థ తరపున 80 దేశాల్లో 10వేల మంది విద్యార్థులు స్వచ్చంధంగా పని చేస్తున్నారు. వాళ్లు పర్యావరణం గురించిన లక్షకు పైగా పదాలను వంద భాషల్లోకి అనువదించారు.

పర్యావరణానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, భాష అనే అడ్డంకిని అధిగమించి అందరికీ చేరాలన్నదే కియాన్ని లక్ష్యం.

యువ కార్యకర్తలు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ నెట్‌వర్క్‌లను నిర్మించారు. లక్షల మందితో ఆందోళనలు చేశారు. శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా వేలాది పిటిషన్లు వేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం లక్షల డాలర్లు సేకరించారు. వయసు లేదా అనుభవం ద్వారా మనల్ని లొంగ దీసుకోవడానికి ప్రపంచంలోని సవాళ్లు చాలా పెద్దవి

సోఫియా కియాన్ని

పౌలినా చిజియానె

పౌలినా చిజియానె, మొజాంబిక్

రచయిత

1990లో తాను రాసిన 'బల్లాడ్ ఆఫ్ లవ్ ఇన్ ద విండ్' అనే పుస్తకంతో పౌలినా చిజియానె మొజాంబిక్‌లో నవల రాసిన తొలి మహిళా రచయితగా మారారు.

మొజాంబిక్ రాజధాని మపుటో శివార్లలో పుట్టి పెరిగిన చిజియానె అక్కడి కాథలిక్ స్కూల్‌లో పోర్చుగీస్ నేర్చుకున్నారు.

ఆమె రచనను ఇంగ్లీష్, స్పానిష్, జర్మన్‌తో పాటు అనేక ఇతర భాషల్లోకి అనువాదం చేశారు. ద ఫస్ట్ వైఫ్ – ఎ టేల్ ఆఫ్ పాలిగమీ అనే పుస్తకంతో ఆమెకు జోస్ క్రవీరినా అవార్డు వచ్చింది.

రచనా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పోర్చుగీస్ అవార్డు కేమోస్ ప్రైజ్‌ను ఆమె గెలుచుకున్నారు.

ఒక్సానా జబుజ్కో

ఒక్సానా జబుజ్కో, యుక్రెయిన్

రచయిత

ఇరవైకి పైగా రచనలు. వాటిలో కొన్ని కాల్పనికాలు, కొన్ని కవితలు, కొన్ని వాస్తవ గాధలు. వీటితో యుక్రెయిన్‌లో ప్రధాన రచయితలు, మేధావుల్లో ఒకరయ్యారు ఒక్సానా జబుజ్కో.

యుక్రేనియన్ సెక్స్, ద మ్యూజియం ఆఫ్ అబాండోన్డ్ సీక్రెట్స్ రచనలు ఆమెకు అంతర్జాతియంగా పేరు తెచ్చాయి.

ఆమె కీయెవ్‌లోని షెప్‌చెంకో యూనివర్సిటీలో ఫిలాసఫీ డిపార్టుమెంట్ నుంచి డిగ్రీ పట్టా పొందారు. తర్వాత పీహెచ్‌డీ చేశారు.

ఒక్సానా రచనలను 20 భాషల్లో అనువదించారు. అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. అందులో ఏంజెలస్ సెంట్రల్ యూరోపియన్ లిటరరీ ప్రైజ్, యుక్రెయిన్ షెవ్‌చెంకో నేషనల్ ప్రైజ్, ఫ్రెంచ్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ హానర్ వంటివి ఉన్నాయి.

అఫ్రోజ్ నుమ

అఫ్రోజ్ నుమ, పాకిస్తాన్

గొర్రెల కాపరి

వాఖి తెగలో చివరి తరం మహిళా గొర్రెల కాపరుల్లో అప్రోజ్ నుమా ఒకరు. ఆమె మూడు దశాబ్ధాలుగా మేకలు, బర్రెలు, గొర్రెలు పెంచుతున్నారు.

ఆమె తన పూర్వీకుల నుంచి వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాన్నికొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని శింషాల్ లోయలో అంతరించి పోతున్న ఏళ్ల నాటి సంప్రదాయంలో భాగంగా మారారు.

ప్రతీ ఏటా ఆమె తన గొర్రెలను సముద్ర మట్టం నుంచి 4800 మీటర్ల ఎత్తుకు తోలుకు వెళతారు. అక్కడే వాటిని మేపుతూ పాలు, పాల ఉత్పత్తులను ఇతర వస్తువులతో మారకపు పద్దతిలో అమ్ముతారు.

వాళ్ల సంపాదనతో గ్రామంలో సంపద పెరగడంతో పిల్లలను చదివిస్తున్నారు. ఈ లోయలో మొదటగా ఒక జత బూట్లను కొన్న మహిళగా తన గురించి ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు అఫ్రోజ్ నుమా.

జెత్సున్మా టెన్జిన్ పాల్మో

జెత్సున్మా టెన్జిన్ పాల్మో, భారత్

బిక్షుణి, బౌద్ధ సన్యాసిని

1940లో ఇంగ్లండ్‌లో పుట్టిన టెన్జిన్ యుక్తవయసు నుంచే బుద్దిజం పట్ల ఆకర్షితులయ్యారు.

20 ఏళ్ల వయసులోనే ఆమె భారత్‌కు వచ్చి బుద్దిజం స్వీకరించిన మొదటి పాశ్చాత్య యువతిగా నిలిచారు.

బుద్దిజాన్ని అనుసరించే మహిళలను ప్రోత్సహించడానికి ఆమె హిమాచల్ ప్రదేశ్‌లో డోంగ్యు గట్సల్ నన్నరీ ఆశ్రమాన్ని స్థాపించారు. ఇప్పుడు ఈ ఆశ్రమంలో 120 మందికి పైగా సన్యాసినులు ఉన్నారు.

12 ఏళ్ల పాటు హిమాలయాలలోని గుహలలో నివసించిన టెన్జిన్ మూడేళ్లపాటు ధ్యాన కేంద్రాల్లోనే గడిపారు. 2008లో ఆమెకు జెత్సున్మా అనే బిరుదును ఇచ్చారు. జెత్సున్మా అంటే జీవిత పరమార్థం బోధించే గొప్ప వ్యక్తి అని అర్థం.

లాలా పాస్కినెల్లి

లాలా పాస్కినెల్లి, అర్జెంటీనా

కళాకారిణి

విమెన్ హూ వర్ నాట్ ఆన్ మేగజీన్ కవర్ పేజ్' అనేది లాలా పాస్కినెల్లి మదిలో మెదిలిన చిరు ఆలోచన. 2015లో ఏర్పడిన ఈ సంస్థ ద్వారా మీడియాలో మహిళల ప్రాతినిధ్యాన్ని , సంస్కృతిని ప్రతిబింబించడంలో అవలంభించే మూసపద్దతిని ఆమె ప్రశ్నించారు.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళలు తమ శరీరం, వయసు పెరుగుదల, వారు తీసుకునే పౌష్టికాహారం గురించి పునరాలోచన చేయాలని ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. వారి తాజా కార్యక్రమం #HeramanasoltaLaPanza అంటే సోదరి, నీ పొట్టను లోపలికి లాగకు అంటూ శరీరం ఎలా ఉన్నా అందంగానే ఉంటుందనే సందేశమిచ్చారు.

న్యాయవాది, రచయిత, ఫెమినిస్ట్, హక్కుల కార్యకర్త అయిన పాస్కినెల్లి మహిళలపై క్లాసిస్ట్, సెక్సిస్ట్, రేసిస్ట్ అంటూ ముద్రవేసే సజాతీయ సౌందర్య విధానానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు.

కేరొలీనా దియాజ్ పిమెంటెల్

కేరొలీనా దియాజ్ పిమెంటెల్, పెరూ

జర్నలిస్ట్

20 ఏళ్ల వయసులో కెరోలీనాకున్న ఆటిజం సమస్య బయట పడింది. అయితే ఆమె మెదడు ఇతరుల కన్నా భిన్నంగా పని చేస్తుందని తెల్సుకున్న తర్వాత, ఆ విషయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు తనకు తానే కేక్ తయారు చేసుకున్నారు.

ప్రస్తుతం ఆమె 30ల్లో ఉన్నారు. ఆటిజం పట్ల గర్విస్తున్నారు కూడా. కేరొలీన్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. మెదడు భిన్నంగా పని చేసే వ్యక్తులను సూచించే న్యూరోడైవర్జెన్స్, మానసిక ఆరోగ్య అంశాలపై ఆమె పని చేస్తున్నారు.

మానసిక సామాజిక వైకల్యాల కారణంగా ప్రజలు సమాజం నుంచి ఎదుర్కొనే వివక్ష, మూసపోకడలను అరికట్టేందుకు దియాజ్ పని చేస్తున్నారు. న్యూరోడైవర్సిటీపైన ప్రజల్లో అవగాహన పెంచే స్వంచ్చంధ సంస్థలను, అనేక ప్రాజెక్టులను ఆమె ప్రారంభించారు. మాస్ క్యూ బైపోలార్, ద పెరూవియన్ న్యూరోడైవర్జంట్ కోయిలిషన్, ప్రాజెక్ట్ ఎటిపికల్ లాంటివి వాటిలో ఉన్నాయి.

పులిట్జర్ సెంటర్ గ్రాంటీ అనే జర్నలిస్టు సంఘంలో ఆమె సభ్యురాలు. రోసాలిన్ కార్టర్ స్కాలర్ కూడా.

జెస్ పెప్పర్

జెస్ పెప్పర్, బ్రిటన్

క్లైమేట్ కెఫే వ్యవస్థాపకురాలు

పర్యావరణ మార్పులపై చర్చించి, స్పందించేందుకు కొందరు వ్యక్తులు ఒక చోట కూర్చుని మాట్లాడుకునేందుకు ఏర్పాటు చేసుకున్నదే క్లైమేట్ కెఫే. స్కాట్లండ్‌లోని చిన్న పట్టణంలో దీన్ని 2015లో జెస్ పెప్పర్ స్థాపించారు.

మిగతా వ్యక్తులు కూడా తమ ప్రాంతాల్లో ఇలాంటి కెఫేలను ఏర్పాటు చేసుకునేందుకు ఆమె మద్దతిస్తున్నారు. వీటన్నింటినీ కలిపి గ్లోబల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

పర్యావరణ సంక్షోభం గురించి తమ ఆలోచనలు, ఆందోళనలను పంచుకోవడానికి క్లైమేట్ కెఫెలు సురక్షితమైన ప్రాంతాలని ఇందులో పాల్గొనేవారు చెబుతున్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం పెప్పర్ అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. ఆమె రాయల్ స్కాటిష్ జియోగ్రాఫికల్ సొసైటీలో గౌరవ సభ్యురాలిగా రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్‌లో సభ్యురాలిగా ఉన్నారు.

మహిళలు, చిన్నారులు నిర్వహించే కార్యక్రమాలతో ప్రజల్లో పర్యావరణం మీద స్పృహ, సానుకూల దృక్పథం పెరుగుతోంది. ప్రజల మధ్య సంబంధాలు మార్పు దిశగా ప్రోత్సహిస్తున్నాయి. మరింత మార్పు కోసం ప్రతిఘటించడంలో బాగంగా అవకాశాలు, రాజకీయ నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేసేలా చెయ్యడం నాలో మరింత ఆశను కలిగిస్తోంది.

జెస్ పెప్పర్

జన్నతుల్ ఫిర్దౌస్

జన్నతుల్ ఫిర్దౌస్, బంగ్లాదేశ్

అగ్నిప్రమాద బాధితురాలు

అగ్ని ప్రమాదంలో 60 శాతం శరీరం కాలిపోవడంతో అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డారు జన్నతుల్ ఫిర్దౌస్. ఆమె ఫిల్మ్ మేకర్. రచయిత. వికలాంగుల హక్కుల కార్యకర్త.

వాయిస్ అండ్ వ్యూస్ అనే మానవ హక్కుల సంస్థను స్థాపించిఅగ్ని ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్న మహిళల హక్కుల కోసం పోరాడుతున్నారు.

స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఐవీవై పేరుతో సుపరిచితమైన ఫిర్దౌస్, ఐదు షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు. మూడు నవలలు రాశారు. ఆమె రచనా నైపుణ్యంతో వికలాంగుల సమస్యలపైన ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ఫిర్దౌస్ విస్తృతంగా చదివారు. ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ చేశారు. డెవల్మెంట్ స్టడీస్‌లోనూ డిగ్రీ సంపాదించారు.

లీసియా ఫెర్జ్

లీసియా ఫెర్జ్, ఇటలీ

మోడల్, ఇన్‌ఫ్లూయెన్సర్

93 ఏళ్ల వయసు నిండిన అందరికీ ఇన్‌స్టాగ్రాంలో రెండు లక్షల 35 వేల మంది ఫాలోవర్లు ఉండరు. అసలు ఆ వయసువారిలో చాలా మందికి ఇన్‌స్టాగ్రాం అకౌంటే ఉండదు. కానీ ఇటలీలోని ఓ 93 ఏళ్ల మోడల్ బామ్మ, బాడీ పాజిటివిటీ కోసం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇన్‌ఫ్లూయన్సర్‌గా మారారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే.

లీషియా ఫెర్ట్జ్ రెండవ ప్రపంచ యుద్ధం మిగిల్చిన చేదు అనుభవాల్లోంచి జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చారు. 28 ఏళ్ల కుమార్తె, ఆమె భర్త చనిపోవడాన్ని భరించారు.

దాంతో ఆమెను ఉత్సాహపరిచేందుకు ఆమె మనమడు ఇన్‌స్టాగ్రాంలో ఆమె ప్రొఫైల్‌ని తెరిచాడు. ఆమె రంగురంగుల దుస్తులు, అందరినీ ఆకర్షించే ప్రకాశవంతమైన చిరునవ్వులతో ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియా స్టార్‌గా మారారు.

ఆమె తన స్వీయ ఆత్మకథను రాసుకున్నారు. అలానే ఆమె 89 ఏళ్ల వయసులో రోలింగ్ స్టోన్ మేగజీన్ కవర్ కోసం న్యూడ్ మోడలింగ్ చేశారు.

వృద్ధులపై వివక్ష చూపే సమాజ ధోరణులపై లీషియా పోరాడుతున్నారు. ఆమె స్త్రీవాది. సమ లైంగికుల హక్కుల కోసం కూడా మాట్లాడతారు. తన ఇన్‌స్టాగ్రాం ద్వారా బాడీ పాజిటివిటీని ప్రమోట్ చేస్తున్నారు. వృద్ధుల శరీరాకృతులపై ప్రజలకున్న అవగాహనను మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

మాట్చా ఫోర్న్ఇన్

మాట్చా ఫోర్న్ఇన్, థాయ్‌లాండ్

స్వదేశీ, సమలైంగికులు హక్కుల కార్యకర్త

మియన్మార్ సరిహద్దులలో థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న మాట్చా, ఇప్పటికే పర్యావరణ మార్పులు, యుద్ధాన్ని చవిచూస్తున్న ఈ ప్రాంతంలోని సమలైంగికుల హక్కుల కోసం కృషి చేస్తున్నారు.

వేల మంది భూమి లేని, ఏ దేశానికి చెందని ఆదివాసీ మహిళలు, బాలికలు, యువ సమలైంగికులకు విద్య అందించడం, వారి కాళ్లపై వారు నిలబడేలా చేసే లక్ష్యంతో సంగ్సాన్ అనకోట్ యవచోన్ డవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

మైనారిటీ లెస్బియన్ ఫెమినిస్ట్ అయిన మచా ఫోర్న్ తమ ప్రాంతంలోని లింగ ఆధారిత హింసను అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. భూ హక్కు కోసం పోరాడుతూనే ఆదివాసీ ప్రజలకు భూమి హక్కులు, పర్యావరణం కారణంగా నిరాశ్రయులైన వారికుండే హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు.

అర్థవంతమైన భాగస్వామ్యం లేకుండా, మూల వాసులు, సమ లైంగిక సముదాయం, మహిళలు, బాలికల అభిప్రాయాలు లేకుండా సుస్థిరమైన పర్యావరణ పరిష్కారాలు కనుగొనడం అసాధ్యం.

మాట్చా ఫోర్న్ఇన్

షాయిర్బు సగిన్ బయేవా

షాయిర్బు సగిన్ బయేవా, కిర్గిస్థాన్

లైఫ్ సూయింగ్ షాప్ సహ వ్యవస్థాపకురాలు

నాలుగో స్టేజ్ కాన్సర్‌తో మూడేళ్ల పాటు పోరాడి, ట్రీట్‌మెంట్ కోసం డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడి ప్రస్తుతం సమస్య నుంచి బయటపడ్డారు షాయిర్బు .

తనలాంటి నలుగురు కాన్సర్ సర్వైవర్లతో కలిసి ఫర్ లైఫ్ సూవింగ్ షాప్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా కాన్సర్ పేషెంట్లకు వైద్య సాయం చేస్తున్నారు.

ఇప్పటి వరకు వైద్య ఖర్చుల కోసం 34 మంది మహిళలకు 33 వేల డాలర్ల ఆర్థిక సాయం అందించారు.

ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి ఆసుపత్రులకు వచ్చి చికిత్స తీసుకుంటున్న రోగుల కోసం కూడా ఓ నాన్ ప్రాఫిట్ హాస్టల్ స్థాపించారు. పేద రోగులు అక్కడ ఉచితంగా ఉండేందుకు సాయపడుతున్నారు.

చిలా కుమారి బర్మన్

చిలా కుమారి బర్మన్, బ్రిటన్

చిత్రకారిణి

ప్రింట్ మేకింగ్, డ్రాయింగ్, పెయింటింగ్, ఇన్‌స్టలేషన్, ఫిల్మ్ లాంటి కళల ద్వారా జెండర్ సమస్యలు, సాంస్కృతిక గుర్తింపుకి చెందిన అంశాలు చర్చకు వచ్చేలా చేస్తున్నారు చిలా కుమారి బర్మన్.

ఈ ఏడాది ఆమె గీసిన చిత్రాల్లో ఒకదాన్ని 'ద బ్లాక్‌పూల్ ఇల్యుమినేషన్స్‌'లో ప్రదర్శించారు. ఈ లైట్ ఫెస్టివల్‌ను బ్రిటన్‌లో 1879 నుంచి నిర్వహిస్తున్నారు. లాల్లీస్ ఇన్ లవ్ విత్ లైట్ అనే ప్రదర్శనలో బాగంగా లైట్లతో ఐస్ క్రీమ్ వ్యాన్‌ను డిజైన్ చేశారు. తల్లిదండ్రుల ఐస్ క్రీమ్ వ్యాపారం స్ఫూర్తితో దీన్ని రూపొందించారు.

2020లో పెయింటింగ్స్ ప్రదర్శన నిర్వహించే టేట్ బ్రిటన్ భవన ముఖద్వారంపైన అద్భుత లైటింగ్ ద్వారా బర్మన్ ఆర్ట్ ఇన్‌స్టలేషన్ జరిగింది. ఆమె ఆర్ట్ వర్క్‌లో భారతీయ పురాణాలు, సాంస్కృతిక, మహిళా సాధికారత ప్రతిబింబిస్తాయి.

గత ఏడాది ఆమెకు ఎంబీఈ అవార్డు వచ్చింది.

ఇసి బుబస

ఇసి బుబస, ఘనా

చేపల వ్యాపారి

ఘనాలోని మారుమాల గ్రామం ఫువెమె సముద్రం చొచ్చుకు రావడంతో పూర్తిగా మునిగిపోయింది. ఇసి బుబస వాతావరణ మార్పు ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు.

సముద్ర మట్టం పెరగడంతో ఆమె ఉంటున్న ప్రాంతం నీట మునిగింది. దీంతో ఆ ప్రాంతం వదిలి భర్త, ఐదుగురు పిల్లలతో ఆమె వలస వెళ్లారు.

గ్రామంలో ఆమె ప్రముఖ చేపల వ్యాపారి కావడంతో, బుబస తన సహచరులతో కలిసి మత్స్యకారులకు సాయపడేందుకు ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. తీర ప్రాంతంలో కోత వల్ల వారి ఆదాయ వనరుకు ముప్పు ఏర్పడింది.

ప్రస్తుతం ఇందులో వందమంది సభ్యులు ఉన్నారు. వీళ్లంతా వారానికొకసారి సమావేశమై వ్యాపారంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కుటుంబాలకు అవసరమైన ఆర్థిక సాయం అందించడం గురించి చర్చిస్తారు.

అలలు వచ్చినప్పుడు తల వంచితే మృత్యువు మనల్నే కాకుండా మన తర్వాతి తరాల్ని కూడా తీసుకెళుతుంది.

ఇసి బుబస

మారిజెటా మొజాసెవిక్

మారిజెటా మొజాసెవిక్, మాంటెనీగ్రో

వికలాంగుల హక్కుల కార్యకర్త

హైస్కూలులో చదువుకుంటున్నప్పుడు రెండుసార్లు స్ట్రోక్ రావడం మారిజెటా జీవితాన్ని నాటకీయంగా మలుపు తిప్పింది.

దానివల్ల ఆమె శారీరక, మానసికంగా ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమస్యలు ఆమెను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. మొజాసెవిక్ ప్రస్తుతం యువత సలహాదారుగా, వికలాంగుల హక్కుల కార్యకర్తగా పని చేస్తున్నారు.

నరాల బలహీనతతో బాధపడుతున్న వారిపట్ల సమాజ ప్రతికూల ప్రవర్తన, వివక్ష ధోరణులకు వ్యతిరేకంగా మొజాసెవిక్ పోరాడుతున్నారు.

ఆమె లైఫ్ అండ్ డిజేబిలిటీ పేరుతో కొన్ని వర్క్‌షాపులను డిజైన్ చేశారు. వీటిలో ఆమె స్వీయ అనుభవాలనే పాఠాలుగా పంచుకుంటూ సమాజంలోని పక్షపాత ధోరణులను సవాలు చేస్తున్నారు.

వన్ న్యూరాలజీ కార్యక్రమానికి అంబాసిడర్‌గా ఉన్నారు. నరాల రుగ్మతలను అంతర్జాతీయ ప్రజారోగ్య ప్రాధాన్యాల్లో ఒకటిగా చూడాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.

క్లారా ఎలిజబెత్ ఫ్రగొసొ యుగర్తే

క్లారా ఎలిజబెత్ ఫ్రగొసొ యుగర్తే, మెక్సికో

ట్రక్ డ్రైవర్

ట్రక్ డ్రైవర్ క్లారా ఎలిజబెత్ ఫ్రగొసొ యుగర్తే పురుషాధిక్యతతో ముడివేసుకుపోయిన రవాణా రంగంలో 17 ఏళ్లుగా పని చేస్తున్నారు. మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన రహదారుల దూరాన్ని తన ట్రక్కుతో అధిగమిస్తున్నారు.

మెక్సికోలోని దురంగొ ప్రాంతానికి చెందిన ఫ్రగొసొ యుగర్తే 17ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన యుగర్తే ప్రస్తుతం ఏడుగురు బిడ్డలకు బామ్మ అయ్యారు.

మెక్సికోలో మహిళా ట్రక్కు డ్రైవర్లను ట్రయలెరా అని పిలుస్తారు. ట్రక్కు డ్రైవర్‌గా ఆమె మెక్సికో నుంచి అమెరికాకు సరకు రవాణా చెయ్యడంలో తన జీవితాన్ని గడుపుతున్నారు.

ఈ రంగంలో స్త్రీ, పురుష సమానత్వం సాధించాలనే లక్ష్యంతో ఇందులో పని చేసేందుకు మహిళలను ఆహ్వనిస్తూ వారిలో స్ఫూర్తి నింపుతున్నారు. హెవీ వెహికల్స్, ట్రక్కులు నడపడంలో ఆసక్తి ఉన్న మహిళలు, యువతులకు శిక్షణ ఇస్తున్నారు.

ఆరతి కుమార్ రావు

ఆరతి కుమార్ రావు, ఇండియా

దక్షిణాసియాలోని అన్ని ప్రాంతాల్లో పని చేశారు. ఫొటోగ్రాఫర్, రచయిత, వాతావరణ మార్పుల వల్ల భూ ఉపరితలంలో వస్తున్న మార్పుల గురించి ఫోటోలు తీస్తూ వీడియోలు రూపొందిస్తున్నారు. నేషనల్ జియోగ్రఫిక్ అన్వేషకురాలు కూడా.

వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు, ప్రకృతి విధ్వంసం, పరిశ్రమల స్థాపన కోసం భూ సేకరణ వల్ల లక్షల మంది నిరాశ్రయులు కావడం, పశు పక్ష్యాదులు అంతరించిపోతున్న తీరుని అందులో ప్రస్తావిస్తున్నారు.

ఆమె పదేళ్లుగా భారత ఉపఖండం అంతా పర్యటించారు. పర్యావరణ విధ్వంసం వల్ల జీవ వైవిధ్యం, మనుషుల జీవనాధారం వేగంగా ధ్వంసమై పోతున్న తీరుని ఆమె కథనాలు కళ్లకు కడుతున్నాయి.

మార్జిన్ ల్యాండ్స్ పేరుతో ఆమె రాసిన పుస్తకంలో భారత దేశంలో అంతరించిపోతున్న ప్రకృతి దృశ్యాలు, అత్యంత ప్రతికూల వాతావరణంలో నివసించే వారి అనుభవాలను నిక్షిప్తం చేశారు.

వాతావరణ సంక్షోభానికి మూలం భూమి, నీరు, గాలితో మనకున్న సంబంధాన్ని కోల్పోవడం, ఇది విచారకరం, మనం ఈ సంబంధాన్ని పునరుద్దరించుకోవడం తక్షణ అవసరం.

ఆరతి కుమార్ రావు

సాగరిక శ్రీరామ్

సాగరిక శ్రీరామ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

విద్యావేత్త, పర్యావరణ సలహాదారు

పాఠశాలల్లో పర్యావరణ విద్యను తప్పనిసరి చేయాలని సాగరిక శ్రీరామ్ పోరాటం చేస్తున్నారు.

తన కోడింగ్ నైఫుణ్యాన్ని ఉపయోగించి 'కిడ్స్ ఫర్ బెటర్ వరల్డ్' అనే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ తయారు చేశారు. తమ ప్రాంతాల్లో పర్యావరణ హిత ప్రాజెక్టుల స్థాపన కోసం పిల్లల్లో చైతన్యం నింపే విద్యను అందించడమే ఈ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ లక్ష్యం.

ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ పర్యావరణ హిత వర్క్ షాపుల నిర్వహణకు మద్దతిస్తున్నారు. వీటిల్లో విద్యార్థులకు వాతావరణ మార్పుల్లో పాజిటివ్ కోణాన్ని బోధిస్తున్నారు.

దుబాయ్‌లో తన ఏ లెవల్స్ కోర్సును అభ్యసిస్తూనే యూఎన్ కమిటీ ఆన్‌ ది రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అనే కార్యక్రమంలో పిల్లల సలహా సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు.

పర్యావరణ సంక్షోభం గురించి ప్రమాద ఘంటికలు మోగించడమే కాదు మనం త్వరితగతిన సరైన చర్యలు కూడా ప్రారంభించాలి. ప్రతి చిన్నారికి వాతావరణ పరిస్థితుల గురించి బోధించడం ద్వారా ప్రపంచ పర్యావరణంలో మనం గొప్ప మార్పు తీసుకురాగలం.

సాగరిక శ్రీరామ్

లూయీ మాబులో

లూయీ మాబులో, ఫిలిప్పీన్స్

రైతు, ఔత్సాహిక వ్యాపారవేత్త

2016లో నోక్ టెన్ తుపాను ఫిలిప్పీన్స్‌లోని కామరైన్స్ సుర్ ప్రాంతంలో 80 శాతం వ్యవసాయ భూమిని నిస్సారంగా మార్చేసింది.

కకావో ప్రాజెక్టుని స్థాపించడం ద్వారా లూయీ మాబులో తుపాను సృష్టించిన విధ్వంసాన్ని అధిగమించారు. వ్యవసాయ ఆధారిత అడవులను అభివృద్ధి చెయ్యడం ద్వారా ఈ సంస్థ స్థానిక ఆహార విధానాన్ని విప్లవాత్మక రీతిలో మార్చేసింది.

విధ్వంసకర ఆహార విధానాలను నిర్మూలించి, గ్రామీణ ఆధారిత పర్యావరణ హితమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించి రైతుల్లో సాధికారత పెంచారు. రైతులు సాగు చేసే భూమిపై నియంత్రణ వారి చేతుల్లోకి తెచ్చారు.

అంతర్జాతీయ పర్యావరణ విధాన రూపకల్పనలో సలహాలు ఇస్తున్నారు. ఇందు కోసం తమ ప్రాంతంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఆమెను యంగ్ ఛాంపియన్ ఆఫ్‌ ద ఎర్త్‌గా గుర్తించింది.

నాలాంటి వాళ్లు ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన ఉద్యమాల నుంచి నేను ఆశను కనుక్కున్నాను. మనకు ఆహారాన్ని అందించే పచ్చిక బయళ్లు, వాటితో అల్లుకున్న ఆర్థిక వ్యవస్థలు, సమూహాలు, సమాన సామాజిక సూత్రాలతోనే మన భవిష్యత్ ముడిపడి ఉంది.

లూయీ మాబులో

దరియా సెరెంకో

దరియా సెరెంకో, రష్యా

రచయిత

రచయిత, రాజకీయ కార్యకర్తగా దరియా సుపరిచితులు. యుక్రెయిన్ మీద రష్యా ఆక్రమణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఫెమినిస్ట్ యాంటీ వార్ రెసిస్టెన్స్ ఉద్యమంలో పాల్గొంటున్న అనేక మంది సమన్వయకర్తల్లో ఆమె కూడా ఒకరు.

గత తొమ్మిదేళ్లుగా రష్యాలో లింగ వివక్ష , హింస గురించి ఆమె అనేక పుస్తకాలు రాశారు. మహిళల హక్కులు, యుద్ధానికి వ్యతిరేకంగా రెండు పుస్తకాలు రాశారు.

ప్రజా సమస్యల్ని ప్రధానంగా ప్రస్తావించే సందేశాలను రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకున్న ప్రజల బొమ్మలను రంగుల చిత్రాలతో ప్రదర్శించే క్వైట్ పిక్కెట్ ఆర్ట్‌ను ఆమె సృష్టించారు..

రష్యా యుక్రెయిన్‌ మీద దాడి చేయడానికి రెండు వారాల ముందు అధికారులు సెరెంకోను అతివాద సందేశాలు ప్రచారం చేస్తన్నారని ఆరోపిస్తూ నిర్భంధంలోకి తీసుకున్నారు. తర్వాత జార్జియాకు వెళ్లిపోయిన దరియాను 'ఫారిన్ ఏజెంట్‌' అని ప్రకటించాయి రష్యన్ దళాలు.

వినోదం & క్రీడలు

డెసక్ మాడే రీటా కుసుమా డెవి

డెసక్ మాడే రీటా కుసుమా డెవి , ఇండోనేషియా

స్పీడ్ క్లైంబర్

బాలిలో ఉండే కుసుమా ప్రాథమిక విద్య సమయంలో మొదటి సారి రాక్ క్లైంబింగ్ చేశారు. అప్పటి నుంచే క్లైంబింగ్ మీద ప్రేమలో పడిపోయారామె.

చిన్నతనం నుంచే అనేక పోటీలలో పాల్గొని ఎన్నో విజయాలు సాధించిన కుసుమా డెవికి క్వీన్ ఆఫ్ ఇండోనేషియన్ రాక్ క్లైంబింగ్ అనే పేరొచ్చింది. 2023 IFSC క్లైంబింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కేవలం 6.49 సెకన్లలో గమ్యాన్ని అధిరోహించి బంగారు పతకాన్ని గెల్చుకున్నారు.

అలా 2024 ఒలింపిక్స్‌లో తన బెర్త్ ఖాయం చేసుకున్నారు. రాక్ క్లైంబింగ్ ఈ సారి ఒలింపిక్స్‌లో ప్రత్యేకంగా నిర్వహించబోతున్నారు.

ఇంతవరకూ ఇండొనేషియాకు బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీలలోనే ఒలింపిక్ పతకాలు వచ్చాయి. ఈ క్లైంబర్ కనుక పతకం సాధిస్తే చరిత్ర సృష్టించినట్లే.

జండీలే ఎన్లోవు

జండీలే ఎన్లోవు, సౌతాఫ్రికా

ఫ్రీ డైవింగ్ ఇన్‌స్ట్రక్చర్

దక్షిణాఫ్రికాలో తొలి నల్లజాతి ఫ్రీ డైవింగ్ శిక్షకురాలు. ఆమెను స్థానికులు మత్స్యకన్య అని పిలుస్తారు. యువత, స్థానికులు సముద్రంలోపలకు వెళ్లి అన్వేషించేందుకు శిక్షణ ఇస్తున్నారు.

సముద్రం అడుగునున్న ప్రాంతాల గురించి తెలుసుకునే ఈ క్రీడలో కొత్తవారికి సాయం చేస్తారు. ఎన్లోవు సముద్ర అన్వేషకురాలు, కథా రచయిత, వీడియోలు నిర్మిస్తారు.

సముద్రాలను రక్షించేందుకు కొత్త తరానికి అవగాహన కల్పించేందుకు ఆమె తన నైపుణ్యాలను ఉపయోగిస్తున్నారు. సముద్ర జలాల్లో కాలుష్యం, వాతావరణ ఉష్ణోగ్రతల వల్ల సముద్ర మట్టం పెరుగుతున్న తీరు, పర్యావరణాన్ని రక్షించుకోవడం గురించి ఆమె ప్రచారం చేస్తున్నారు.

యువ గళాలు పర్యావరణం గురించి మాట్లాడటం వింటుంటే కచ్చితంగా మనం పర్యావరణ సంక్షోభాన్ని అరికట్టగలం అనే ఆశ కలుగుతుంది.

జండీలే ఎన్లోవు

అలైస్ ఓస్మన్

అలైస్ ఓస్మన్, బ్రిటన్

స్క్రీన్ రైటర్

స్క్రీన్ రైటర్, ఇల్లస్ట్రేటర్, అవార్డు గెలుచుకున్న రచయిత అలైస్ ఓస్మన్. బెస్ట్ సెల్లింగ్ గ్రాఫిక్ నవల హార్ట్ స్టాపర్ సృష్టికర్త ఆమె. సమ లైంగికుల సముదాయంపై ఆమె రచించిన టీవీ ధారావాహికను ఎమ్మీ అవార్డు వరించింది. దానిని నెట్‌ఫ్లిక్స్ కూడా అందిపుచ్చుకుంది.

అందులోని ప్రతీ ఎపిసోడ్‌ను ఆమె రాశారు. నటులను ఎంపిక చేయడం దగ్గర నుంచి సంగీత నిర్మాణం వరకూ ఓస్మన్ కీలకంగా వ్యవహరించారు.

యువత కోసం ఆమె ఇతర అనేక నవలలను రచించారు. వాటిలో రేడియో సైలెన్స్, లవ్‌లెస్, సొలిటేర్ వంటివి ఉన్నాయి. అవన్నీకూడా ఆమె పందొమ్మిదేళ్ల వయసులోనే పబ్లిష్ అయ్యాయి.

ఆమె రచనలు అనేక అవార్డులకు నామినేట్ అయ్యాయి. వాటిలో యంగ్ అడల్ట్స్ బుక్ ప్రైజ్, ఇంకీ అవార్డ్స్, కార్నెగీ మెడల్, ద గుడ్ రీడ్స్ ఛాయిస్ అవార్డ్స్ వంటివి ఉన్నాయి.

హర్మన్‌ప్రీత్ కౌర్

హర్మన్‌ప్రీత్ కౌర్, ఇండియా

క్రికెటర్

ఈ ఏడాది విజ్డెన్స్ ఫైవ్ క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్‌లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్రకెక్కారు హర్మన్ ప్రీత్ కౌర్.

భారత మహిళా క్రికెట్ జట్టుకి కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్, దేశీయ అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల కెరటంగా మారారు. నిరుటి కామన్వెల్త్ క్రీడల్లో భారత జట్టు సిల్వర్ మెడల్ సాధించడంలో కీలకంగా మారారు.

మహిళల ప్రీమియల్ లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిధ్యం వహించిన హర్మన్, జట్టును ముందుండి గెలిపించారు.

2017లో జరిగిన మహిళా క్రికెట్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 115 బంతుల్లో 171 పరుగులు చేయడం ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఆమె అద్భుత ఆటతీరుతో భారత్ ఫైనల్స్‌కు చేరుకుంది.

ఆన్ గ్రాల్

ఆన్ గ్రాల్, ఫ్రాన్స్

కమెడియన్

గ్రీన్ వాషింగ్ కామెడీ క్లబ్ వాతావరణ మార్పులతో పాటు ఫెమినిజం, పేదరికం, వైకల్యం, సమాన లైంగిక హక్కులు లాంటి అనేక అంశాలపై పోరాటం చేస్తోంది.

స్టాండప్ కమెడియన్ ఆన్ గ్రాల్ ఈ సంస్థను స్థాపించారు. ప్రభావవంతమైన మాటలతో, పంచ్ లైన్లతో ప్రజల మెదళ్ళలో మార్పు బీజాలు నాటవచ్చని, వారి అలవాట్లను కూడా ప్రభావితం చేయవచ్చని గ్రాల్ విశ్వసిస్తారు.

మారుతున్న వాతావరణం, పర్యావరణ సంక్షోభంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి చిన్న చిన్న సందేశాలు ఇచ్చే కాన్సెప్ట్‌లు, సరదాగా చేసే సంభాషణలు ఓ మంచి మాధ్యమమని ఆమె చెబుతారు.

గ్రీన్ వాషింగ్ కామెడీ క్లబ్ సక్సెస్ మనలో ఓ చిరు ఆశ కలిగిస్తుంది. పర్యావరణ మార్పుల పట్ల చాలా మంది ఆందోళన చెందుతున్నారనేది అర్థమవుతోంది. వాళ్లంతా ఈ కార్యక్రమం ద్వారా ఒక్కచోట చేరి కాసేపు నవ్వుకుని తమ పొరాటాన్ని కొనసాగిస్తుంటారు.

ఆన్ గ్రాల్

అంద్రేజా డెల్గాడో

అంద్రేజా డెల్గాడో, బ్రెజిల్

క్యూరేటర్, కల్చరల్ మేనేజర్

సావ్ పాలో నగర శివార్లలో నివసించే పేద ప్రజలకు కామిక్ బుక్ కన్వెన్షన్‌కి హజరయ్యే అనుభవం ఎలా ఉంటుందో తెలియాలనే ఉద్దేశంతో పెరిఫాకాన్‌ అనే కామిక్ బుక్ ఈవెంట్‌ నిర్వహణలో సాయపడ్డారు అంద్రేజా.

వినోదాన్ని పంచేవారే అయినా అంతగా గుర్తింపు లేని హాస్య నవలా రచయితను , కళాకారులను ఈ వేదిక ఒక్కతాటిపైకి తీసుకొస్తుంది.

ఈ ఏడాది జరిగిన మూడో పెరిఫాకాన్ కార్యక్రమంలో కామిక్ బుక్స్, వీడియోగేమ్స్, కన్సర్ట్స్, జీక్ కల్చర్ ఇలా ఎన్నో అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి 15 వేల మందికి పైగా హాజరయ్యారు.

యూట్యూబర్‌, పాడ్ కాస్టర్‌గా అనేక వేదికలపై తన గొంతు వినిపించే అంద్రేజా బ్రెజిల్ లో సాంస్కృతిక స్వేచ్చ, నల్లజాతి కళాకారుల హక్కుల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తారు.

పరమిడా

పరమిడా, జర్మనీ

డీజే, సంగీత దర్శకురాలు

హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో ఆందోళనలు చెలరేగడానికి చాలా రోజుల ముందు నుంచే డీజే పరమిడా ఇరానియన్ మహిళల మీద మతపరమైన ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ప్రస్తుతం బెర్లిన్‌లో ఉంటున్న పరమిడా యుక్త వయసులోనే సంగీతం, నృత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. ఐకానిక్ డాన్స్, మ్యూజిక్ చరిత్రతో స్ఫూర్తితో ఆమె 'లవ్ ఆన్‌ ద రాక్స్' గీతాన్ని రూపొందించారు.

డాన్స్, మ్యూజిక్ ఘన చరిత్రతో స్ఫూర్తిపొందారు. ఆమె రూపొందించిన లవ్ ఆన్ ద రాక్స్ ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లో డీజే పెట్టుకుని డాన్స్ చేసేందుకు ప్రేరేపిస్తోంది.

బెర్లిన్‌లోని బెర్గ్‌హెయిన్ పనోరమా బార్ ప్రాంతంలో ఉంటున్న ఆమె డీజేగా, సంగీత దర్శకురాలిగా ప్రపంచ గుర్తింపు పొందారు. తన గుర్తింపుతో మ్యూజిక్, నైట్‌లైఫ్ లాంటి అంశాల్లో పురుషాధిక్యతను సవాలు చేస్తున్నారు.

కామిలా పిరేలీ

కామిలా పిరేలీ, పరాగ్వే

ఒలింపిక్ అథ్లెట్

హెప్టథ్లాన్‌లో ఆమెకు గుర్తింపు ఉన్నా, టోక్యో ఒలింపిక్స్ 100 మీటర్ల హర్డిల్స్‌ విభాగంలో పోటీ పడ్డారు కామిలా పిరేలీ.

ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారిణిగా ఆమె అనేక జాతీయ రికార్డులు స్థాపించారు. ఆమెను ముద్దుగా గౌరానీ ప్యాంథర్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఆమె స్పోర్ట్స్ కోచ్‌గా, ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్నారు.

పరాగ్వేలోని ఓ చిన్న పట్టణంలో పర్యావరణ మార్పులను చాలా దగ్గరగా చూసిన ప్రాంతంలో పుట్టి పెరిగిన పిరేలీ తన కుటుంబం కూడా పర్యావరణ పరిరక్షణ పట్ల చాలా ఆసక్తి చూపుతారని చెబుతారు.

పిరేలీ ఎకో అథ్లెట్ చాంపియన్. పర్యావరణ సంక్షోభం గురించి ప్రస్తావిస్తూ కర్బన ఉద్గారాలను తగ్గించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టమని కోరేందుకు క్రీడా వేదికలను వినియోగించుకుంటున్నారు.

చుట్టూ రకరకాల వన్యప్రాణులు కనిపించే ప్రాంతంలో పెరిగాను. పర్యావరణ మార్పుల వలన ఆ ప్రాణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం చూసినప్పుడు కచ్చితంగా దీన్ని మార్చాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.

కామిలా పిరేలీ

అమెరికా ఫెరారా

అమెరికా ఫెరారా, అమెరికా

నటి

వినోద రంగంలో టక్కున గుర్తుపట్టే ముఖం ఆమెది. అవార్డ్ విన్నింగ్ నటి, దర్శకురాలు, ప్రొడ్యూసర్. తాజా రికార్డ్ బ్రేకింగ్ మూవీ బార్బీ, రియల్ విమెన్ హేవ్ కర్వ్‌స్, అగ్లీ బెట్టీ లాంటి ఎన్నో హిట్ సిరీస్‌లలో ఆమె నటించారు.

అగ్లీ బెట్టీలో తన పాత్రకు గాను ఎమ్మీ అవార్డ్స్‌ అందుకున్నారు. చిన్న వయసులోనే కథానాయిక పాత్రలో ఆ అవార్డ్ అందుకున్న మొట్ట మొదటి లాటిన్ యువతి ఆమె. మహిళల హక్కుల కార్యకర్తగా చాలా కాలంగా తన గొంతు వినిపిస్తున్న ఫెరారా వెండి తెరపై మరింత మంది మహిళల ప్రాతినిధ్యం అవసరమని అంటారు.

హొండూరస్ వలస జంటకు జన్మించిన ఫెరారా లాటిన్ అమెరికన్ల సంస్కృతిని ప్రతిబింబించే నాన్ ఫ్రాఫిట్ ఆర్గనైజేషన్ పొడెరిస్టాస్‌ను స్థాపించి దాని ద్వారా లాటినాల జీవితాలను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

ఐతానా బొన్మాతి

ఐతానా బొన్మాతి, స్పెయిన్

ఫుట్‌బాలర్

కేటలోనియాలో పుట్టి పెరిగిన ఐతానా బొన్మాతి తన క్లబ్ బార్సిలోనా బృందంతో కలిసి ఈ ఏడాది స్పానిష్ లీగ్ , ఛాంపియన్స్ లీగ్‌లలో విజయం సాధించారు.

వరల్డ్ కప్ సమయంలో గ్లోబల్ సూపర్ స్టార్ గా ఎదిగారు. మూడు గోల్స్ కొట్టి స్పెయిన్ విజయంలో కీలక విజయం పాటించారు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచారు. 25 ఏళ్లకే ప్రఖ్యాత బల్లాన్‌డర్ అవార్డు గెలుచుకున్నారు. యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్'గా గుర్తింపు పొందారు.

మైదానం లోపల, వెలుపల కూడా తన గొంతు వినపించడానికి ఏ మాత్రం భయపడని ఐతానా ఫుట్‌బాల్‌లో లింగ సమానత్వం పై మాట్లాడారు.

స్పెయిన్ ఫుట్ బాల్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లూయిస్ రుబియాలిస్ క్రీడాకారిణి జెన్నీ హెర్మాసో పెదవులపై ముద్దు పెట్టడంతో ప్రపంచం ఒక్కసారిగా స్పెయిన్ వైపు చూసింది. హెర్మాసోకు మద్దతిస్తూ, అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరింత మంది మహిళల కోసం బొన్మాతి మరోసారి గళమెత్తారు.

దియా మీర్జా

దియా మీర్జా, భారత్

నటి

నటిగా సినిమాల్లో పోషించిన పాత్రలకు అవార్డులు గెలుచుకోవడమే కాదు, దియా మీర్జా అనేక పర్యావరణ, మానవీయ ప్రాజెక్టుల్లో పాలు పంచుకుంటున్నారు.

వాతావరణ మార్పులు, శుభ్రమైన గాలి, వన్య ప్రాణుల సంరక్షణ లాంటి అంశాల్లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమానికి ఆమె గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్నారు.

వన్ ఇండియా స్టోరీస్‌ను స్థాపించి ప్రజలపై ప్రభావం చూపేలా కథలను చెబుతున్నారు. దీని గురించి ఆమె మాటల్లో చెప్పాలంటే ' మిమ్మల్ని ఆపి ఆలోచింపజేసేది' అని.

సేవ్‌ ద చిల్డ్రన్, ద ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్‌ఫేర్ సంస్థలకు ఆమె అంబాసిడర్‌గా ఉన్నారు. శాంక్చురీ నేచర్ ఫౌండేషన్‌లో బోర్డు మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు.

జస్టినా మైల్స్

జస్టినా మైల్స్, అమెరికా

చెవిటి క్రీడాకారిణి

ప్రపంచంలో అత్యధికులు చూసే స్పోర్టింగ్ ఈవెంట్లలో ఒకటి సూపర్ బోల్ LVII. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ పోటీల్లో తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించి చరిత్ర సృష్టించారు జస్టినా మైల్స్.

పాప్ స్టార్ రిహన్నా థండర్ పాటను ఉత్సాహభరితంగా పాడి అందరి చూపును తనవైపు తిప్పుకుని సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు జస్టినా.

సూపర్ బోల్ హఫ్ టైమ్‌‌లో అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌తో ప్రదర్శన చేసిన మొట్ట మొదటి మహిళగా నిలిచారు జస్టినా. అంతకు ముందు బ్లాక్ నేషనల్ ఆంథమ్‌గా పిలిచే లిఫ్ట్ ఎవ్రీ వాయిస్ అండ్ సింగ్ పాడిన మొదటి డెఫ్ విమన్‌గా నిలిచారు.

వినికిడి లోపం ఉన్నవారు ఎంతో అద్భుతంగా నైపుణ్యాలను ప్రదర్శించగలరని నిరూపించాలనుకుంటున్నారు జస్టినా. తనలాంటి మరింత మందికి శిక్షణనివ్వడమే తన లక్ష్యమని చెప్పారు.

డేఇయాన్ లీ

డేఇయాన్ లీ, దక్షిణ కొరియా

కే పాప్4 ప్లానెట్ వ్యవస్థాపకురాలు

పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కె పాప్ అభిమానుల్ని కె పాప్4ప్లానెట్ ద్వారా సిద్ధం చేస్తున్నారు డేఇయాన్ లీ

2021లో దీన్ని ప్రారంభించిన తర్వాత, సౌత్ కొరియాలో ప్రజలు పర్యావరణం, పునరుత్పాధక ఇంధన వనరుల వైపు మళ్లడం గురించి ప్రచారం చేయాలని వినోదరంగంలో పెద్ద స్టార్లు, ప్రసార సంస్థలను కోరింది.

పాప్ గీతాల ఫిజికల్ కాపీల వేస్ట్ వల్ల పర్యావరణ పరమైన సమస్యలు తలెత్తుతున్న విషయాన్ని ఈ బృందం హైలైట్ చేసింది. దీంతో కొరియన్ పాప్‌లో ప్రముఖ పాప్ స్టార్లంతా డిజిటల్ ఆల్బమ్స్ వైపు మళ్లారు.

డేఇయాన్ లీ ప్రస్తుతం సంగీతాన్ని దాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. కొరియన్ పాప్ సెలబ్రిటీలు ఉపయోగించే ఫ్యాషన్ బ్రాండ్ల వల్ల తలెత్తే పర్యావరణ సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు.

సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు మార్పు సాధించేంతవరకు వెనుకగడుగు వేయకూడదు. ఇది మనం ప్రతిసారి నిరూపించాం. పర్యావరణ సంక్షోభంపై పోరాటంలోనూ మనం దీన్ని కొనసాగిస్తాం.

డేఇయాన్ లీ

ఖినే హనిన్ వాయ్

ఖినే హనిన్ వాయ్, మియన్మార్

నటి

మియన్మార్‌లో పాతికేళ్ల క్రితం నటిగా మొదలైన ఖినే హనిన్ వాయ్ ప్రయాణంలో ఆమె నటించిన కొన్నిపాత్రలు బాగా పేరు తెచ్చాయి. వాటిలో ఒకటి ఆమె లీడ్ రోల్ చేసిన సాన్ యే చిత్రం. బర్మా సినీ రంగంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ నటిగా ఎదిగారు హనిన్ వాయ్.

నటనే కాకుండా ఆమె చేసిన సేవా కార్యక్రమాలకూ బాగా పేరొచ్చింది. అనాధలు, వీధి బాలల బాగోగులు చూసేందుకు 2014లో ఖీనే హనిన్ వాయ్ ఫౌండేషన్ స్థాపించారామె.

వివిధ కారణాల వల్ల తల్లిదండ్రులకు భారంగా మారిన వంద మంది పిల్లల సంరక్షణను హానిన్ వాయ్ ఫౌండేన్ ద్వారా చూసుకుంటున్నారు.

పిల్లల అక్రమ రవాణా నిరోధ కార్యక్రమానికి అంబాసిడర్‌గా పని చేస్తున్నారు హానిన్ వాయి.

బియాంకా విలియమ్స్

బియాంకా విలియమ్స్, బ్రిటన్

అథ్లెట్

యూరప్‌కు చెందిన బియాంక కామన్‌వెల్త్ గేమ్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో బంగారుపతకం సాధించారు. 2023 యురోపియన్ టీమ్ ఛాంపియన్‌ షిప్‌లో గ్రేట్ బ్రిటన్ అండ్ నార్తన్ ఐర్లండ్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్నారు.

జూలైలో జరిగిన యూకే అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో 200 మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానంలో నిలవడం ద్వారా, బుడాపెస్ట్‌లో జరగనున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనే బ్రిటిష్ టీమ్ లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

2020 జులైలో ఆమె, మాజీ అథ్లెట్ అయిన ఆమె భర్త రికార్డో డాస్ శాంటాస్‌ను లండన్ పోలీసు అధికారులు సోదాలు చేశారు.

పోలీసుల వివక్ష పూరిత తీరుపై వారు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇద్దరు పోలీసుల విద్వేష పూరిత ప్రవర్తనకు గాను వారిని సస్పెండ్ చేశారు.

అంటినిస్కా సెన్సి

అంటినిస్కా సెన్సి, ఇటలీ

నడిచే గుర్రం వీపు మీద జిమ్నాస్టిక్స్ చేసే సాహసికురాలు

అంటినిస్కా సెన్సి తన 30వ ఏట గుర్రాల వీపు మీద జిమ్నాస్టిక్స్ చెయ్యడం మొదలు పెట్టిన్పపుడు, పదేళ్ల తర్వాత అదే పని చేస్తూ తానొక టీమ్‌తో ప్రపంచం అంతా పర్యటిస్తానని ఆమె ఊహించలేదు.

ఉత్తర ఇటలీలోని లా ఫెనిసెలో పుట్టిన ఆమె అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. పుట్టే సమయంలో ఏర్పడిన సమస్యలు వల్ల తొలిసారి జలుబు వచ్చినప్పుడు ఆమె బతుకుతుందని అనుకోలేదని ఆమె తల్లి చెప్పారు.

ఇటలీ నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫ్యామిలీస్ అండ్ పీపుల్ విత్ డిసెబులిటీస్ – ANFAS అనే స్థానిక సంస్థ ప్రారంభించిన కార్యక్రమంలో బాగంగా వాల్టింగ్ నేర్చుకున్న లా ఫెనిస్ వాల్టింగ్ టీమ్‌లో చేరారు.

ప్రస్తుతం ఆమె ప్రపంచ వాల్టింగ్ ఛాంపియన్ అన్నా కవలరో, ట్రైనర్ నెల్సన్ నిడోనితో కలిసి శిక్షణ ఇస్తున్నారు.

అజీజా స్బెయిటీ

అజీజా స్బెయిటీ, లెబనాన్

స్ప్రింటర్

వంద మీటర్ల పరుగు పందెంలో 'లెబనాన్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన మహిళ'గా గుర్తింపు పొందిన తర్వాత అజీజా స్బెయిటీ ఈ ఏడాది జరిగిన పశ్చిమాసియా అరబ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. దాంతో లెబనాన్‌లో మొట్టమొదటి నల్లజాతి మహిళా అథ్లెట్‌గా పతాక శీర్షికల్లో నిలిచారు.

ఆమె తల్లిది లైబీరియా. తండ్రిది లెబనాన్. అజీజా తన పదకొండేళ్ల వయసులో లెబనాన్‌కు వచ్చారు. అక్కడ ఆమె జాత్యాహంకార ఘటనలను, ఆమె రంగు కారణంగా వర్ణ వివక్షను ఎదుర్కొన్నారు.

తనను తాను ములుచుకోవడానికి అథ్లెటిక్స్ ఆమెకు ఒక అవకాశంగా మారాయి. క్రీడల ద్వారా సమాజంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలపైన పోరాడుతున్నారు.

దేశంలో వ్యవస్థీకృతమైన జాతి వివక్ష గురించి మాట్లాడేందుకు తాను సాధించిన విజయాలను ఉపయోగిస్తున్నారు. సమానత్వం కోసం పోరాడుతున్నారు. లెబనాన్ యువతలో స్ఫూర్తి నింపేందుకు స్కూళ్లు, విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేస్తున్నారు.

జార్జియా హ్యారిసన్

జార్జియా హ్యారిసన్, బ్రిటన్

టీవీ పర్సనాలిటీ

లైంగిక వేధింపులకు గురైన తర్వాత మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై పోరాటంలో తన కథనే వినియోగించుకోవాలనుకున్నారు జార్జియా హ్యారిసన్. మహిళలపై హింస గురించి బ్రిటన్ సమాజపు ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకురావాలనుకున్నారు.

లవ్ ఐలండ్, ద ఓన్లీ వే ఈజ్ ఎస్సెక్స్ లాంటి కార్యక్రమాలపై పాపులర్ అయిన ఈ టీవీ వ్యాఖ్యాత, రివెంజ్ పోర్న్‌తో మహిళలను వేధిస్తున్న వారిని తేలిగ్గా ప్రాసిక్యూట్ చేసేలా యూకే ఆన్‌లైన్ భద్రతా బిల్లులో సవరణల కోసం పోరాటం చేస్తున్నారు.

అనుమతి లేకుండా తమ ఫోటోలను ఆన్‌లైన్లో ఉంచిన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై కూడా చర్యలు తీసుకునేలా చట్టాలు చేయాలని ఆమె పిలుపునిస్తున్నారు.

రాజకీయం & ఉద్యమం

షంశా అరవీలో

షంశా అరవీలో, సోమాలియా/ బ్రిటన్

FGM ప్రచారకర్త

షంశా అరవీలో తన పోరాట పటిమతో ఆన్ లైన్ వీడియోలలో ప్రచారంతో మహిళల జననేంద్రియాలను తొలగించే మూఢత్వానికి అడ్డుకట్ట వేయగలిగారు.

సొమాలియాలో పుట్టిన అరవీలో ప్రస్తుతం బ్రిటన్‌లో జీవిస్తున్నారు. ఎటువంటి వైద్యపరమైన సమస్యలు లేకున్నప్పటికీ ఆరేళ్ల వయసులోనే ఆమె జననేంద్రియాలను తొలగించారు.

టిక్‌టాక్‌లో 70 మిలియన్ల మంది ఆమె వీడియోలను వీక్షించారు.

ఆమె ప్రస్తుతం విదేశాలలో హింసను ఎదుర్కొంటున్న ఎంతోమంది బ్రిటిష్ పౌరులకు సహాయం చేస్తున్నారు. లండన్‌లోని మెట్రోపాలిటన్ పోలీసులకు జననేంద్రియాల తొలగింపు పట్ల అవగాహన కల్పిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇటీవలే ఆమె గార్డెన్ ఆఫ్ పీస్ అనే స్వచ్చంద సంస్థను కూడా ప్రారంభించారు.

మిషెల్ ఒబామా

మిషెల్ ఒబామా, అమెరికా

న్యాయవాది, రచయిత, కార్యకర్త

అమెరికా మాజీ తొలి మహిళ మిషెల్ ఒబామా గాళ్స్ ఆపర్చ్యునిటీ అలయన్స్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా బాలికలకు విద్య అందించేందుకు పని చేస్తున్నవారికి అండగా నిలుస్తుంది. అమ్మాయిలను చదువుకోనిద్దాం అనేది ఈ ఆర్గనైజేషన్ సిద్ధాంతం.

మిషెల్ అమెరికా ప్రథమ మహిళగా ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా బాలికలకు మెరుగైన విద్య అందించడాన్ని ప్రభుత్వ విధానంగా మార్చారు. అమెరికా తొలి మహిళగా మరో మూడు పెద్ద కార్యక్రమాలను ప్రారంభించారు.

అందులో ఒకటి లెట్స్ మూవ్, పిల్లల్ని ఆరోగ్యంగా పెంచేందుకు తల్లిదండ్రులకు అండగా నిలవడం, రిటైర్ అయిన సైనికులు, వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు సైన్యంలో చేరడం, మూడోది మరింత ఎత్తుకు ఎదగడం, ఈ లక్ష్యాల సాధన కోసం ఆమె ఇప్పటికీ పని చేస్తున్నారు. యువత ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహిస్తున్నారు.

రుక్సానా కపాలి

రుక్సానా కపాలి, నేపాల్

హౌసింగ్ క్యాంపెయినర్

నేపాల్‌లోని నెవ మూలవాసీ సముదాయం సభ్యురాలు, ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త రుక్సానా కపాలి తన గుర్తింపు గురించి ఎటువంటి అవగాహన లేకుండానే పెరిగి పెద్దయ్యారు.

ఆమె లింగ, లైంగిక వైవిధ్యం గురించి సొంతంగా నేర్చుకుంటూ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. యుక్త వయసు నుంచే ఆమె క్వీర్ సముదాయం హక్కుల గురించి గళమెత్తారు.

ప్రస్తుతం ఆమె న్యాయశాస్త్రం మూడవ సంవత్సరం చదువుతున్నారు. నేపాల్‌లోని సమ లైంగికుల హక్కుల కోసం చురుగ్గా పనిచేస్తున్నారు.

నెవ తెగలో వెనుకబడిన జుగి కులంలో పుట్టిన కపాలి తన సముదాయపు ప్రజలను వారి సంప్రదాయ గృహాల నుంచి బలవంతంగా ఖాళీ చేయించడానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

అలీసియా కహూయియా

అలీసియా కహూయియా, ఈక్వెడార్

మూలవాసీ హక్కుల కార్యకర్త

ఈక్వెడార్‌లోని అమెజాన్ వర్షారణ్యాన్ని రక్షించే పోరాటంలో అలీసియా కేహియా ఈ ఏడాది గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

ఆగస్టులో జరిగిన చరిత్రాత్మక అభిప్రాయ సేకరణలో ఈక్వెడార్ ప్రజలు యసుని నేషనల్ పార్క్‌లో తలపెట్టిన కొత్త చమురు బావులను నిలిపివేయాలంటూ ఓటు వేశారు. ఎంతోమంది మూలవాసులకు ఆవాసమైన, జీవవైవిధ్యానికి నెలవైన ప్రాంతంలో.. చమురు కంపెనీ తన కార్యకలాపాలను ఇక ఆపేయాలనేది ఆ నిర్ణయం సారాంశం.

యసునీలో పుట్టి పెరిగిన కహూయియా దశాబ్ద కాలంగా ఈ రిఫరెండంపై ప్రచారం చేస్తున్నారు

ప్రస్తుతం ఆమె ఈక్వెడార్ మూలవాసీ ప్రజల కన్ఫెడరేషన్ మహిళా డివిజన్‌కి నాయకురాలిగా ఉన్నారు.

పర్యావరణ మార్పులు మన పరిస్థితులను మరింత కఠినంగా మార్చేస్తున్నాయి. వరదలు, తుఫాన్లతో అంతా చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగినపుడు కరవు పరిస్థితులు తలెత్తి ఆహార కొరత ఏర్పడుతుంది. అది చాలా భాధాకరం. రైతుల శ్రమ వృధాగా పోతుంది.

అలీసియా కహూయియా

నటాషా కాండిచ్

నటాషా కాండిచ్, సెర్బియా

న్యాయవాది, మానవహక్కుల కార్యకర్త

1990ల్లో నాటి యుగోస్లోవేకియాలో అంతర్యుద్ధం మొదలైంది. అంతర్యుద్ధకాలంలో అత్యాచారం, హత్య, బలవంతపు అపహరణలు లాంటి అకృత్యాలను నటాషా కాండిచ్ నమోదు చేశారు.

బెల్‌గ్రేడ్‌లో యుద్ధ నేరాల న్యాయస్థానంలో వివిధ వర్గాలకు చెందిన అంతర్యుద్ధపు బాధితుల తరపున ప్రాతినిధ్యం వహించారు. కొసావోకు వ్యతిరేకంగా సెర్బియా నాయకుడు మిలోసెవిచ్ ప్రభుత్వ విధానాలను పరిశీలించే బృందంలో భాగస్వామిగా ఉన్నారు.

ఆమె స్థాపించిన మానవీయ న్యాయ కేంద్రానికి యుద్ధ నేరాల్లో నిష్పాక్షిక దర్యాప్తు జరుపుతుందనే ప్రశంసలు దక్కాయి.

లక్షా 30వేల మంది చనిపోయారని భావిస్తున్న బాల్కన్ యుద్ధాల్లో వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచేందుకు కృషి చేసిన RECOM రీ కన్సిలియేషన్ నెట్‌వర్క్‌ కు ఆమె సాయం అందించారు.

సోఫియా కొసచేవా

సోఫియా కొసచేవా, రష్యా

ఫైర్ ఫైటర్

ఒపెరా సింగింగ్ బోధకురాలిగా పని చేసే సోఫియా కొసచెవా, 2010లో ఒక అగ్నిమాపక బృందాన్ని కలిసిన తర్వాత సోఫియా కెరీర్ మరో టర్న్ తీసుకుంది.

స్వయంగా ఫైర్ ఫైటర్‌గా మారిన సోఫియా, కొంతమంది వ్యక్తులను ఎంపిక చేసుకుని అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడంలో శిక్షణ ఇచ్చారు. రష్యాలోని కార్చిచ్చులను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నారు. సోఫియా చేపట్టిన కార్యక్రమాల వలన దేశవ్యాప్తంగా 25వలంటీర్ గ్రూపులు ఏర్పడ్డాయి.

రష్యాలో జరిగిన అనేక అగ్నిప్రమాదాల్లో మంటలను అదుపు చేసేందుకు ఆమె సాయం చేశారు. ఆమె గ్రీన్‌పీస్ సంస్థతో కలిసి పని చేశారు. రష్యా ప్రభుత్వం ఆ ఎన్జీవోను అవాంఛనీయ సంస్థగా ప్రకటించే వరకూ ఆమె ఆ సంస్థతోనే ఉన్నారు.

వలంటీర్ ఫైర్ ఫైటర్ల కోసం కొసచేవ వెబ్‌సైట్‌ నిర్మించారు. రష్యాలోని కార్చిచ్చుల సమాచారం, వాటిని అదుపు చేసే విధానాలకు సంబంధించి ఈ వెబ్‌సైట్ డాటాబేస్‌ను అత్యంత ప్రామాణికంగా భావిస్తున్నారు.

పర్యావరణ సంక్షోభం ఎంతగా విస్తరిస్తుందో తెలియదు. ప్రతి పెద్ద విజయం చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్యను ఎదుర్కోవడంలో మనం చాలా చిన్నగా కనిపించవచ్చు. కానీ మనం మొదలు పెడితే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మారడం మొదలవుతుంది.

సోఫియా కొసచేవా

అమల్ క్లూనే

అమల్ క్లూనే, బ్రిటన్/ లెబనాన్

మానవహక్కుల న్యాయవాది

అమల్ క్లూనే రెండు దశాబ్ధాలుగా అన్యాయానికి గురైన బాధితుల తరపున పోరాడుతున్నారు. మానవ హక్కుల రక్షణ కోసం పోరాడుతున్న న్యాయవాదిగా అవార్డు గెలుచుకున్నారు.

అర్మేనియా, యుక్రెయిన్‌లో పౌరులపై జరిగిన నేరాల గురించి దాఖలైన హై ప్రొఫైల్ కేసుల్లో ఆమె వాదించారు. మలావి, కెన్యాలో మహిళలపై లైంగిక హింస కేసుల్లోనూ న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు.

దార్ఫూర్‌లో యుద్ధ నాయకుడు, ఇస్లామిక్ స్టేట్ ఫైటర్ చేతుల్లో బాధితులైన మహిళల తరపున వాదించి విజయం సాధించారు. పాలక వర్గాలు జైల్లో పెట్టిన జర్నలిస్టులు, రాజకీయ ఖైదీల విడుదలకు సాయం చేశారు.

కొలంబియా న్యాయ విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్‌. 40 దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన ఎదుర్కొంటున్న ప్రజలకు న్యాయ సాయం అందించేందుకు ఏర్పడిన 'క్లూనీ ఫౌండేషన్ ఫర్ జస్టిస్' సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలు.

మరియం అల్ ఖవాాజా

మరియం అల్ ఖవాాజా, బహ్రెయిన్/డెన్మార్క్

మానవ హక్కుల ప్రచారకర్త

బహ్రెయిన్, గల్ఫ్ ప్రాంతాలలో రాజకీయ సంస్కరణలు అవసరమని గళమెత్తి పోరాడుతున్న వారిలో ప్రముఖంగా వినిపించే పేరు మరియం అల్ ఖవాజా.

మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారికి వ్యతిరేకంగా ఆమె పోరాటం కొనసాగిస్తున్నారు. తన తండ్రిని విడుదల చేయాలంటూ #FREEALKWAJA ప్రచార కార్యక్రమం ద్వారా తన గళం వినిపనిస్తున్నారు. ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనలలో పాల్గొన్న ఆమె తండ్రి ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తూ జైలులో ఉన్నారు.

ఆమె తండ్రి అల్ ఖవాజా సివికస్ అండ్ ఇంటర్నేషనల్ సర్వీస్ ఫర్ హ్యూమన్ రైట్స్‌ యంగ్ ఫెమినిస్ట్ ఆర్గనైజేషన్ ఫ్రిదా, ఫిజిషియన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్‌ సంస్థలకు సేవలందించారు.

బెల్లా గల్హోస్

బెల్లా గల్హోస్, ఈస్ట్ తిమోర్

రాజకీయ కార్యకర్త

2002లో ఇండోనేషియా నుంచి స్వేచ్చను పొందింది తూర్పు తిమోర్. భయం ఎరుగని ప్రచారకర్తగా పేరున్న బెల్లా గల్హోస్ తన దేశంలో మార్పు లక్ష్యంగా పని చేస్తున్నారు.

ఏళ్ల తరబడి ప్రవాసంలో ఉన్న సమయంలో ప్రపంచమంతా తిరుగుతూ తన ప్రజల స్వేచ్చ కోసం పోరాడారు. స్వేచ్చ పొందిన తర్వాత స్వదేశానికి వచ్చి దేశ పునర్నిర్మాణంలో భాగమయ్యారు. దశాబ్ధాల అంతర్యుద్ధం కారణంగా పేదరికంలో చిక్కుకుపోయిన సగానికి పైగా జనాభాను పేదరికం నుంచి బయటపడేసేందుకు శ్రమిస్తున్నారు.

2015లో ఆమె లుబ్లోరా గ్రీన్ స్కూల్ స్థాపించారు. దాని ద్వారా పిల్లలను సుస్థిరాభివృద్ధికి, మార్పుకు ప్రతినిధులుగా నిలపాలన్నదే ఆమె ప్రయత్నం.

ప్రస్తుతం తూర్పు తిమోర్ అధ్యక్షుడికి సలహాదారుగా పనిచేస్తున్న గల్హోస్ మహిళా సాధికారత కోసం కృషి చేయడమే కాకుండా సమలైంగికులు హక్కుల కోసం కూడా పోరాడుతున్నారు.

రినా గొనోయి

రినా గొనోయి, జపాన్

మాజీ సైన్యాధికారి

2011లో జపాన్‌ను భయంకరమైన భూకంపంతో కూడిన సునామీ కుదిపేసిన తర్వాత 11 ఏళ్ల రినా గొనోయిని శిధిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు మహిళా సైనికాధికారులు. ఈ ఘటన తర్వాత జపాన్ సైన్యంలో పని చేయాలని కలలు కన్నారామె.

అమె అనుకున్నది సాధించారు కానీ తన కలల ఉద్యోగంలో ప్రతి రోజు ఆమె లైంగిక హింసను ఎదుర్కోవడంతో ఆమె ఆశలు చెదిరిపోయాయి.

2022లో సైన్యంలో ఉద్యోగాన్ని వదిలేసిన రినా తన సమస్యపై గొంతెత్తి జపాన్ రోడ్లపై క్యాంపెయిన్ నిర్వహించారు. కానీ లైంగిక హింసను ఎదుర్కొని నిలబడి గొంతెత్తి ప్రశ్నించడం మహిళలకు అంత సులభం కాదు.

ఆమె పోరాటంతో సైన్యంలో అంతర్గత విచారణ జరిగింది. దాంతో సైన్యంలో మరో 100 కేసులు బయటపడ్డాయి. తర్వాత జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆమెకు క్షమాపణలు చెప్పింది.

సోనియా గ్వాజాజారా

సోనియా గ్వాజాజారా, బ్రెజిల్

క్యాబినెట్ మంత్రి

బ్రెజిల్ మూలవాసుల హక్కుల ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు సోనియా గ్వాజాజారా. మూలవాసుల కోసం తొలిసారి ఏర్పాటు చేసిన మంత్రి పదవి చేపట్టిన మొట్ట మొదటి నేత. ఆమె నియామకాన్ని లూలా డ సిల్వా చరిత్రాత్మకమని ప్రశంసించారు.

పర్యావరణ నేరాలకు వ్యతిరేకంగా పోరాడటం తన ప్రాధాన్యతలలో మొదటిదని ఆమె ప్రతిజ్ఞ చేశారు.

అమెజాన్ అడవుల్లోని అరరిబోయాలో నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు జన్మించారు గ్వాజాజారా. పర్యావరణ విధ్వంసం వల్ల జీవ వైవిధ్యం దెబ్బ తింటున్నప్రాంతాల్లో అమెజాన్ ముందు వరసలో ఉంది.

పోస్టు గ్రాడ్యుయేషన్ మధ్యలోనే వదిలేశారు. నర్సుగా, టీచర్‌గా, సామాజిక ప్రచారకర్తగా పని చేశారు. 2022లో సావోపాలో నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి మూలవాసీ మహిళ ఆమె.

పర్యావరణ వివక్షకు వ్యతిరేకంగా న్యాయం కోసం మనం అందరం ఆలోచించాలి. ఎందుకంటే పర్యావరణ రక్షణలో అందరికంటే ముందుండి అత్యుత్తమంగా దాన్ని కాపాడగలిగే వాళ్లే పర్యావరణ విధ్వంసం వల్ల బాధితులు అవుతున్నారు. పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో మూలవాసులమైన మేమే ఎప్పుడూ ముందుంటున్నాం.

సోనియా గ్వాజాజారా

జు జౌజౌ

జు జౌజౌ, చైనా

ఎగ్ ఫ్రీజింగ్ క్యాంపెయినర్

2018లో పెళ్లి కాని మహిళ అయిన తన అండాలను బీజింగ్‌లోని ఓ ఆసుపత్రిలో భద్రపరచాలనుకున్నారు జౌజౌ. కానీ ఈ పద్దతి వివాహితులకే తప్ప అవివాహితులకు కాదని అన్నారు ఆసుపత్రి సిబ్బంది.

చైనాలో అవివాహితులకు కూడా అండాలను భద్రపరిచే హక్కు కల్పించాలంటూ కోర్టు మెట్లెక్కారు జౌజౌ.

అప్పటికే స్వల్ప జనన రేటుతో ఇబ్బంది పడుతున్న దేశంలో ఈ వార్త పతాక శీర్షికలకెక్కింది. 2019 నుంచి ఆమె న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.

తీర్పు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అయితే న్యాయ, వైద్య, నైతిక విభాగాల్లో జు చేస్తున్న పోరాటంపై అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. చైనాలో ప్రస్తుతం ఒంటరి మహిళల పునరుత్పత్తి హక్కులు, శరీర హక్కుల గురించి వాదించే ప్రముఖ న్యాయవాది ఆమె.

ఒలాండ టాంబ

ఒలాండ టాంబ, మలావి

బాల్య వివాహ వ్యతిరేక ప్రచారకర్త

ఒలాండ టాంబ మలావి రాజధాని లిలంగ్వేలో ఆడపిల్లలు చదువుకోవడాన్ని అంతగా ప్రోత్సహించని సామాజిక వర్గంలో పుట్టారు. ఈ వర్గానికి చెందిన ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండక ముందే పెళ్లి చేసేందుకు చదువు మానిపిస్తున్నారు. ఈ విధానాన్ని టాంబ సవాలు చేశారు.

యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చెయ్యడంతో పాటు మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అప్పటికే ఉన్న చట్టాల అమలు కోసం గట్టిగా కృషి చేశారు.

యుక్త వయసు రాకముందే గర్బం ధరించడం వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించేలా పోరాడారు.

ఆఫ్రికా ఖండంలోని బాలికలందరికీ మాధ్యమిక విద్య అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న ఏజీఈ ఆఫ్రికా అనే సంస్థకు ప్రస్తుతం ఆమె మలావీలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

సుమ్మియా టోరా

సుమ్మియా టోరా, అఫ్గానిస్తాన్

శరణార్థుల హక్కుల కార్యకర్త

అఫ్గానిస్తాన్‌ 2021లో తాలిబాన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత ఆ దేశ ప్రజల కోసం, దేశం బయట ఉండే అఫ్గాన్ శరణార్థుల కోసం అవసరమైన వనరులు, సమాచారాన్నిఅందించేందుకు ద దోస్తీ నెట్‌వర్క్ అనే సంస్థను ప్రారంభించారు సుమ్మియా.

ఆమె కూడా అఫ్గాన్ శరణార్థి కావడంతో నిర్వాసిత అఫ్గాన్ పౌరులు ఎదుర్కొనే సవాళ్లను బాగా అర్థం చేసుకున్నారు.

శరణార్థుల పునరావాసం, అంతర్యుద్ధం వల్ల చదువుకు దూరమైన విద్యార్థులకు తిరిగి విద్యనందించేందుకు సుమ్మియా పని చేస్తున్నారు.

మెరుగైన భవిష్యత్తు కోసం విద్య ముఖ్యమని గుర్తించిన టోరా, కఠిన పరిస్థితుల మధ్య జీవిస్తున్న బాలికలు, మహిళలు, శరణార్థులకు చదువు చెప్పేందుకు ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంక్, ద మలాలా ఫండ్, ష్మిడ్ట్ ఫ్యుచర్స్ లాంటి సంస్థలతో కలిసి పనిచేశారు. ఈ సంస్థల సహకారంతో శరణార్థులు, మహిళలు, బాలికలకు విద్య అందుబాటులో ఉండే ప్రయత్నాలు చేశారు.

డెహన్నా డేవిసన్

డెహన్నా డేవిసన్, బ్రిటన్

పార్లమెంట్ సభ్యురాలు

1885లో బిషప్ ఆక్లండ్ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత... ఆ నియోజకవర్గం నుంచి 2019లో గెలిచిన తొలి కన్సర్వేటివ్ ఎంపీగా చరిత్ర సృష్టించారు డెహన్నా డేవిసన్. 2022లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న డెహన్నా సోషల్ మొబిలిటీ, రీజనరేషన్ పై దృష్టి పెట్టారు.

2023 సెప్టెంబర్‌లో మంత్రి పదవికి రాజీనామా చేసిన డెహన్నా తనకున్న క్రానిక్ మైగ్రేన్ సమస్య గురించి బాహాటంగా మాట్లాడటం ప్రారంభించారు .

ఆమెకు 13 ఏళ్ల వయసున్నపుడు ఆమె తండ్రిని తలపై కొట్టి హత్య చేశారు. దీంతో ఆమె రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. తలపై దాడి చేసి కొట్టి చంపే దాడులకు వ్యతిరేకంగా ఆమె అఖిలపక్ష పార్లమెంటరీ గ్రూప్ ఏర్పాటు చేశారు. అలాంటి దాడులు చేసే వారికి కఠిన శిక్షలు పడేలా సంస్కరణలు తేవాలని ప్రచారం చేస్తున్నారు.

మైగ్రేన్‌కు మెరుగైన చికిత్సను అందించడంతో పాటు, బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు నిధులు సేకరించడం, పరిశోధనలు చేయడంపై ఆమె దృష్టి పెట్టారు.

నీమా నమదాము

నీమా నమదాము, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో

వికలాంగుల హక్కుల కార్యకర్త

ద నెట్ వర్క్ హీరో విమెన్ రైజింగ్ లేదా మమ్మా షుజ.. ఏ పేరుతో పిలిచినా ఫర్వాలేదు, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యువతుల జీవన పరిస్థితులను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు నీమా.

నీమా నమదాము వికలాంగుల హక్కుల కోసం ఓ సంస్థను కూడా ప్రారంభించారు. ఈ సంస్థ విద్య, సాంకేతికతకను ఉపయోగించుకుని హక్కుల కోసం మహిళలు నినదించేలా ప్రోత్సహిస్తోంది.

తూర్పు కాంగోలో ఓ మారుమూల గ్రామంలో పుట్టిన నీమా రెండేళ్లకే పోలియో బారిన పడ్డారు. ఆమె తెగలో యూనివర్శిటీ నుంచి పట్టభద్రురాలైనమొదటి వికలాంగ మహిళగా గుర్తింపు పొందారు.

పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన నీమా దేశ కుటుంబ సంక్షేమ శాఖ మంత్రికి సలహాదారుగా పనిచేస్తున్నారు.

క్రిస్టియానా ఫిగరెస్

క్రిస్టియానా ఫిగరెస్, కోస్టారికా

రాయబారి, పర్యావరణ వేత్త

2009లో కోపెన్‌హెగన్‌లో యూఎన్ క్లైమేట్ సదస్సులో చర్చలు నిలిచిపోయినపుడు అక్కడి సమస్యలకు ఓ పరిష్కారం చూపించారు క్రిస్టియానా.

తర్వాత ఆమె యూఎన్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కార్యనిర్వహక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాలుష్య కట్టడి వ్యూహంపై ప్రపంచ దేశాలను ఒప్పించే ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఆరేళ్ల పాటు శ్రమించారు.

ఆమె చేసిన కృషి వల్ల 200 దేశాలు 2015 నాటి పారిస్ ఒప్పందం మీద సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచ దేశాలన్నీ రానున్న రోజుల్లో భూ తాపాన్ని 2 డిగ్రీలు, అంటే పారిశ్రామిక విప్లవం ముందు ఉన్న స్థాయికి తగ్గించేందుకు అంగీకరించాయి.

వ్యాపార వాణిజ్య సంస్థలు ఆచరణాత్మక వాతావరణ పరిష్కారాలను అనుసరించేలా ప్రోత్సహించే గ్లోబల్ ఆప్టిమిజమ్ అనే సంస్థకు ఫిగరెస్ సహ వ్యవస్థాపకురాలు.

కొన్ని సార్లు బాధతో ఏం చేయాలో అర్థంకాక చాలా ఉక్కిరిబిక్కిరవుతుంటాను. కొన్ని సార్లు పట్టలేనంత కోపం వస్తుంది. కానీ ఆ కోపం, బాధ నుంచే పట్టుదల పుడుతుంది. మన భవిష్యత్ తరాల కోసం వాళ్లకి అనుకూలమైన వాతావరణాన్ని అందించడంలో మనం భాగస్వాములమవ్వాలనేది నా లక్ష్యం.

క్రిస్టియానా ఫిగరెస్

యేల్ బ్రాడో బహత్

యేల్ బ్రాడో బహత్, ఇజ్రాయెల్

శాంతి ఉద్యమకారిణి

న్యాయ విద్య అభ్యసించిన యేల్ బ్రాడో-బహాత్ విమెన్ వేజ్ పీస్ (డబ్ల్యూడబ్ల్యూపీ) కో-డైరెక్టర్‌గా ఉన్నారు. ఇజ్రాయెల్‌లో క్షేత్రస్థాయిలో పని చేసే ఈ శాంతి ఉద్యమంలో 50,000 మంది సభ్యులున్నారు.

2014లో ప్రారంభమైన ఈ ఉద్యమం , శాంతి ప్రక్రియలో మహిళల పాత్రను నొక్కి చెబుతూ ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధానికి రాజకీయ పరిష్కారాన్ని కోరుతోంది.

విమెన్ వేజ్ పీస్ సంస్ఖ రెండేళ్ల నుంచి పాలస్తీనా సిస్టర్ మూమెంట్, విమెన్ ఆఫ్ ది సన్ ఉద్యమాలతో కలిసి పని చేస్తోంది.

ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య అవగాహన, సమానత్వాన్ని పెంపొందించేందుకు దశాబ్ధాలుగా జీవితాన్ని అంకితం చేసిన తన గురువు, ప్రముఖ శాంతి కార్యకర్త, WWP సహ వ్యవస్థాపకుడు వివియన్ సిల్వర్‌కు తాను ఎంతగానో రుణపడి ఉన్నానని బ్రాడో బహత్ చెబుతున్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడులలో సిల్వర్ మరణించారు.

యాస్మినా బెన్‌స్లిమానే

యాస్మినా బెన్‌స్లిమానే, మొరాకొ

పాలిటిక్స్ ఫర్ హర్ వ్యవస్థాపకులు

యాస్మినా బెన్‌స్లిమానే స్త్రీ, పురుష సమానత్వం కోసం పని చేస్తున్నారు. అందు కోసం పాలిటిక్స్ ఫర్ హర్ అనే సంస్థను ప్రారంభించారు. యువతులు, బాలికలు రాజకీయాల్లో పాల్గొనేలా, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వారి పాత్ర ఉండేలా ఈ సంస్థ పని చేస్తుంది.

ఈ ఏడాది సెప్టెంబరులో సంభవించిన భూకంపం మొరాకొను అతలాకుతలం చేసింది. దాంతో బెన్‌స్లిమానే స్థాపించిన సంస్థ జెండర్ సెన్సిటివ్ సహాయ చర్యలు చేపట్టాలని కోరింది.

విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో స్త్రీలు, బాలికల సమస్యలు, సవాళ్లను గుర్తించేందుకు ఆమె ఒక మేనిఫెస్టో తయారు చేసి విడుదల చేశారు. వాటిలో పీరియడ్ పావర్టీ, బలవంతపు వివాహాల గురించి ప్రస్తావించారు.

అనేక స్వచ్ఛంద సేవా సంస్థలకు మార్గదర్శి, సలహాదారు, బోర్డు మెంబర్‌గా ఉంటూ, మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఆమె కృషికి యూఎన్ విమెన్ పీస్ బిల్డర్ అవార్డు వరించింది.

తమర్ ముసిరిజే

తమర్ ముసిరిజే, జార్జియా

జర్నలిస్టు

18 ఏళ్లకే జార్జియా ప్రభుత్వ రంగ టెలివిజన్‌కు ముఖచిత్రంగా మారారు 'టమున'గా గుర్తింపు పొందిన తమర్ ముసిరజే. తన తల్లిదండ్రులు తనను చిన్నప్పుడు దత్తత తీసుకున్నారని 31వ ఏట తెలుసుకున్న తర్వాత ఆమె జీవితం అనూహ్యంగా మారిపోయింది.

తన అసలైన తల్లిదండ్రులెవరో తెలుసుకునేందుకు ఆమె అన్నింటినీ వదిలేశారు. ఈ ప్రయాణంలో బాగంగా ఆమె సాగించిన పరిశోధన జార్జియాలో 1950ల నుంచి నడుస్తున్న దత్తత బ్లాక్ మార్కెట్‌ను వెలుగులోకి తెచ్చింది.

ఐ యామ్ సర్చింగ్' పేరుతో ఆమె స్థాపించిన ఫేస్‌బుక్ గ్రూపుతో మెటర్నిటీ ఆసుపత్రుల నుంచి పిల్లలను దొంగిలించి.. దత్తతకు ఇస్తున్న అక్రమాలపై జాతీయ స్థాయిలో చర్చను లేవదీసింది.

ముసిరిజే స్థాపించిన సంస్థ వందల కుటుంబాలను ఏకం చేసింది. ఆమె ఇప్పటికీ తన అసలైన తల్లిదండ్రుల కోసం వెదుకుతున్నారు.

మోనికా మెక్‌విలియమ్స్

మోనికా మెక్‌విలియమ్స్, బ్రిటన్

మాజీ రాజకీయనేత, శాంతి చర్చల దూత

ఉత్తర ఐర్లండ్‌లో రాజకీయ పక్షాల మధ్య గుడ్‌ఫ్రైడే ఒప్పందం జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ చర్చలు సఫలీకృతం కావడంలో కీలక పాత్ర పోషించారు మోనికా విలియమ్స్.

ఆమె నార్తర్న్ ఐర్లండ్ విమెన్ కొయిలేషన్ అనే రాజకీయ పార్టీకి సహ వ్యవస్థాపకురాలు.

నార్తర్న్ ఐర్లండ్ మొదటి లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ప్రాంత హ్యూమన్ రైట్స్ కమిషన్ చీఫ్ కమీషనర్‌గా ఆమె ఉత్తర ఐర్లండ్ హక్కుల బిల్లు రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు..

మెక్ విలియమ్స్ ప్రస్తుతం సాయుధ దళాల రద్దు విభాగానికి కమిషనర్ గా పని చేస్తున్నారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తున్నారు.

సెపిడే రష్ను

సెపిడే రష్ను, ఇరాన్

రచయిత, విద్యార్థి

ఇరాన్‌లో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ గళమెత్తిన మహిళగా సెపిడే రష్నుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో హిాజాబ్ ధరించాలని ఒత్తిడి చేసిన మహిళతో గట్టిగా అరుస్తూ వాదించినందుకు సెపిడేను అరెస్టు చేశారు.

పోలీసుల అదుపులో ఉన్నప్పుడు తన ప్రవర్తన పట్ల క్షమాపణలు కోరుతూ టీవీలో కనిపించినప్పుడు ఆమె మొహంపై గాయాలున్నాయి. ఇది 2022 జులైలో, మోరల్ పోలీసుల చేతిలో మహ్‌సా అమీని మరణించడానికి కొన్ని వారాల ముందు జరిగింది.

హిజాబ్ లేకుండా ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేసినందుకు గతేడాది ఆమెను కోర్టు సమన్ చేసింది. హిజాబ్‌కు వ్యతిరేకంగా తాను చేపట్టిన చర్యల వల్ల యూనివర్సిటీ నుంచి తనను బహిష్కరించారని ఆమె చెప్పారు.

ప్రస్తుతం జైలు బయట ఉన్న ఆమె హిజాబ్ కు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

నజ్లా మొహ్మద్ లామిన్

నజ్లా మొహ్మద్ లామిన్, పశ్చిమ సహారా

మహిళాహక్కులు, పర్యావరణ కార్యకర్త

అల్ మసర్ లైబ్రరీ సెంటర్ వ్యవస్థాపకురాలు నజ్లా మొహ్మద్ లామీ అల్జీరియాలోని శరణార్థి శిబిరాలలో మహిళలు చిన్నారులకు ఆరోగ్యం, పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు.

1975 నుంచి మొరాకో ఆక్రమణలో ఉన్న పశ్చిమ సహారాలోని ఓ స్పానిష్ కాలనీ నుంచి హింస కారణంగా పారిపోయిన ఆమె కుటుంబం వేరే ప్రాంతంలో తల దాచుకుంది.

శిబిరాలలోనే పుట్టి పెరిగిన మొహ్మద్ లాబీ యుక్తవయసులో ఇంగ్లీష్ నేర్చుకున్నారు. విదేశీ ప్రతినిధుల కోసం అనువాదాలు చేసేవారు. తర్వాత కొందరు దాతల సహకారంతో ఆమె విదేశాలలో చదువుకున్నారు.

సుస్థిరాభివృద్ధి, మహిళలకు విద్య అనే అంశాల్లో పట్టభద్రురాలైన తర్వాత ఆమె క్యాంపునకు తిరిగి వచ్చారు. సహరావీ శరణార్థి శిబిరాల్లో ఉంటున్న దాదాపు రెండు లక్షల మందికి పర్యావరణ సంక్షోభ సమయంలో తిండి, నీటి కొరతను ఎలా ఎదుర్కోవాలనేదానిపై అవగాహన కల్పించారు.

ఎడారి ప్రాంతాలలో పర్యావరణ సంక్షోభం ప్రభావాన్ని మనం సమర్థంగా ఎదుర్కోవాలి. ఇప్పటికే ప్రజలు ప్రకృతి విపత్తులతో సర్వం కోల్పోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సంక్షోభానికి ప్రజలే ప్రధాన కారణం.

నజ్లా మొహ్మద్ లామిన్

ఇరినా స్టావ్‌చుక్

ఇరినా స్టావ్‌చుక్, యుక్రెయిన్

వాతావరణ విధాన సలహదారు

ఇరినా పర్యావరణ విధాన రూపకల్పనలో నిపుణురాలు. ఆమె ప్రస్తుతం యురోపియన్ క్లైమేట్ ఫౌండేషన్‌లో యుక్రెయిన్ ప్రోగ్రాం మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యుద్దం తర్వాత తన దేశ పునర్నిర్మాణం పర్యావరణ సానుకూల డిజైన్లతో జరగాలని భావిస్తున్నారు.

ఈ బాధ్యతలకు ముందు ఆమె యుక్రెయిన్ ప్రభుత్వంలో 2019 నుంచి 2022 వరకు డిప్యూటీ ఎన్విరాన్‌మెంట్ మినిస్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో పర్యావరణ మార్పు విధానాలు, యూరోపియన్ ఐక్యత, అంతర్జాతీయ సంబంధాలు, జీవ వైవిధ్యం వంటి అంశాలపై పనిచేశారు.

ఎకో యాక్షన్, కీయెవ్ సైక్లిస్ట్ అసోసియేషన్ అనే ప్రముఖ పర్యావరణ సంస్థలకు ఆమె సహ వ్యవస్థాపకురాలు. పర్యావరణ మార్పులపై పోరాడుతున్న స్థానిక సంస్థలను తన ఎన్జీవోలతో కలిపి పని చేయడంలో సమన్వయకర్తగా వ్యవహరించారు.

ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులను ప్రశాంతంగా మార్చగలగడమే మన ముందున్న లక్ష్యం. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ చెప్పినట్టు అవసరమైనది చేయడం ప్రారంభించండి. సాధ్యమైనంత చేయండి. అప్పుడు అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది.

ఇరినా స్టావ్‌చుక్

గ్లోరియా స్టైనెమ్

గ్లోరియా స్టైనెమ్, అమెరికా

మహిళ హక్కుల నేత

గ్లోరియా స్టైనెమ్ 1970ల నుంచి గ్లోబల్ ఫెమినిస్ట్ ఉద్యమ నాయకురాలుగా ఉన్నారు, ఫెమినిజం కోసం ఆమె చేసిన కృషిని కొన్ని తరాలుగా ప్రపంచం గుర్తిస్తోంది.

స్టైనెమ్ సమానత్వం కోసం పోరాటం చేస్తున్నారు. ఆమె రచయిత, జర్నలిస్టు, లెక్చరర్, హక్కుల కార్యకర్త, మీడియా అధికార ప్రతినిధిగా అనేక పాత్రలు పోషించారు.

1971లో ప్రారంభమై ఇప్పటికీ ప్రచురితం అవుతున్న 'మిస్ మేగజైన్‌'కు ఆమె సహ వ్యవస్ధాపకురాలు. మహిళల హక్కుల ఉద్యమాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో తొలి తరం వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందారు.

89 సంవత్సరాల వయసులోనూ స్టైనెమ్ తాను చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. దీంతో పాటువిమెన్ మీడియా సెంటర్, ERA కూటమి, ఈక్వాలిటీ నౌ లాంటి సంస్థలకు మద్దతు అందిస్తున్నారు.

బెర్నాడెట్ స్మిత్

బెర్నాడెట్ స్మిత్, టర్టిల్ ఐలండ్, కెనడా

గల్లంతైన వారి కుటుంబాల తరపు న్యాయవాది

2008లో సోదరి కనిపించకుండా పోయినప్పటి నుంచి సమాధానాల కోసం అలసట లేకుండా వెదికారు బెర్నాడెట్ స్మిత్.

కెనడాలో కనిపించకుండా పోయిన కుటుంబాలు, హత్యకు గురైన ఆదివాసీ మహిళలు, బాలికల కేసులు వాదించే ప్రముఖ లాయర్‌గా ఎదిగారామె. కొంతమంది సభ్యులతో ఓ కూటమి ఏర్పాటు చేసి కనిపించకుండా పోయిన వారి కోసం గాలిస్తూ సమాధానాల కోసం అన్వేషించారు.

గల్లంతైన వారి శరీరాలు, వారికి సంబంధించిన ఆధారాల కోసం విన్నిపెగ్ రెడ్ రివర్‌లో వెదికే డ్రాగ్‌ద రెడ్ అనే సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలు.

మనిటోబా అసెంబ్లీకి వరుసగా మూడవసారి ఎన్నికయ్యారు స్మిత్. అంతే కాదు ఈ రాష్ట్రంలో ఫస్ట్ నేషన్స్‌గా చెప్పే రెండు ఆదిమవాసుల తెగల నుంచి మంత్రివర్గంలోచేరిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె ప్రస్తుతం గృహ నిర్మాణం, వ్యసనాలు, నిరాశ్రయుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రెనిటా హోమ్స్

రెనిటా హోమ్స్, అమెరికా

హౌసింగ్ క్యాంపెయినర్

మయామీలోని లిటిల్ హైతీలో ఉంటున్న మేడమ్ రెనిటా హోమ్స్ ఓ.యు.ఆర్ హోమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది ఈ సంస్థ. వెనుకబడిన వర్గాలకు ఇళ్ల హక్కు కోసం ఆమె పోరాడుతున్నారు.

వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరుగుతూ ఉండటంతో.. సముద్ర తీరానికి కాస్త దూరంగా ఉన్న ప్రాంతాల్లో స్థలాల ధరలు భారీగా పెరుగుతున్నాయి.

పదకొండు మంది పిల్లల్లో ఒకరిగా పెరిగిన హోమ్స్ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

పర్యావరణ మార్పులను సైన్స్ ఆధారిత విద్య ద్వారా ఎదుర్కొనేందుకు క్లియో ఇన్‌స్టిట్‌ట్యూట్ నడుపుతున్న మహిళా సంఘటన కార్యక్రమంలో ఆమె పని చేస్తున్నారు. ఆఫ్రికన్- అమెరికన్, ఇన్నర్- సిటి విమెన్ లాంటి అంశాలలో స్థానిక గృహ సంస్థలకు ఆమె సహాయం అందిస్తున్నారు.

మన బంధాన్ని మాతృభూమి- మహిళలుగా గుర్తించాలనే ఆశ ఉంది. మేము సంతోషంగా ఉన్నాం, బలంగా, స్థిరంగా ఉన్నాం. మేము జాగ్రత్తగా ఉండేందుకు చర్యలు తీసుకొంటాం.

రెనిటా హోమ్స్

ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ

లియాన్నే కలెన్ అన్స్‌వర్త్

లియాన్నే కలెన్ అన్స్‌వర్త్, బ్రిటన్

సముద్ర శాస్త్రవేత్త

సముద్రం లోపల పెరిగే గడ్డి కార్బన్‌ను నిల్వ చేసుకోవడంతో పాటు చేపలకు ఆహారం అందించడంలో అత్యంత కీలకమైనది. అయితే సముద్రాల లోపల ఇవి క్రమేపీ నాశనం అయ్యాయి.

బ్రిటన్ సముద్ర తీరంలో సీ గ్రాస్‌ను అర్థవంతమైన స్థాయిలో పునరుద్దరించేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు సీ గ్రాస్ సంస్థకు లియాన్నే కలెన్ అన్స్‌వర్త్ వ్యవస్థాపకురాలు, సీఈఓ కూడా.

ఈ ప్రాజెక్టు ద్వారా రిమోట్ కంట్రోల్ రోబోట్‌తో సముద్రం అడుగున విత్తనాలు నాటుతారు. సముద్రాల్లో నీటి అడుగున పచ్చిక భూముల్ని పునరుద్దరించడంలో మిగతా దేశాలకు ఈ ప్రాజెక్టు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.

సముద్రాల్లో పరిశోధనలకు సంబంధించి 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న కలెన్ అన్స్‌వర్త్ సముద్రాల పరిరక్షణ, వాటి జీవజాలాన్ని పునరుద్దరించడం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.

ఒంటరిగా ఏదైనా సాధించడం కొంతమందికి చాలా కష్టమైన వ్యవహారం. అయితే కొంతమంది కలిసి పని చేయడం, సాంకేతికతను పంచుకోవడం ద్వారా ఇది తేలికవుతుంది. నేను చేస్తున్న ఈ చిన్న పని వల్ల ఒక చిన్న జీవావరణాన్ని పునరుద్దరించవచ్చు. దీన్ని సంరక్షిస్తే అది సమాజానికి, భూమికి మేలు చేస్తుంది.

లియాన్నే కలెన్ అన్స్‌వర్త్

జెన్నిఫర్ ఉచెండు

జెన్నిఫర్ ఉచెండు, నైజీరియా

మానసిక ఆరోగ్య ఉద్యమకారిణి

కొంతమంది బలమైన కోరిక ఉన్న యువకుల నాయకత్వంలో జెన్నిఫర్ ఉచెండు స్థాపించిన సస్టి వైబ్స్‌ అనే సంస్థ లక్ష్యం మానసిక స్థిరత్వాన్ని, ప్రశాంతతను సాధించడం.

ఆఫ్రికన్లు ,ముఖ్యంగా ఆఫ్రికన్ యువత మానసిక ఆరోగ్యంపై పర్యావరణ సంక్షోభం ప్రభావం ఏ విధంగా ఉండనుంది అనే విషయం ప్రధానాంశంగా ఆమె పని చేశారు.

2022లో ఆమె ది ఎకో యాంగ్జైటీ ఆఫ్రికా ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దీని ద్వారా పర్యావరణ మార్పుల కారణంగా ఆఫ్రికన్లు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను తెలుసుకుంటూ వారికి సాయం అందిస్తున్నారు.

పర్యావరణ మార్పుల గురించి పని చేస్తూ భావోద్వేగాలకు గురవుతూ, ఒక్కోసారి అసౌకర్యాన్ని అనుభవిస్తున్న కార్యకర్తలు, ఉద్యమ సంస్థలతో పని చేస్తూ వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయడం ఆమె లక్ష్యం.

పర్యావరణ సంక్షోభం విషయంలో నేను చాలాసార్లు భావోద్వేగానికి గురయ్యాను. అయితే నేను ఒంటరిగా పూర్తి మార్పు తీసుకురాలేను కానీ నేను చేయగలిగినంత చేస్తాను అని సర్దిచెప్పుకుంటున్నాను. ఇతరుల పోరాటానికి సంఘీభావం తెలపడం ద్వారా నా పని చేసుకుంటూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను.

జెన్నిఫర్ ఉచెండు

సోనియా కష్నర్

సోనియా కష్నర్, అమెరికా

అడవుల్లో మంటలను గుర్తించే టెక్నాలజీ డెవలపర్

ఈ ఏడాది ప్రపంచంలోని అతి పెద్ద అడవుల్లో అగ్గి రాజుకుని వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం బూడిదైంది. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు అగ్నిమాపక విభాగం అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ మంటలను ముందుగా గుర్తించేందుకు సోనియా కష్నర్ ఒక సంస్థను స్థాపించారు.

అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగినప్పుడు అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా భూ ఉపరితలాన్ని స్కాన్ చేసి వెంటనే స్పందించి సమాచారం అందించేలా పనో ఏఐ అని సాంకేతికతను అభివృద్ధి చేశారు. మంటలను గుర్తించి ఎమర్జెన్సీ బృందాలకు ఫోన్ చేయడానికి ముందే ఈ సాంకేతికత వేగంగా స్పందిస్తుంది.

వివిధ రకాల టెక్ స్టార్టప్‌ల స్థాపనలో కష్నర్ పదేళ్లకు పైగా కృషి చేశారు.

మనుషుల్లోని అతి గొప్పదైన అన్వేషణ శక్తి నాకు ఆశ కల్పిస్తుంది. వాతావరణ సంక్షోభం వల్ల ఏర్పడే దుష్పరిణామాలను పరిష్కరించడంలో టెక్నాలజీ, డేటా ఆధారిత పరిష్కారాలు అత్యుత్తమైన సమాచారాన్ని అందించడాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను.

సోనియా కష్నర్

ట్రాన్ గామ్

ట్రాన్ గామ్, వియత్నాం

బయోగ్యాస్ వ్యాపారవేత్త

2012లొ వియత్నాంలోని వ్యవసాయానికి, పొలాలకు పర్యావరణ హిత ఇంధన వనరులను పరిచయం చేశారు ట్రాన్‌ గామ్.

ఇద్దరు పిల్లల తల్లి అయిన ట్రాన్ మార్కెట్‌లో పర్యావరణ హిత ఇంధన వనరులు పెద్దగా అందుబాటులో లేకపోవడంతో హనోయిలో బయోగ్యాస్ ప్లాంట్లను ప్రారంభించడమే కాక వాటి కార్యకలపాలను మూడు పొరుగు రాష్ట్రాలకు విస్తరించారు.

ఈ ప్రాజెక్ట్‌లో ఆవు, పందుల పేడ ఇతర వ్యర్ధాలను బయోగ్యాస్‌గా మార్చడం ద్వారా రైతులకు చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. ఇది సహజవాయువు కన్నా స్థిరమైన ఇంధన వనరుగా వంట చేయడానికి ఉపయోగపడుతుంది.

ట్రాన్స్ తన వ్యాపారం ద్వారా స్థానిక సమాజాలలో మార్పును తీసుకురావడమే కాక పర్యావరణ మార్పులపై పోరాటంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.

మనం భూమిపై ప్రశాంతంగా జీవనం సాగించాలి. కాబట్టి నేను నా సన్నిహితులందరికీ మంచి సమతుల ఆహారం తీసుకోవాలని, వ్యాయామం తప్పనిసరని, సరైన నిద్ర అవసరమని చెబుతుంటాను. సేంద్రియ జీవనశైలిలో భాగంగా వీలైనంత వరకు కూరగాయలు, పళ్లు పండించమని చెబుతుంటాను. రసాయనాలు కలిసిన కూరగాయలకు దూరంగా ఉండమని కూడా సలహా ఇస్తాను.

ట్రాన్ గామ్

టిమ్నిట్ గెబ్రు

టిమ్నిట్ గెబ్రు, అమెరికా

కృత్రిమ మేధ నిపుణురాలు

టిమ్నిట్ గెబ్రు కృత్రిమ మేధస్సులో తిరుగులేని వ్యక్తి. డిస్ట్రిబ్యూటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసెర్చ్ ఇన్స్‌టిట్యూట్ వ్యవస్థాపకురాలు కూడా. దీని ద్వారా పెద్ద పెద్ద కంపెనీలే కాకుండా ఆసక్తి ఉన్న సాధారణ వ్యక్తులు కూడా ఏఐ టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి ఆమె సహాయపడుతున్నారు.

ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలలో కనిపించే రేసిజంను ఆమె తీవ్రంగా విమర్శిస్తారు. ఎఐ టెక్నాలజీలో నల్ల జాతీయులను కూడా భాగం చేసేందుకు ఆమె నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌ స్థాపించారు.

ఇథియోపియాలో పుట్టిన ఈ కంప్యూటర్ సైంటిస్ట్ తమ దేశ విద్యార్థులకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మెళకువలు నేర్పించేందుకు అడ్డిస్ కోడర్ అనే సంస్థను స్థాపించారు.

ఆమె గూగుల్ ఎథికల్ ఏఐ టీమ్‌లో కో-లీడ్‌గా పనిచేస్తున్నప్పుడు ఏఐ లాంగ్వేజ్ మోడల్స్, మైనారిటీల పట్ల వివక్ష గురించి ఒక ఓ ప్రశ్నా పత్రాన్ని రూపొందించడంలో సహరచయితగా ఉన్నారు.

అయితే దాని తర్వాత ఆమె కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు. అవసరమైన పరిశోధన చేయకుండానే ఆ ప్రశ్నా పత్రాన్ని తయారు చేశారని కంపెనీ తెలిపింది. అయితే పనిప్రదేశంలో వివక్ష గురించి ప్రశ్నించినందుకే తనని తొలగించారని గెబ్రూ అన్నారు.

క్లాడియా గోల్డిన్

క్లాడియా గోల్డిన్, అమెరికా

ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత

క్లాడియా గోల్డిన్ అమెరికన్ ఆర్థిక విశ్లేషకురాలు, కార్మిక మార్కెట్ అధ్యయనవేత్త, మహిళల్లో ఉపాధి, స్త్రీ, పురుషుల మధ్య వేతనాల్లో వ్యత్యాసం అనే అంశాల్లో చేసిన కృషికి గాను ఈ ఏడాది అర్థ శాస్త్రంలో నోబెల్ బహుమతి ఆమెను వరించింది.

ఆర్థశాస్త్రంలో నోబెల్ దక్కించుకున్నమూడవ మహిళ క్లాడియా. అంతేకాదు, మగవారితో అవార్డు పంచుకోకుండా సొంతంగా అందుకున్న మొదటి మహిళ కూడా.

గోల్డిన్ ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో హెన్రీ లీ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆర్థిక అసమానతలు, విద్య, ఇమ్మిగ్రేషన్ వంటి అంశాలపైన ఆమె పరిశోధన చేస్తున్నారు.

గతంలో కుటుంబం, కెరీర్ పట్ల మహిళల తపన, మహిళల కెరీర్, పెళ్లి గురించి నిర్ణయాలు తీసుకోవడంలో గర్బ నిరోధక మాత్రల ప్రభావం గురించి ఆమె ప్రభావవంతమైన రచనలు చేశారు.

సుసాన్ చోంబా

సుసాన్ చోంబా, కెన్యా

సైంటిస్ట్

సుసాన్ చోంబా ప్రస్తుతం ప్రపంచ వనరుల సంస్థకు డైరెక్టర్‌.సెంట్రల్ కెన్యాలోని కిరిన్యాగా కౌంటీలో పెరిగిన ఆమె, చిన్నతనంలో తీవ్రమైన పేదరికాన్ని అనుభవించారు. ఆమె అనుభవాలే ఇతరుల జీవితాలు బాగుపడేలా సాయం అందించేందుకు ప్రోత్సహించాయి.

అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఆఫ్రికా ఆహార వ్యవస్థల్లో మార్పుల కోసం ఆమె ప్రధానంగా కృషి చేస్తున్నారు.

కాంగో బేసిన్‌లోని ఉష్ణమండల అటవీ ప్రాంతాల నుంచి మొదలై, పశ్చిమాఫ్రికాలోని పొడి వాతావరణం ఉండే సహేల్ ప్రాంతం, తూర్పు ఆఫ్రికా ప్రాంతాల్లోని చిన్నతరహా రైతులతో కలిసి ఛోంబా సమయం గడుపుతున్నారు. వారిలో ముఖ్యంగా మహిళలు, యువతులు వ్యవసాయ భూముల నుంచి అధిక లాభాలు ఆర్జించేలా శిక్షణ ఇస్తున్నారు.

తీవ్రమవుతున్న వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేలా స్థితిస్థాపక ప్రజా సముదాయాలను నిర్మించడంలో ప్రభుత్వాలు, పరిశోధకులకు తన నైపుణ్యాన్ని పంచుతున్నారు.

ప్రపంచ దేశాల నాయకుల నుంచి చర్యలు లేకపోవడం చాలా బాధిస్తోందని ఛోంబా అంటున్నారు. కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాలు, వాటిని తగ్గించేలా కార్యచరణ దిశను మార్చగలిగే ఆర్థిక శక్తి ఉన్నప్పటికీ డబ్బు, అధికారం, రాజకీయాల కారణంగా వెనకడుగు వేయడాన్ని ఛోంబా విమర్శిస్తున్నారు. ఈ భావోద్వేగాల నుంచి బయటపడేందుకు ఆమె ఆఫ్రికా అంతటా క్షేత్రస్థాయిలో మహిళలు, యువతులతో కలిసి పర్యావరణ హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సుసాన్ చోంబా

గ్లాడిస్ కలేమా జికుసొకా

గ్లాడిస్ కలేమా జికుసొకా, యుగాండా

పశువైద్యురాలు

అవార్డ్ గెలుచుకున్న యుగాండా పశువైద్యురాలు, పర్యావరణ పరిరక్షకురాలు గ్లాడిస్ కలేమా జికుసొకా. పర్యావరణ మార్పుల కారణంగా ఆవాసాలు కోల్పోతున్న పర్వత ప్రాంత గొరిల్లాలను కాపాడటానికి పనిచేస్తున్నారామె.

ప్రజలు, గొరిల్లాలు, ఇతర వన్యప్రాణాలు, వారి ఆరోగ్యం, ఆవాసాలను మెరుగుపరుస్తూ వాటితో కలిసి జీవించే పరిస్థితులను పునరుద్దరించడం ద్వారా జీవ వైవిధ్య పరిరక్షణను ప్రోత్సహించే స్వచ్చంద సంస్థ 'కన్జర్వేషన్ త్రూ పబ్లిక్ హెల్త్' కు సీఈవోగా ఉన్నారు.

మూడు దశాబ్ధాల తర్వాత , ఆమె ప్రయత్నాలు ఫలించి గొరిల్లాల సంఖ్య 300నుంచి 500కి పెరిగింది.

యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రాగ్రాం కలేమా జికుసొకాను ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ 2021గా సత్కరించింది.

పర్యావరణ పరిరక్షణ అత్యవసరమని ప్రజలు గుర్తించారన్న వాస్తవం, మనం దీని నుంచి బయటపడగలం అన్న నమ్మకాన్నిస్తుంది. ఈ సంక్షోభాన్ని అడ్డుకోవడానికి ఎన్నో అధునాతన పద్దతులున్నాయి.

గ్లాడిస్ కలేమా జికుసొకా

ఫేబియెలా ట్రెజో

ఫేబియెలా ట్రెజో, మెక్సికో

సామాజిక మానసిక నిపుణులు

సామాజిక మానసిక నిపుణులు ఫేబియోలా ట్రేజో ఇరవైయ్యేళ్ల క్రితం తన చదువుకోవడం మొదలు పెట్టినప్పుడు మెక్సికోలో – సామాజిక న్యాయ అంశాల్లో మహిళల్లో లైంగిక భావప్రాప్తి అనే అంశంపై అసలు పరిశోధనేదే లేదు.

ట్రెజో చేపట్టిన కార్యక్రమాల వల్ల సామాజిక అసమానతలు, మహిళలపై హింస, లైంగిక దోపిడీ ద్వారా రాజ్యాధికారం, మహిళలకు సెక్సువల్ జస్టిస్ లాంటి సమస్యల పరిష్కారానికి బాట వేశారు.

సమాజంలోని కొన్ని రకాల అసమానతల వల్ల మహిళలు లైంగిక దోపిడికి తేలికైన లక్ష్యాలుగా మారారనేది ట్రేజో వాదన. అనేక సభలు, పరిశోధనలు, వర్క్‌షాపుల ద్వారా లైంగిక భావప్రాప్తి పట్ల అవగాహన కల్పిస్తూ లైంగిక దోపిడీని ఎదుర్కోవడంలో ప్రజలకు శిక్షణ ఇస్తున్నారు.

లాటిన్ అమెరికా, స్పానిష్ సముదాయాల్లో మహిళల ఆరోగ్యం,శృంగారం పాపమనే అపోహను తొలగించేందుకు ఆమె కృషి చేశారు.

కెనాన్ డెగ్డెవిరెన్

కెనాన్ డెగ్డెవిరెన్, తుర్కియే

సైంటిస్ట్

కెనాన్ అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలినాళ్లలోనే గుర్తించేందుకు వీలుగా ఆమె వేరబుల్ అల్ట్రా సౌండ్ ప్యాచ్‌ను తయారుచేశారు.

క్రమం తప్పకుండా క్యాన్సర్ పరీక్షలు చేయించుకునే ఆమె అత్తయ్య కాన్సర్ బారిన పడి 49 ఏళ్ల వయసులోనే మరణించారు. దీంతో క్యాన్సర్ బాధితుల కోసం ఏదో ఒకటి చేయాలని ఆమె ఆలోచించారు.

ఆమె అత్త మంచంలో ఉండగానే మహిళలు ధరించే బ్రాలోనే ఓ పరికరాన్ని ఉంచుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ సోకిన వారిని ఎప్పడికప్పుడు పరీక్షించడం సాధ్యమవుతుందా అనే దానిపై ఓ ప్రణాళిక సిద్ధం చేశారు. ఆమె కనుక్కున్న సాంకేతికత ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను రక్షిస్తున్నారు.

అనామారియా ఫాంట్

అనామారియా ఫాంట్, వెనెజ్వెలా

పార్టికల్ ఫిజిసిస్ట్

భౌతిక శాస్త్ర పరిశోధకురాలైన ప్రొఫెసర్ అనామారియా ఫోంట్ ప్రకృతిలోని అన్ని కణాలు, ప్రాథమిక శక్తులను ఒకే సిద్ధాంతంలో వివరించే సూపర్ స్ట్రింగ్ థియరీపై అనేక పరిశోధనలు చేశారు.

పదార్థం, గురుత్వాకర్షణ శక్తికున్న బలానికి సంబంధించిన సిద్ధాంతాన్ని మరింత లోతుగా తెలుసుకునేందుకు ఫాంట్స్ పరిశోధన ఉపయోగపడింది. పదార్ధం, గురుత్వాకర్షణ బలం బిగ్ బ్యాంగ్ ప్రయోగంలో బాగంగా మొదటగా పుట్టుకొచ్చిన బ్లాక్ హోల్స్ గురించి వివరిస్తాయి.

గతంలో ఆమె వెనెజ్వెలాలో ఇచ్చే ఫుండేసియోన్ పోలార్ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది యునెస్కో విమెన్ ఇన్ సైన్స్ అవార్డుకు ఎంపికయ్యారు.

మర్సెలా ఫెర్నాండెజ్

మర్సెలా ఫెర్నాండెజ్, కొలంబియా

సాహసయాత్ర గైడ్

పర్వత ప్రాంతాల్లో స్థానికులకు పరిశుభ్రమైన నీరు అందించడంలో హిమానీ నదాలది కీలక పాత్ర. అయితే కొలంబియాలో అవి వేగంగా కనుమరుగవుతున్నాయి.

మర్సెలా ఫెర్నాండెజ్ , ఆమె సన్నిహితురాలు కలిసి కుంబ్రెస్ బ్లాంకాస్( తెల్లటి శిఖరాలు) అనే స్వచ్చంధ సంస్థ స్థాపించారు. గతంలో 14గా ఉన్న హిమానీ నదాల్లో ప్రస్తుతం ఆరు మాత్రమే మిగిలాయనే అంశంపై స్థానికుల్లో అవగాహన పెంచారు.

శాస్త్ర పరిశోధనలు, కొంతమంది పర్వతారోహకులు, ఫోటోగ్రాఫర్లు, శాస్త్రవేత్తలు, కళాకారులతో కలిసి హిమానీ నదాలను రక్షించేందుకు చర్యలు చేపట్టారు.

పజాబొర్డో( శాంతి చర్చలు) అనే కార్యక్రమం కింద కొలంబియాలో 50 ఏళ్లుగా కొనసాగుతున్న సాయుధ సంఘర్షణలో హింస వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించారు.

వేదనతో ఎలా నడచుకోవాలో హిమానీ నదాలు నాకు చెప్పాయి, అవి అంతరించిపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో వాటిని చూసినప్పుడు తెలుస్తుంది. వాటిని తిరిగి తీసుకురాలేం. అయితే మనం వాటిని కాపాడేందుకు ఏదో ఒక ప్రయత్నం చెయ్యగలం.

మర్సెలా ఫెర్నాండెజ్

బయాంగ్

బయాంగ్, చైనా

డైరీయిస్ట్

బయాంగ్ 2018 నుంచే పర్యావరణ డైరీని నిర్వహిస్తున్నారు. స్థానిక జీవజాతులు, నీటి వనరుల్లో మార్పులను అందులో నమోదు చేస్తున్నారు. వాతావరణాన్ని రికార్డు చేస్తూ మొక్కలను పర్యవేక్షిస్తున్నారు.

ఆమె చైనాలోని షాంఘై ప్రావిన్స్‌లో ఉంటున్నారు. ఈ ప్రాంతం చాలావరకు టిబెటన్ పీఠభూమిలో బాగంగా ఉంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ ప్రాంతంలో ఇప్పటికే హిమానీ నదాలు కరిగిపోవడం, ఎడారీకరణ పెరగడం వంటి వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి.

సనియాంగ్యాన్ మహిళా పర్యావరణవేత్తల నెట్‌వర్క్‌లో ఆమె ఇప్పటికే సభ్యురాలిగా ఉన్నారు. తన ప్రజల ఆరోగ్యం, సుస్థిరాభివృద్ధి కోసం పోరాడుతున్నారు.

లిప్ బామ్, సబ్బులు, బ్యాగుల వంటి వస్తువులను పర్యావరణ హితంగా తయారు చేయడంలో నైపుణ్యం సాధించారు. స్థానిక నీటి వనరులను రక్షించేలా తన తోటి వారిని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు.

అమీన అల్ బీష్

అమీన అల్ బీష్, సిరియా

వలంటీర్ రెస్క్యూ వర్కర్

సిరియాలో 2017లో అంతర్యుద్ధం తీవ్రమైంది. దాంతో సిరియా సివిల్ డిఫెన్స్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు అమీన అల్ బీష్. ఇందులో చేరిన మొదటి మహిళ అమీన. ఈ సహాయ సంస్థకు వైట్ హెల్మట్స్ అనే పేరు కూడా ఉంది. గాయపడిన ప్రజల ప్రాణాలు కాపాడి, వారికి ప్రాథమిక చికిత్సను అందిస్తుంది ఈ సంస్థ.

2023లో సిరియా, తుర్కియేలను భారీగా కుదిపేసిన భూకంపంలో, బాధితులుగా మారిన ప్రజలను కాపాడేందుకు అమీన పని చేశారు. ఈ భూకంపంలో అనేక భవనాలు నేలకూలాయి. భవన శిథిలాల కింద అమీన కుటుంబ సభ్యులు కూడా చిక్కుకుపోయారు.

ప్రస్తుతం అమీన అల్ బీష్ – ఉత్తర సిరియాలోని స్థానిక మహిళల జీవితాలు మెరుగుపడేందుకు పని చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అమీన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చదువుతున్నారు. శాంతియుత సిరియా పునర్నిర్మాణంలో పని చేయడం ఆమె కల.

నేహ మంకని

నేహ మంకని, పాకిస్తాన్

మిడ్‌వైఫ్

నిరుడు పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తినప్పుడు, అక్కడున్న గర్బిణులకు పురుడు పోసేందుకు నేహా మంకని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు.

ఆమె స్థాపించిన మమా బేబీ ఫండ్ ద్వారా మంకని, ఆమె బృందం 15వేల వరద ప్రభావిత కుటుంబాలకు ప్రాణ రక్షణ కిట్లు, ప్రసవాలకు సంబంధించిన సేవలను అందించారు.

తక్కువ వనరులతో సాయం అందించడం, వేగంగా స్పందించడం, వాతావరణ మార్పుల బాధితులకు సాయం అందించడంపై ఆమె దృష్టి పెట్టారు.

తీర ప్రాంతాల్లో నివసించే కుటుంబాల్లో గర్భిణులైన మహిళలను అత్యవసర వైద్యం కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించేందుకు అవసరమైన బోట్ అంబులెన్స్ కొనగలిగేంత స్థాయిలో మమా బేబీ ఫండ్ నిధులు సేకరించింది.

వాతావరణ విధ్వంసకర సమయాలలో పురుడు పోసే మహిళల సేవలు కీలకమైనవి. మేము మొదట స్పందించేవాళ్లం, పర్యావరణ కార్యకర్తలం. గర్బవతులు, బిడ్డలకు జన్మనిచ్చే మహిళలు, ప్రసవానంతరం వారి బాగోగులు మేము చూసుకుంటాం. వారి చుట్టు పక్కల పరిస్థితులు ఎంత క్షీణిస్తున్నామేము వెనకడుగు వెయ్యం.

నేహ మంకని

వంజీరా మతాయి

వంజీరా మతాయి, కెన్యా

పర్యావరణ సలహదారు

పర్యావరణ మార్పుల పట్ల పోరాటంలో వంజీరా మతాయికి 20 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. ఆఫ్రికాలోని స్పూర్తిదాయక మహిళ నాయకులలో ఆమె కూడా ఒకరు.

గ్రీన్ బెల్ట్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. తన తల్లి, నోబెల్ శాంతి బహుమతి విజేత వంగారి మతాయి కెన్యాలో స్థాపించిన స్వచ్చంధ సంస్థ ద్వారా మెక్కలు నాటుతూ మహిళా సాధికారతను పెంపొందిస్తున్నారు.

వంజీరా మతాయి ప్రస్తుతం వంగారి మతాయి ఫౌండేషన్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఆఫ్రికా అండ్ గ్లోబల్ పార్టనర్‌షిప్ ఎట్ వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్‌టిట్యూట్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

బెజోస్ ఎర్త్ ఫండ్‌, క్లీన్ కుకింగ్ అలయన్స్, ద యూరోపియన్ క్లైమేట్ ఫౌండేషన్‌కు ఆఫ్రికాలో సలహాదారుగా సేవలు అందిస్తున్నారు.

స్థానికతే మాకు ప్రధానం. ముందు ఇక్కడి చిన్న చిన్న వ్యాపారవేత్తలను ప్రోత్సహించాలి. పునరుత్పాదక శక్తి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటివి మా సముదాయం నుంచే ప్రారంభం కావాలి. క్షేత్రస్థాయి నుంచి ప్రయత్నించడం వలన ఏమేం చేయగలుగుతాం అనేదానిపై నమ్మకం కలుగుతుంది.

వంజీరా మతాయి

ఇసబెల్ ఫారియాస్ మెయర్

ఇసబెల్ ఫారియాస్ మెయర్, చిలీ

ఎర్లీ మెనోపాజ్ ప్రచారకర్త

ఇసబెల్ ఫారియాస్ మెయర్, సరైన సమయానికి రుతుక్రమం రాకపోవడాన్నిపెద్ద అరోగ్య సమస్యగా భావించలేదు. కానీ ఆమె పద్దెనిమిదేళ్ల వయసులో ఎర్లీ మెనోపాజ్ సమస్య బయటపడ్డారు. దీనినే అకాల అండాశయ వైఫల్యంగా చెప్పొచ్చు. మహిళల్లో అండాశయం పని చేయనపుడు ఈ సమస్య వస్తుంది. నలభైయ్యేళ్లలోపు వయసున్న ఒక శాతం మహిళల్లో ఎర్లీ మెనోపాజ్ ప్రభావం కనిపిస్తోంది.

అయితే మహిళల్లో మెనోపాజ్‌ లాంటి లక్షణాలు చిన్నవయసులో బయటపడుతున్నాయి. ఫారియాస్ దీని గురించి భయపడకుండా సూటిగా మాట్లాడటం ప్రారంభించారు. ఈ సమస్య కారణంగా ఆమె జీవితంపైన ఎటువంటి ప్రభావం పడిందో, ఆస్టియోపొరోసిస్ సమస్యతో జీవించడమంటే ఎలా ఉంటుందో ఆమె వివరిస్తున్నారు.

జర్నలిస్టుగా పనిచేస్తున్న ముప్పైయ్యేళ్ల ఫారియాస్, లాటిన్ అమెరికన్ దేశాల్లో ఎర్లీ మెనోపాజ్ సమస్యతో బాధ పడుతున్నవారి కోసం రీజనల్ నెట్‌వర్క్‌ను మొదలుపెట్టారు. దీని ద్వారా సరైన సమాచారాన్ని అందించడం, అపోహలు, కట్టుకథలపైన పోరాడటం, ఎర్లీ మెనోపాజ్ లక్షణాలతో బాధపడుతున్న వారి కోసం సురక్షిత వాతావరణాన్ని నిర్మిస్తున్నారు.

ఎల్హాం యూసెఫియన్

ఎల్హాం యూసెఫియన్, అమెరికా ..ఇరాన్

పర్యావరణ సలహాదారు

మానవ హక్కుల న్యాయవాది అయిన ఎల్హాం యుసెఫియన్ అంధురాలు. వాతావరణ సంక్షోభం పరిష్కారంలో వికలాంగులను భాగం చేస్తూ, సంక్షోభ సమయంలో అత్యవసర ప్రతిస్పందన ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తున్నారు.

ఇరాన్‌లో పుట్టిపెరిగినప్పటికీ ఎల్హాం 2016లో అమెరికా వలస వెళ్లారు. ఇంటర్నేషనల్ డిసెబిలిటీ అలయన్స్‌లో ముఖ్య పాత్ర పోషిస్తూ, వికలాంగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 1100 ఆర్గనేషన్ల నెట్‌వర్క్‌లో ఆమె భాగంగా ఉన్నారు.

వికలాంగులపై పర్యావరణ సంక్షోభం ప్రభావం ఎలా ఉంటుందో తెలిసేలా పాలకులకు అవగాహన కల్పించడమే ఆమె లక్ష్యం. అలాగే ఈ సంక్షోభం పై పోరాటంలో వికలాంగుల అపార సామర్థ్యాన్ని కూడా నొక్కి చెబుతారు.

వికలాంగులైనప్పటికీ, సంక్లిష్టమైన సవాళ్లను అధిగమించడంలో, పరిష్కారాలను కనుక్కోవడంలో మా సామర్ధ్యాన్ని పదే పదే నిరూపించాం. పర్యావరణ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటంలో వికలాంగులు ముందుండి పోరాడతారు.

ఎల్హాం యూసెఫియన్

బసిమ అబ్దుల్ రహ్మాన్

బసిమ అబ్దుల్ రహ్మాన్, ఇరాక్

గ్రీన్ బిల్డింగ్ ఔత్సాహిక వ్యాపారవేత్త

ఇస్లామిక్ స్టేట్ గ్రూపుగా చెప్పుకుంటున్న సంస్థ తన స్వదేశమైన ఇరాక్‌లో చాలా ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నప్పుడు బసిమ అబ్దుల్ రహ్మాన్ అమెరికాలోని యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.

సంఘర్షణలో భాగంగా ఎన్నో నగరాలు ధ్వంసమయ్యాయి. అమెరికాలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి తిరిగి స్వదేశానికి చేరుకున్న బసిమ నగరాలను పునర్నిర్మించాలని భావిస్తున్నారు.

ఇరాక్ మొదటి అధునాత గ్రీన్ బిల్డింగ్ KESK ను స్థాపించారు. ఇరాన్ సంప్రదాయ నిర్మాణ పద్దతులకు సరికొత్త ఇంధన, సమర్థవంతమైన సాంకేతికత, సామాగ్రిని జోడించి గ్రీన్ స్ట్రక్చర్లను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

భవిష్యత్తు తరాల ఉన్నతి విషయంలో రాజీ పడకుండా నిర్మాణాలను చేయడానికి ఈమె ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు.

పర్యావరణ సంక్షోభం గురించి ఆలోచించినప్పుడల్లా ఆందోళన కలిగేది. ఈ పరిస్థితిని మార్చలేను కానీ, సమస్యల నుంచి బయటపడేందుకు కృషి చేయకుండా ప్రశాంతంగా ఎలా జీవించగలం అని అనుకుంటాను.

బసిమ అబ్దుల్ రహ్మాన్

రుమైతా అల్ బసైదీ

రుమైతా అల్ బసైదీ, ఒమన్

శాస్త్రవేత్త

విమెన్ అండ్ గాళ్స్, పర్యావరణ పరిష్కారాలలో మీరు కూడా భాగమే. 2021 టెడ్ టాక్‌లో ఒమానీ శాస్త్రవేత్త రుమైతా అల్ బసైదీ ప్రసంగం టైటిల్ లైన్ ఇది. అరబ్ మహిళల హక్కులపై ఆమెకున్న అంకితభావం స్పష్టంగా కనిపించే ఈ టెడ్ టాక్‌ని పది లక్షల మందికి పైగా వీక్షించారు.

అరబ్ మహిళల హక్కులపై ఆమెకున్న మక్కువ ఆమెను అరబ్ యూత్ కౌన్సిల్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ ది ఎన్విరాన్‌మెంట్ సొసైటీ ఆఫ్ ఒమన్ బాధ్యతల వైపు నడిపించింది.

పర్యావరణ పరిరక్షణ కోసం అందించే విదేశీ సాయం విషయంలో బైడెన్ ప్రభుత్వానికి, సుస్థిర పర్యావరణాభివృద్ధిపై గ్రీన్‌ల్యాండ్ ప్రభుత్వానికి సలహాలు అందించారు.

చిన్న వయసులోనే దక్షిణ ధృవానికి చేరుకున్న మహిళగా రికార్డు సృష్టించారు. ఆమె స్థాపించిన విమెన్ ఎక్స్ సంస్థ ద్వారా మహిళలకు బిజినెస్ మెళకువలు నేర్పుతున్నారు రుమైతా.

మహిళా సాధికారత ద్వారా, బాలికలకు అవగాహన కల్పించడం ఓ అద్భుతమైన పరిష్కారం అని నా నమ్మకం. వారి ఆలోచనా విధానంలో మార్పు , వారు తీసుకునే చర్యల ద్వారా మన స్వస్థలాలను మనం సంరక్షించుకోవచ్చు.

రుమైతా అల్ బసైదీ

ఒలెనా రొజ్వాడొవ్‌స్కా

ఒలెనా రొజ్వాడొవ్‌స్కా, యుక్రెయిన్

బాలల హక్కుల న్యాయవాది

యుద్దం కారణంగా యుక్రెయిన్ చిన్నారుల పడుతున్న వేదన నుంచి వారిని బయటపడేయటమే ఒలెనా మిషన్. ఆమె సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న 'వాయిస్ ఆఫ్ చారిటీ' స్వచ్ఛంద సంస్థ మానసిక ఆరోగ్యం విషయంలో చిన్నారులకు మద్దతు అందిస్తోంది.

ఈ సంస్థ 2019 నుంచి చిన్నారులకు సాయమందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాలుగేళ్ల తర్వాత ఒలెనా యుక్రెయిన్ యుద్ధ క్షేత్రం డోన్బాస్‌లో స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు.

ఈ సంస్థ కోసం ఇప్పుడు 14 కేంద్రాలలో 100 మందికి పైగా సైకాలజిస్టులు పనిచేస్తున్నారు. హట్‌లైన్ ద్వారా కూడా ప్రజలకు తమ సేవలందిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థ లక్షల మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల మానసిక ఆరోగ్య సంరక్షణలో సాయపడింది.

ఆస్కార్ నామినేటెడ్ డాక్యుమెంటరీ ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్ నిర్మాణంలో రొజ్వాడొవ్‌స్కా తన వంతు పాత్ర పోషించారు. అలాగే తన బృందంతో కలిసి వార్ త్రూ ది వాయిసెస్ ఆఫ్ చిల్డ్రన్ పుస్తకాన్ని కూడా ప్రచురించారు.

ఆస్ట్రిడ్ లిండర్

ఆస్ట్రిడ్ లిండర్, స్వీడన్

ట్రాఫిక్ సేఫ్టీ ప్రొఫెసర్

కొన్ని దశాబ్ధాలుగా, కార్ క్రాష్ డమ్మీలలో పురుషుల బొమ్మలను వినియోగిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే గణాంకాలు మాత్రం ప్రమాదాలలో మహిళలు ఎక్కువగా చనిపోవడం లేదా గాయపడటం జరుగుతోందని చెబుతున్నాయి.

పురుషుల ఆకారంతో చేసే టెస్టింగ్ విధానాన్ని మార్చడానికి పనిచేశారు ఇంజనీర్ ఆస్ట్రిడ్ లిండర్. ప్రపంచంలోనే మొదటి సారి మహిళ ఆకారపు డమ్మీలతో టెస్ట్ చేసే ప్రాజెక్ట్‌ను చేపట్టారు.

ట్రాఫిక్ సేఫ్టీ ఎట్ ది స్వీడిష్ నేషనల్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ రిసెర్చ్ ఇన్స్‌టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా, చామర్స్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న లిండర్ బయెమెకానిక్స్ అండ్ రోడ్ ఇంజురీ ప్రివెన్షన్ నిపుణురాలు కూడా.

ఇసబెలా లుజిక్

ఇసబెలా లుజిక్, పొలాండ్

సౌండ్ రికార్డిస్ట్

చేతిలో టేప్‌రికార్డర్ పట్టుకుని పోలాండ్‌లోని అరణ్యాలలో వినిపించే ఎన్నో అద్భుతమైన శబ్ధాలను రికార్డ్ చేస్తుంటారు ఇసబెలా.

ఫీల్డ్‌లోకి వెళ్లి రికార్డిస్ట్‌గా పనిచేయడం అంత సులభం కాదు. ఎందుకంటే పురుషాధిక్యత ఉండే రంగంలో ముందుకెళ్లడం ఒక్కటే కాదు ఆమె పుట్టుకతోనే అంధురాలు కావడం కూడా మరో కారణం..

ఆమెకు 12 ఏళ్ల వయసులో తండ్రి టేప్‌రికార్డర్ కొని ఇచ్చినప్పటి నుంచే ఆమె పక్షులు, వాటి శబ్ధాలపై మమకారం పెంచుకున్నారు. అలా ఆమె ఇప్పుడు పక్షుల శబ్దాలను విని వాటి పేర్లు కూడా చెప్పగలరు.

ఎంతో అందమైన, అద్భుతమైన శబ్ధాలను అందరికీ వినిపించగలగడం కూడా తన అదృష్టం అంటారు ఇసబెలా.

కియున్ వూ

కియున్ వూ, సింగపూర్

కథా రచయిత

పర్యావరణ వేత్త, కంటెంట్ క్రియేటర్, పర్యావరణ మార్పుల గురించి సోషల్ మీడియా ద్వారా తన ఆలోచనలను షేర్ చేస్తున్నారు కియున్ వూ.

ఆమె ప్రారంభించిన వీయర్డ్ అండ్ వైల్డ్ అనే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా వాతావరణ మార్పుల గురించి ఆందోళన కలిగించని రీతిలో ప్రచారం చేస్తున్నారు.

ఆగ్నేయాసియాలో క్లిష్టంగా మారిన వాతావరణ అంశాలను తేలిగ్గా ఎలా పరిష్కరించవచ్చనే దానిపై పర్యావరణ పరిరక్షణ ప్రచారం కోసం స్థాపించిన క్లైమేట్ చీజ్‌కేక్ అనే పాడ్‌కాస్ట్‌లో ఆమె కో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

వాతావరణ మార్పుల గురించి ప్రజలు పోరాడేలా వారిలో అవగాహన పెంచడంపై దృష్టి పెడుతున్నారు.

వాతావరణ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. త్వరితగతిన మనం చేయగలిగినంత చేయాలి. పర్యావరణం గురించి మరింత తెలుసుకుంటూనే మనం పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమాలు చేపట్టాలి.

కియున్ వూ

సారా అల్ సఖ్ఖా

సారా అల్ సఖ్ఖా, పాలస్తీనా

జనరల్ సర్జన్

సారా అల్ సఖ్ఖా గాజాలోని మొట్టమొదటి మహిళా సర్జన్. ఆమె ప్రస్తుతం గాజాలోనే పెద్దదైన అల్ షిఫా ఆసుపత్రిలో పని చేస్తున్నారు.

యుద్ధ సమయంలో బాధితులకు వైద్యం అందిస్తున్న అనుభవాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. హమాస్‌ను అంతం చేయడంలో భాగంగా ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న దాడులలో అల్ షిఫా ఆసుపత్రి తీవ్రంగా ధ్వంసమైంది.

గాజాలో ఇంధనం, విద్యుత్, తిండి, నీరు కొరత కారణంగా ఆసుపత్రులలో వైద్యం అందించడం ఎంత కష్టమో ఆమె ఆన్‌లైన్‌ ద్వారా చెబుతున్నారు. అల్ షిఫా ఆసుపత్రిలో హమాస్‌పై దాడి చేయడానికి కొద్ది సేపటి ముందే ఆమె ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ గాజాలో మెడిసిన్ చదువుకున్న అల్-సఖ్ఖా, లండన్ క్వీన్ మేరీ యూనివర్శిటీలో జనరల్ సర్జరీలో పట్టా పొందారు. ఆమె తర్వాత గాజాలోని చాలా మంది మహిళలు ఆమె బాటలోనే నడిచి సర్జన్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సుమిని

సుమిని, ఇండోనేషియా

అటవీ అధికారి

ఇండోనేషియాలోని సంప్రదాయవాద అచె ప్రావిన్స్‌లో మహిళలు అధికారులుగా ఉండటం అసాధారణం.

కానీ, తమ గ్రామంలో సంభవించిన వరదలకు కారణం అడవుల నరికివేత అని, దాని కారణంగా పర్యావరణ సంక్షోభం కూడా ఎక్కువవుతుందని తెలిసినపుడు ఆమె తమ సముదాయంలోని కొందరు మహిళలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.

251 హెక్టార్లలో విస్తరించి ఉన్న అడవిని 35 ఏళ్ల పాటు దమరన్ బారూ గ్రామ ప్రజలు నిర్వహించేందుకు పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆమె బృందానికి అనుమతి మంజూరు చేసింది.

సుమత్రా పులులు, పాంగొలిన్, ఇతర అటవీ జంతుజాతుల అక్రమ వేటగాళ్లు, అడవుల్లో చెట్లను నరికేవాళ్లను పట్టుకునే విలేజ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ విభాగానికి ఆమె నాయకత్వం వహిస్తున్నారు.

అడవుల నరికివేత, వన్యప్రాణుల వేట తీవ్రమవుతూ, పర్యావరణ సంక్షోభం పెరిగిపోతున్న నేటి పరిస్థితులలో మనం అడవులపై మరింత దృష్టి పెట్టాలి. ప్రజల కోసం అడవులను కాపాడండి.

సుమిని

డాక్టర్ నటాలీ సైలా

డాక్టర్ నటాలీ సైలా, మాల్టా

డాక్టర్

అబార్షన్‌కు సంబంధించి మాల్టాలో కఠిన నిబంధనలున్నాయి. వాటికి సంబంధించి అక్కడి మహిళలకు కావల్సిన సమాచారాన్ని, సలహాలను అందిస్తున్నారు నటాలీ.

ఆమె డాక్టర్స్ ఫర్ ఛాయిస్ మాల్టా అనే సంస్థ సహ వ్యవస్థాపకురాలు. అబార్షన్ చట్టబద్దత గురించి చెబుతూ గర్భనిరోధకానికి సంబంధించి మెరుగైన అవగాహనను కల్పిస్తున్నారు.

మాల్టాలో గర్బస్రావంపై దాదాపు నిషేధం ఉంది. తల్లి ప్రాణాలకు ప్రమాదం ఉంటే తప్ప అబార్షన్‌కు అనుమతించరు. దాంతో చాలా మంది మహిళలు డాక్టర్లను సంప్రదించకుండానే గర్భనిరోధక మాత్రలు వేసుకుంటున్నారు. అబార్షన్ చేయించుకోవాలనే మహిళలకు అవసరమైన సాయం కోసం ఆమె ఓ హెల్ప్ లైన్‌ కూడా ప్రారంభించారు.

మాల్టాలో 10 నుంచి 13 ఏళ్ల లోపు వారికి శృంగారం, జననావయాల గురించి గురించి అవగాహన కల్పించేందుకు మై బాడీస్ ఫెంటాస్టిక్ జర్నీ పేరుతో ఆమె సెక్స్ ఎడ్యుకేషన్ పై ఓ పుస్తకం కూడా రాశారు.

ఆనా హుత్తునెన్

ఆనా హుత్తునెన్, ఫిన్లండ్

కార్బన్ ఇంపాక్ట్ టెక్ ఎక్స్‌పర్ట్

2021 సంవత్సరానికి యూరోపియన్ గ్రీన్ కేపిటల్‌గా నిలిచిన ఫిన్లాండ్ సిటీ లహ్టిని ఎప్పుడూ పచ్చగా, పరిశుభ్రంగా, ఎంతో అందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు ఆనా హుత్తునెన్.

నగరంలో ప్రారంభించిన అధునాతన పర్సనల్ కార్బన్ ట్రేడింగ్ మోడల్‌కు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. సైక్లింగ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వంటి పర్యావరణ అనుకూల రవాణాను వినియోగించడం ద్వారా ప్రజలు క్రెడిట్‌లను సంపాదించగలిగే మొట్టమొదటి యాప్‌ ఇక్కడ ప్రారంభించారు.

కర్బన ఉద్గారాలు లేని నగరాల కోసం కృషి చేస్తున్న క్లైమేట్ న్యూట్రల్ సిటీస్ అనే సంస్థకు ఆమె సలహాదారుగా పని చేస్తున్నారు. 2030 నాటికి క్లైమేట్ న్యూట్రాలిటీ సాధించేందుకు ఈ సంస్థ సాయం చేస్తోంది.

ఇతరులను కూడా స్థిరమైన జీవనవిధానంలో భాగం చెయ్యాలనేదే ఆమె లక్ష్యం. అందరూ వీలైనంత వరకు సైక్లింగ్‌ను భాగం చేసుకోవాలని, నగరాలలో భవిష్యత్తు రవాణా ఇదే కానుందనేది ఆమె అభిప్రాయం.

ప్రతి నగరంలోనూ ప్రజలకు మరింత స్థిరమైన జీవన విధానాన్ని అందించేందుకు చాలా మంది అద్భుతమైన కృషి చేస్తున్నారు. మీరు కూడా చేతనైనంత చేయండి. ఆ కార్యక్రమాలలో పాలు పంచుకోండి. మార్పులో భాగమవ్వండి.

ఆనా హుత్తునెన్

బీబీసీ 100 మంది మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న వారి చిత్రాలు

100 మంది మహిళలు అంటే ఏమిటి?

బీబీసీ ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా స్ఫూర్తిదాయకమైన , ప్రభావవంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేస్తుంది. మేము వాళ్ల జీవితాలు, వారి ప్రయాణం గురించి డాక్యుమెంటరీలు, ఫీచర్లు, ఇంటర్వ్యూలు చేస్తాం. వాటిని బీబీసీలోని అన్ని భాషలలోనూ ప్రచురిస్తాం. ప్రసారం చేస్తాం.

బీబీసీ 100 విమెన్ ప్రోగ్రాం ఇస్టాగ్రాం, ఫేస్‌బుక్‌లలో కూడా ఫాలో కావచ్చు. #BBC100Women ద్వార మీ అభిప్రాయాలను పంచుకోండి.

ఈ 100 మంది మహిళలను ఎలా ఎంపిక చేస్తారు?

బీబీసీ వరల్డ్ సర్వీస్ నెట్‌వర్క్‌లోని భాషలు, బీబీసీ మీడియా యాక్షన్ పరిశోధన ద్వారా సూచించిన పేర్లను ఒక బృందం షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేసిన వారిని బీబీసీ వంద మంది మహిళలుగా నిర్ణయిస్తుంది.

ఏడాది కాలంగా తాము చేపట్టిన కార్యక్రమాల ద్వార హెడ్‌లైన్లలో నిలిచిన వాళ్లు, ప్రజలను ప్రభావితం చేసిన వారు, స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారు ఇలాంటి వారందరి పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తాం.

ఈ సంవత్సరం థీమ్ - పర్యావరణ పరిరక్షణ గురించి పాటుపడుతున్న 28 మంది కార్యకర్తలు, ఉద్యమకారుల పేర్లను కూడా ఇందులో చేర్చాం. వారంతా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది మహిళలు, బాలికలను పర్యావరణ పరిరక్షణలో భాగం చేసేందుకు పనిచేస్తున్నారు.

మేము రాజకీయ రంగం, సమాజంలోని భిన్న జాతులు, ప్రాంతాలు, అనేక మంది అభిప్రాయాలను సేకరించాం. స్వంతంగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నించిన మహిళల పేర్లను నామినేట్ చేశాం.

నిష్పక్షపాతంగా అన్ని ప్రాంతాల ప్రాతినిధ్యం ఉండేలా తుది జాబితాను తయారు చేస్తాం. మహిళల పూర్తి అనుమతితోనే వారి వారి పేర్లను ఈ జాబితాలో చేర్చుతాం.